లక్షణమైన కొలువులు!

వాయుసేనలో విలువైన ఉద్యోగాలు, నౌకాదళంలో నాణ్యమైన కొలువులు యువతరం కోసం ఎదురుచూస్తున్నాయి. ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పరీక్ష ఏఎఫ్‌ క్యాట్‌ తో పాటు నేవీలో ఇంజినీర్‌ ఉద్యోగాలకోసం యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ప్రకటనలు వెలువడ్డాయి...

Updated : 15 Feb 2024 16:37 IST

రక్షణ దళాల్లోకి ప్రవేశ ప్రకటనలు

వాయుసేనలో విలువైన ఉద్యోగాలు, నౌకాదళంలో నాణ్యమైన కొలువులు యువతరం కోసం ఎదురుచూస్తున్నాయి. ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పరీక్ష ఏఎఫ్‌ క్యాట్‌ తో పాటు నేవీలో ఇంజినీర్‌ ఉద్యోగాలకోసం యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ప్రకటనలు వెలువడ్డాయి. గ్రాడ్యుయేట్లు వీటికి పోటీపడవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు నేరుగా ఫ్లయింగ్‌ ఆఫీసర్‌, సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాలను దక్కించుకోవచ్చు. ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ శిక్షణ తర్వాత ఉద్యోగంలో చేరిన తొలి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు.

ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌), ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ (ఫ్లయింగ్‌) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) నిర్వహిస్తోంది. 
ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌ / ప్లస్‌ 2 లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి.  జులై 1, 2020 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు కనీసం 162.5 సెం.మీ. తప్పనిసరి.

గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎల‌్రక్టానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులకు 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవారు అర్హులు. ఇంటర్‌/ +2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 
గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో అడ్మినిస్ట్రేషన్‌, ఎడ్యుకేషన్‌ విభాగాలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసినవారు అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఎంపిక చేసిన పీజీ కోర్సుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఎడ్యుకేషన్‌ విభాగం పోస్టులకు అర్హులు

వయసు: గ్రౌండ్‌ డ్యూటీలోని టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ అన్ని పోస్టులకూ జులై 1, 2020 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ విభాగానికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లోనూ 60 శాతం ఉండాలి. 
మెటీరియాలజీ: 50 శాతం మార్కులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత. అలాగే యూజీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో 55 శాతం మార్కులు తప్పనిసరి. 


ఇంజినీరింగ్‌ వారికి నేవీలో అవకాశం 

యూనివర్సిటీ ఎంట్రీ స్కీం (యూఈఎస్‌) పేరుతో నేవీ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలయింది. ఇందులో ఐటీ, ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచిల్లో  ఉద్యోగాలు ఉంటాయి. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ (బీఈ/ బీటెక్‌) నాలుగో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ అయిదో సంవత్సరం కోర్సు చదువుతోన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌ విద్యార్థులైతే అయిదో సెమిస్టరు వరకు, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ వాళ్లైతే ఏడో సెమిస్టర్‌ వరకు 60 శాతం మార్కులు సాధించాలి. అలాగే అభ్యర్థులు ఉద్యోగంలో చేరే సమయానికి బీటెక్‌ / ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ లో మొత్తం మీద 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి.  పురుషులు మాత్రమే అర్హులు. జులై 2, 1996 - జులై 1, 1999 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం.. 
ఇంజినీరింగ్‌ మార్కుల ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. వీరికి నేవల్‌ క్యాంపస్‌ సెలక్షన్‌ టీం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైనవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌ బీ)  డిసెంబరు - ఏప్రిల్‌ మధ్యలో అయిదు రోజులపాటు రెండు దశల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే వైద్య పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హులను ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

యూఈఎస్‌ విధానంలో ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ - ఎజిమాలలో వచ్చే ఏడాది జూన్‌ నుంచి 22 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ సమయంలో సుమారు రూ.లక్ష వరకు వేతనం అందుకోవచ్చు. 
దరఖాస్తులు:జూన్‌ 7 నుంచి 27లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in 

 


ఎలా ఎంపిక చేస్తారు? 

పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రవేశపరీక్ష మాత్రం ఉమ్మడిగా ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.  ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.

పరీక్షను ఆన్‌లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. న్యూమరికల్‌ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోనివి మాత్రం డిగ్రీ స్థాయిలో అడుగుతారు. ఈ పరీక్ష ముగిసిన వెంటనే టెక్నికల్‌ బ్రాంచి దరఖాస్తుదారులకు ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. వ్యవధి 45 నిమిషాలు. 50 ప్రశ్నలు వస్తాయి. ఐఏఎఫ్‌ వెబ్‌సైట్లో ప్రాక్టీస్‌ టెస్టు ఉంటుంది.

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ ఎస్‌ బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. 10 పుష్‌అప్స్‌, 3 చిన్‌అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌ -1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో చిన్న అసైన్‌మెంట్స్‌, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధా స్థాయులను తెలుసుకుంటారు.  ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌ -2కి వెళ్తారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇండోర్‌, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులుంటాయి. అనంతరం వ్యక్తిగత ముఖాముఖి.. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకుంటే వైద్య పరీక్షలు చేపడతారు. అందులోనూ నెగ్గినవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 
ఖాళీలు: 251. ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు: జూన్‌ 30 
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: ఆగస్టు 24, 25. https://afcat.cdac.inTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని