సర్కారు కొలువులకూ సై!

ఇంటర్మీడియట్‌ విద్యాపరంగా చిన్న అర్హతే అయినా ప్రభుత్వ ఉద్యోగాలను అందుకోడానికీ, పెద్ద స్థానాలకు చేరుకోడానికీ సాయపడుతుంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రక్షణ రంగాలు, రైల్వేలు సహా రాష్ట్ర స్థాయుల్లోనూ ఎన్నో పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణులు పోటీపడవచ్ఛు దాదాపు అన్ని నోటిఫికేషన్లూ రెగ్యులర్‌గా వస్తుంటాయి. సిలబస్‌లు, పరీక్షా విధానాలపై అవగాహన పెంచుకుని సిద్ధమైతే సర్కారు కొలువులో స్థిరపడిపోవచ్చు...

Updated : 15 Feb 2024 16:42 IST

ఇంటర్‌ తర్వాత ఉద్యోగాలు

ఇంటర్మీడియట్‌ విద్యాపరంగా చిన్న అర్హతే అయినా ప్రభుత్వ ఉద్యోగాలను అందుకోడానికీ, పెద్ద స్థానాలకు చేరుకోడానికీ సాయపడుతుంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రక్షణ రంగాలు, రైల్వేలు సహా రాష్ట్ర స్థాయుల్లోనూ ఎన్నో పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణులు పోటీపడవచ్ఛు దాదాపు అన్ని నోటిఫికేషన్లూ రెగ్యులర్‌గా వస్తుంటాయి. సిలబస్‌లు, పరీక్షా విధానాలపై అవగాహన పెంచుకుని సిద్ధమైతే సర్కారు కొలువులో స్థిరపడిపోవచ్చు.

ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే పలు రకాల ఉద్యోగాలను ఆకర్షణీయ వేతనాలతో అందుకోవచ్ఛు కెరియర్‌లో ఉన్నత స్థానానికీ చేరుకోవచ్ఛు ఏటా క్రమం తప్పకుండా వెలువడే ప్రకటనలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తిని బట్టి కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు; రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్టు గార్డు మొదలైనవి ఎంచుకోవచ్ఛు రాష్ట్ర స్థాయిలో పోలీస్‌, ఫారెస్ట్‌, ఎక్సైజ్‌ శాఖ తదితర ఉద్యోగాలకూ ప్రయత్నించవచ్చు.

ఏటా రెండుసార్లు ఎయిర్‌ ఫోర్స్‌

ఎయిర్‌మెన్‌ విభాగంలో గ్రూప్‌ ఎక్స్‌, వై ట్రేడుల్లో పలు ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రూప్‌-ఎక్స్‌: ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌ మినహా మిగిలిన పోస్టులకు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 50 శాతం మార్కులు ఉండాలి. ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి.

గ్రూప్‌-వై: మెడికల్‌ అసిస్టెంట్‌, మ్యుజీషియన్‌ మినహా ఇతర ఉద్యోగాలకు ఏదైనా గ్రూప్‌తో ఇంటర్‌ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు పొందిఉండాలి.మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ కోసం ఇంటర్‌ బైసీసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు తప్పనిసరి.

అన్ని పోస్టులకు నిర్దేశిత ఎత్తు, అందుకు తగ్గ బరువు అవసరం. వయసు 17 నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు.


 

ప్రకటనలు: ఏడాదికి రెండు సార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్‌-ఎక్స్‌ విభాగంలో ఎంపికైనవారికి ఫిట్టర్‌, గ్రూప్‌-వై విభాగంలో చేరినవారికి టెక్నీషియన్‌ ట్రేడులు కేటాయిస్తారు. నాన్‌-టెక్నికల్‌ ట్రేడుల్లో అకౌంట్‌ అసిస్టెంట్‌, అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌, ఎయిర్‌ఫోర్స్‌ పోలీస్‌, సెక్యూరిటీ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాలు ఉంటాయి. గ్రూప్‌-ఎక్స్‌ ట్రేడుల్లో ఎంపికైనవారికి శిక్షణ సమయంలో నెలకు రూ.14,600 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. శిక్షణ అనంతరం గ్రూప్‌-ఎక్స్‌ ట్రేడులకు గ్రేడ్‌ పేతో కలిపి రూ.33,100, గ్రూప్‌-వై ట్రేడులకు రూ. 26,900 మూలవేతనం ఇస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం. వీరు కెరియర్‌లో ఎయిర్‌ క్రాఫ్ట్స్‌మెన్‌ నుంచి మాస్టర్‌ వారంట్‌ ఆఫీసర్‌ వరకు చేరుకోవచ్ఛు ప్రతిభావంతులు ఆఫీసర్‌ హోదా అందుకోవడానికీ అవకాశం ఉంది.

వెబ్‌సైట్‌: https://airmenselection.cdac.in/CASB/index.html

ఆర్మీలోకి ఆహ్వానం

సోల్జర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌: ఈ పోస్టులకు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌లో 60 శాతం మార్కులు అవసరం. ప్రతి సబ్జెక్టులోనూ 50 శాత మార్కులు తప్పనిసరి.

సోల్జర్‌ టెక్‌: ఈ ఉద్యోగాలకు ఎంపీసీ గ్రూప్‌లో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు అర్హులు. అన్ని సబ్జెక్టులోనూ కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.

సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌: నర్సింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బైపీసీలో 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్ఛు ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు ఉండాలి.

అన్ని పోస్టులకు వయసు 17 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు.

ప్రకటనలు: ఏడాదికి రెండు సార్లు వెలువడతాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అనంతరం శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు. రూ.21,700 మూలవేతనంతోపాటు రూ.5200 మిలటరీ సర్వీస్‌ పే చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

రాత పరీక్షతో రైల్వేలోకి!

ఇంటర్‌ విద్యార్హతతో రైల్వేలో మంచి అవకాశాలు ఉన్నాయి. జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, జూనియర్‌ టైం కీపర్‌, ట్రెయిన్స్‌ క్లర్క్‌, కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు 18 నుంచి 30 ఏళ్లలోపువారు వీటికి అర్హులు. ప్రకటనలు రెండు లేదా మూడేళ్లకు ఒకసారి రావచ్ఛు కమర్షియల్‌ కం టికెట్‌ క్లర్క్‌ లెవెల్‌-3 ఉద్యోగం. మిగిలినవన్నీ లెవెల్‌-2 ఉద్యోగాలు. లెవెల్‌-3కి 21,700; లెవెల్‌-2 పోస్టులకు రూ.19,900 మూలవేతనం అందుతుంది. ఈ పోస్టులను రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో చూపిన ప్రతిభతో భర్తీ చేస్తారు. పోస్టు బట్టి టైప్‌ లేదా స్కిల్‌ టెస్టు ఉంటుంది. పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు.

వెబ్‌సైట్‌: http://rrbsecunderabad.nic.in/

రాష్ట్రస్థాయుల్లో...

తెలుగు రాష్ట్రాల పరిధిలోనూ ఇంటర్మీడియట్‌ అర్హతతో పలు ఉద్యోగాలను సాధించుకోవచ్ఛు పోలీస్‌, అటవీ, ఎక్సైజ్‌శాఖల నుంచి పలు పోస్టులకు ప్రకటనలు వస్తుంటాయి.

కానిస్టేబుల్‌, జైలు వార్డర్‌, ఫైర్‌ మెన్‌: ఈ పోస్టులకు ఇంటర్‌ సరిపోతుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు 18 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. జైలు వార్డర్‌, ఫైర్‌ మెన్‌ పోస్టులకు 32 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌లో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫారెస్ట్‌ సబ్‌ సర్వీస్‌: ఫారెస్ట్‌ సబ్‌ సర్వీస్‌ విభాగంలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులను ఇంటర్‌ అర్హతతో భర్తీ చేస్తారు. వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభ, నడక పరీక్ష ద్వారా ఖాళీలను భర్తీ చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంది.

వీఆర్‌ఓ: గ్రామస్థాయిలో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ ఉద్యోగాలకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ప్రకటనలు విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తుంటాయి. వీటికీ ఇంటర్‌ అర్హత సరిపోతుంది. స్థానికంగా ఉంటూనే కీలక బాధ్యతలు నిర్వహించే ఉద్యోగం ఇది. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా నియామకాలు ఉంటాయి.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

సీహెచ్‌ఎస్‌ఎల్‌: కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా భర్తీ చేస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (జేఎస్‌ఎ), పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులను నిర్వర్తిస్తారు. పరీక్షలో చూపిన ప్రతిభ, స్కిల్‌ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ ఈ పోస్టులకు అర్హులే.

స్టెనోగ్రాఫర్‌: కేంద్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ప్రకటనలు ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి వెలువడుతున్నాయి. పరీక్షలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహిస్తుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం స్టెనోగ్రఫీలో స్కిల్‌ టెస్టు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే స్టెనోగ్రాఫర్‌గా విధులు నిర్వర్తించవచ్ఛు వయసు 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

నేరుగా నేవీలోకి!

భారతీయ వాయుసేనలో ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌, సీనియర్‌ సెకండరీ రిక్రూట్‌ పోస్టులకు ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టు, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటనలు వెలువడతాయి. ఎంపికైనవారికి రూ.21,700 మూల వేతనం అందుతుంది. దీనికి మిలటరీ సర్వీస్‌ పే రూ.5200 అదనం. ఏఏకు ఎంపికైనవారు రూ.6200 గ్రూప్‌-ఎక్స్‌ పే కింద అదనంగా అందుకుంటారు. వీటన్నింటితోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఉంటాయి. వీరు మాస్టర్‌ చీఫ్‌ పెటీ ఆఫీసర్‌ హోదా వరకు చేరుకుంటారు.

కోస్టు గార్డు: కోస్టు గార్డులో నేవిక్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్ఛు ఇంటర్‌లో 50 శాతం మార్కులు ఉండాలి. 18 - 22 ఏళ్లలోపు వారు అర్హులు. రాత పరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ప్రకటనలు ఏడాదికి రెండు సార్లు వెలువడతాయి. ఎంపికైనవారికి రూ. 21,700 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర అలవెన్సులు అదనం. భవిష్యత్తులో వీరు ప్రధానాధికారి హోదా వరకు చేరుకోవచ్చు.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/ ; https://joinindiancoastguard.gov.in/

డిగ్రీ సహా ఉద్యోగం

యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ, ఆర్మీ 10+2 టెక్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్ఛు వీటికి ఎంపికైనవారిని ముందుగా ఇంజినీరింగ్‌, బీఎస్సీ, బీఏ కోర్సులను ఉచితంగా చదివించి, శిక్షణ అందిస్తారు. అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ ప్రకటనలు ఏడాదికి రెండు సార్లు వెలువడతాయి. పూర్తి వివరాలకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు లేదా లింక్‌ను ఉపయోగించవచ్చు.

https://tinyurl.com/yanxj9ck


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని