రైల్వే కోర్సులు చేద్దామా!

భారతీయ రైల్వే ..రోజూ కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా పేరుగాంచింది. సంప్రదాయ పద్ధతులను, ఆధునిక ఆవిష్కరణలను మేళవిస్తూ నిత్యనూతనంగా ప్రజలకు సేవలు అందిస్తోంది.

Updated : 04 Jan 2024 03:59 IST

భారతీయ రైల్వే ..రోజూ కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా పేరుగాంచింది. సంప్రదాయ పద్ధతులను, ఆధునిక ఆవిష్కరణలను మేళవిస్తూ నిత్యనూతనంగా ప్రజలకు సేవలు అందిస్తోంది. ఇంతటి ఘనమైన వ్యవస్థలో కొలువుల కోసం కొన్ని ప్రత్యేక కోర్సులు ఉన్నాయి. అవేంటో పూర్తి వివరాలు పరిశీలిస్తే..

మన దేశంలో రైల్వే వ్యవస్థ ఒక ప్రధాన రవాణా సాధనం. మార్కెట్లను కలగలుపుతూ విపణిని పెంచడంలో తరతరాలుగా ఇది ఎంతో ఉపకరించింది. ప్రస్తుతం దేశంలో 50కి పైగా మెట్రో రైల్‌ ప్రాజెక్టులు  నిర్మాణంలో ఉన్నాయి. ఇంతేకాక మరెన్నో పెట్టుబడులు రానున్నాయి. ఇలా పనులు జరుగుతున్న అన్ని చోట్లా మేనేజ్‌మెంట్‌ నిపుణులు అవసరం అవుతారు. అందువల్ల కొత్తగా డిగ్రీలు పూర్తిచేసుకునే యువతకు ఇది చక్కటి కెరియర్‌ మార్గం.

 ప్రస్తుతం భారతీయ రైల్వేలో ప్రభుత్వం కచ్చితమైన పెట్టుబడులను పెడుతూ ఉండటం వల్ల ఇందులో యువతకు అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రతి బడ్జెట్‌లోనూ రైళ్ల ఆధునికీకరణ, ట్రాక్‌ల పునరుద్ధరణ, హై స్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు వంటి వాటిపై దృష్టి పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రైల్వే విస్తరణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. భారత్‌లో మెట్రో రైల్‌, గతిశక్తి, ఫ్రైట్‌ కారిడార్‌ ప్రాజెక్టులు, వందే భారత్‌, మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టుల్లో నిపుణుల అవసరం ఉంటోంది. ఇందులో అవసరమయ్యే నిపుణులు ప్రధానంగా రెండు విభాగాల్లో పనిచేస్తారు. ఒకటి రైల్వే ఇంజినీరింగ్‌ కాగా మరొకటి రైల్వే మేనేజ్‌మెంట్‌.

రైల్వే ఇంజినీరింగ్‌

రైల్వే ఇంజినీరింగ్‌ అనేది ఇంజినీరింగ్‌ చదువులోనే ఒక బ్రాంచ్‌. ఇందులో అన్నివిధాలైన రైల్వే రవాణా వ్యవస్థల డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, ఆపరేషన్‌ల గురించి నేర్పిస్తారు. ఈ కోర్సులో ఇతర సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగాల గురించి కొంత సిలబస్‌ను విద్యార్థులు చదువుకుంటారు.

  • ఇందుకోసం విద్యార్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానం ఎంచుకోవచ్చు. ఇంటర్‌ తర్వాత గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఈ కోర్సును అభ్యసించి తర్వాత పీజీ స్థాయిలో మరిన్ని సర్టిఫికేషన్లను పొందవచ్చు. ప్రాథమిక అవగాహన కోసం దీనికి సంబంధించిన సర్టిఫికేషన్‌ కోర్సులు కొన్ని కోర్సెరా, యుడెమీ వంటి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వేదికల్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సులు పూర్తిచేసిన అనంతరం రైల్వే సిగ్నల్‌ ఇంజినీర్‌, స్టోర్‌ సర్వీస్‌ మేనేజర్‌ వంటి పోస్టులకు ప్రయత్నించవచ్చు. ఇండియన్‌ రైల్వేలో ట్రాఫిక్‌ సర్వీస్‌, పర్సనల్‌ సర్వీస్‌, ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ వంటి నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేయవచ్చు.


ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆన్‌లైన్‌ కోర్సులు

  •  సిస్టమ్‌ ఇంజినీరింగ్‌ - ఎడ్‌ఎక్స్‌  
  •  రైల్వే వెహికల్‌ ఇంజినీరింగ్‌ - యుడెమీ
  • ఇంట్రడక్షన్‌ టు టెట్రా - రైల్వే అకాడమీ
  •  ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ రైల్వే ఇంజినీరింగ్‌ - టీ యూ డెల్‌ఫ్ట్‌

పీజీ స్థాయిలో...

  • ఎంబీఏ - ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజ్‌మెంట్‌
  • ఎమ్మెస్సీ - ట్రాన్స్‌పోర్ట్‌ టెక్నాలజీ అండ్‌ పాలసీ
  • ఎమ్మెస్సీ రైల్వే సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌
  • దీని ద్వారా అనుభవం పెరిగేకొద్దీ జూనియర్‌ రైల్వే ఇంజినీర్‌, రైల్వే ఇంజినీర్‌ మేనేజర్‌, ఇన్వెంటరీ కంట్రోల్‌ మేనేజర్‌, కార్గో ఆపరేషన్స్‌ స్పెషలిస్ట్‌ వంటి మరిన్ని పోస్టుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

రైల్వే మేనేజ్‌మెంట్‌

  • ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్‌ రంగంలోనూ రైల్వేలో కొలువుదీరే అవకాశం ఉంది. వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఈ మేనేజ్‌మెంట్‌ నిపుణులు ముఖ్యపాత్ర పోషిస్తారు. దీన్ని ప్రధానంగా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తర్వాత విద్యార్థులు చేస్తుంటారు. పీజీ, డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులుగా అందుబాటులో ఉంది. ప్రధాన యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా చేసే వీలుంటుంది.
  • తాజాగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కాశీపూర్‌ (ఉత్తరాఖండ్‌) ఇందుకోసం ‘ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ రైల్‌ మేనేజ్‌మెంట్‌’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. 11 నెలల వ్యవధి గల ఈ కోర్సు ప్రత్యేకంగా రైల్వేలో పనిచేస్తున్న నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందులో వారాంతాల్లో తరగతులు వింటూ మొత్తం 150 గంటలపాటు క్లాసులకు హాజరుకావాలి. చివర్లో 3 రోజులపాటు క్యాంపస్‌ పర్యటన ఉంటుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, కనీసం 50 శాతం మార్కులు పొందినవారు ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కోర్సు జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
  •  దీంతోపాటు ముఖ్యమైన విద్యాసంస్థల్లో డిప్లొమా  స్థాయిలో డిప్లొమా ఇన్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఎకనమిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  విద్యార్థులు వీటిలో దేన్నయినా ఎంచుకోవచ్చు.

ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌

యూపీఎస్సీ 2023 నుంచి కొత్తగా ‘ఇండియన్‌ రైల్వేస్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌’ పరీక్ష నిర్వహిస్తోంది. గత పరీక్షల కంటే ఇది భిన్నమైనది. అత్యున్నత స్థాయుల్లో విధులు నిర్వహించాలని ఆశించే విద్యార్థులు దీనికి పోటీపడవచ్చు. ఇంజినీరింగ్‌, ఫారెస్ట్‌ సర్వీసెస్‌ మాదిరిగానే ఈ ఉద్యోగాలకు కూడా తీవ్రమైన పోటీ ఉండనుంది. ప్రత్యేకంగా సిలబస్‌ చదవడంతోపాటు పూర్తిస్థాయిలో సిద్ధం కావాల్సి ఉంటుంది. సివిల్‌ సర్వీసెస్‌ మాదిరిగానే పరిమిత ప్రయత్నాలు, ఇతర నిబంధనలు వర్తిస్తాయి.

  •  ఈ కోర్సులు పూర్తిచేసిన అనంతరం దరఖాస్తు చేసిన పోస్టులను బట్టి విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్సుల అనంతరం రైల్వేలో ఇంటర్న్‌షిప్‌లు పూర్తిచేసినవారికి ఈ పోటీ పరీక్షల్లో రిజర్వేషన్‌ లభిస్తుంది. అభ్యర్థి పూర్తిచేసిన కోర్సును బట్టి అధికస్థాయి పోస్టులకు దరఖాస్తు చేసే అర్హత సాధిస్తారు. ఉన్నత విద్యా కోర్సులు ఎంచుకోవడం ద్వారా మంచి అవకాశాలను అందుకునే వీలుంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని