కొత్తవి నేర్చుకో...ఎత్తుకు ఎదిగిపో!

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అంటే వినసొంపుగా ఉంటుంది. లక్షల జీతం, అక్షయపాత్ర వంటి జీవితం కళ్లముందు కనిపిస్తుంది. ‘ఒక్కసారి ఐటీ కొలువు కొడితే చాలు, ఆపై మనకెవరూ సాటిరారు’ అన్న ఉత్తేజం లక్షల మందిని సాఫ్ట్‌వేర్‌ రంగంవైపు నడిపిస్తోంది.

Updated : 24 Apr 2024 00:41 IST

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అంటే వినసొంపుగా ఉంటుంది. లక్షల జీతం, అక్షయపాత్ర వంటి జీవితం కళ్లముందు కనిపిస్తుంది. ‘ఒక్కసారి ఐటీ కొలువు కొడితే చాలు, ఆపై మనకెవరూ సాటిరారు’ అన్న ఉత్తేజం లక్షల మందిని సాఫ్ట్‌వేర్‌ రంగంవైపు నడిపిస్తోంది. చదివే బ్రాంచి ఏదైనా చక్కగా ఐటీ కెరియర్‌లోకి అడుగుపెట్టగలిగితే చాలు కదా అని ఆలోచించడం సహజం. అయితే ఐటీ ప్రొఫెషనల్‌ కావాలంటే ఉండాల్సిన మౌలిక నైపుణ్యాలు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ ద్వారం దగ్గర ఆపేస్తాయి. ఈ నైపుణ్యాల్లో ఎన్ని నేర్చుకున్నారు అన్నదానిపైనే విజయావకాశాలు ఆధారపడివుంటాయి. అవేంటో తెలుసుకుందామా?  

టీ ప్రొఫెషనల్‌ బాధ్యతలు విభిన్నంగా ఉంటాయి. పనిచేస్తుంటే హఠాత్తుగా ఇంటర్నెట్‌ సమస్య ఉత్పన్నమైతే దాన్ని స్వల్ప సమయంలో పరిష్కరించుకోగలగాలి. అలాగే ఒక వాణిజ్యసంస్థకు క్లౌడ్‌ సదుపాయంతో ఒక కొత్త ప్రోగ్రామ్‌ను రూపొందించగలగాలి. ఐటీ వంటి వైవిధ్య బాధ్యతలు నిర్వర్తించాలంటే కొన్ని కీలక నైపుణ్యాలు నేర్చుకొని ఉండటం అవసరం.  

సైబర్‌ సెక్యూరిటీ... జాబ్‌ ష్యూరిటీ  

వృత్తి నిపుణుడిగా ఆమోదం పొందాలంటే కోడింగ్‌ కింగ్‌లవ్వాలన్న కాంక్షతో పాటు తాను చేస్తున్న పని వాతావరణంలో సైబర్‌ సెక్యూరిటీపై దృష్టి ఉండాలి. కంచె లేకుండా ఎంత పంట వేసినా జంతువుల, పక్షుల, కీటకాల పాలవుతుంది. అందుకే ఐటీ నిపుణులు హెల్ప్‌ డెెస్క్‌ నెట్‌వర్కింగ్‌ నుంచి సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ భూమిక వరకు ఏ బాధ్యతలో ఉన్నా తన వర్క్‌ డేటాకు ఏ మేరకు భద్రత (సెక్యూరిటీ) ఉందో గమనిస్తుండాలి. భద్రతావ్యవస్థ బలంగా ఉంటే దాని పరిధిని తెలుసుకోవాలి. ఒకవేళ బలహీనంగా ఉందని గమనిస్తే అప్రమత్తం కావాలి. ఇతర సీనియర్‌ ప్రొఫెషనల్స్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

భద్రత ప్రమాణాలరీత్యా కొన్ని సూచనలు  

  •  తను పనిచేస్తున్న ఐటీ హార్డ్‌వేర్‌, నెట్‌వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ ఎంత బలంగా ఉందో గమనించాలి.
  •  భద్రత దృష్ట్యా అవసరమైతే రూటర్స్‌, ఫైర్‌వాల్స్‌ను అమర్చగలగాలి.
  •  ఒకవేళ భద్రత రీత్యా ముప్పు పొంచి ఉన్నదని గుర్తిస్తే తక్షణం డేటాను ఇతర ప్లాట్‌ఫామ్స్‌ పైకి బదలాయించగలగాలి.
  •  కంపెనీ ఐటీ కార్యకలాపాలన్నీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌- 2000 నియంత్రణలో చేయాల్సి ఉన్నందున ఈ చట్టం ఏం చెబుతోందో అవగాహన ఏర్పరచుకోవాలి.
  •  భద్రతా ప్రమాణాలను పరీక్షించడానికి ఎథికల్‌ హ్యాకింగ్‌, పెనెట్రేషన్‌ టెస్టింగ్‌ (చొరబడి పరీక్షించడం) వంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి.

అగ్రాసనం ప్రోగ్రామింగ్‌కే  

వంట చేయాలంటే పాకశాస్త్ర ప్రవీణులు కాకపోయినా కనీస అవగాహన ఉండాలి. వాహనం నడపాలంటే డ్రైైవింగ్‌ వచ్చి ఉండాలి. నదిలోకో, సముద్రంలోకో దూకాలంటే ఈత వచ్చి ఉండాలి. సరిగ్గా అలాగే ఐటీ నిపుణులు కావాలంటే ప్రోగ్రామ్‌ రాయడంలో మంచి నైపుణ్యం అలవర్చుకోవాలి. ఐటీ రంగంలో పెద్దపీట కోడింగ్‌కే. పైతాన్‌, సీ - డబుల్‌ ప్లస్‌, జావా స్క్రిప్ట్‌, కాట్లిన్‌ వంటి కంప్యూటర్‌ లాంగ్వేజ్‌లు, లాజికల్‌ ఆలోచనా సరళి ఇందుకు సోపానాలుగా ఉపకరిస్తాయి. ప్రోగ్రామింగ్‌ ప్రాథమిక అంశాలతో నేర్చుకోవడం నిలిపివేయకుండా ఈ మహాసముద్రంలో ఎంత ఎక్కువ నైపుణ్యం వీలైతే అంత సముపార్జించుకోవాలి.  

సిస్టమ్స్‌, నెట్‌వర్క్‌పై పట్టు  

కంప్యూటర్‌ సిస్టమ్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్క్‌... ఇవే ఐటీ నిపుణునికి ఉపకరణాలు. వీటిలో ఎంతటి లోతైన నైపుణ్యం ఉంటే అంతగా విలువ పెరుగుతుంది. పనిచేసే ప్రాజెక్టు ఏదైనా ఈ ప్రాథమిక అంశాలపై నైపుణ్యాలు తప్పనిసరి. సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌ బాధ్యతలు నిర్వర్తించేవారికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం.  

  •  లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (ఎల్‌ఏఎన్‌), వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (డబ్ల్యూఏఎన్‌), స్టోరేజి ఏరియా నెట్‌వర్క్‌ (ఎస్‌ఏఎన్‌), వర్చువల్‌ ఏరియా నెట్‌వర్క్‌ (వీఏఎన్‌)లను ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి.
  •  ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, నెట్‌వర్కింగ్స్‌లో హఠాత్తుగా ఏదైనా సాంకేతిక సమస్య ఉత్పన్నమైతే తక్షణం పరిష్కరించగలిగే నైపుణ్యం ఉన్నవారికి కంపెనీ విలువ ఇస్తుంది.
  •  ఈ నైపుణ్యాలుంటే సహ ఉద్యోగులకు సాంకేతిక విషయాల్లో సహాయం చేయగలుగుతారు. ఈ దృక్పథాన్ని కంపెనీ పరిగణనలోకి తీసుకుంటుంది.

డెవ్‌ఓప్స్‌తో కొత్త అవకాశాలు

డెవలప్‌మెంట్‌, ఆపరేషన్స్‌ విభాగాల సంక్షిప్త సంగమమే డెవ్‌ఓప్స్‌. సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఐటీ టీమ్స్‌ మధ్య డెవ్‌ఓప్స్‌ వారథిలా ఉంటుంది. డెవ్‌ఓప్స్‌ సామర్థ్యాలున్న నిపుణుల సేవలు సంస్థలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఆపరేషన్స్‌ (కార్యకలాపాలు) రెండు విభాగాల్లో వినియోగపడతాయి. డెవ్‌ఓప్స్‌ ఇంజినీర్స్‌ సేవలు ఈ రెండు విభాగాల్లో సంస్థకు తోడ్చాటునిస్తాయి.

  •  వివిధ దశల్లో సాఫ్ట్‌వేర్‌ తయారీలో దాని గమనం, గమ్యం చేరడాన్ని అర్థం చేసుకోవడం.
  •  సాఫ్ట్‌వేర్‌ వాహకాలు డాకర్‌, క్యూబర్‌నెట్స్‌ను అవగాహన చేసుకోవడం.
  •  పైతాన్‌, రూబీ, సీ వంటి స్క్రిప్ట్టింగ్‌ భాషలను నేర్చుకొని ఉండటం.
  •  క్లౌడ్‌ తెలిసివుండటం.  

డేటాతో కెరియర్‌ పూదోట

ఐటీకి డేేటానే క్రీడా మైదానం. సమాచారమే పని కేంద్రం. గణాంకాలే గణనీయ వేదికలు. అయితే వట్టి డేటాతో ఏమీ జరగదు. ఏ ఫలితమూ రాదు. సమాచారాన్ని విశ్లేషించాలి. విశ్లేషణ నిర్దిష్ట ఫలితాలు ఆశించే దిశగా సాగాలి. డేటా నిర్వహణ, డేటా పరిరక్షణ, డేటా విశ్లేషణ ద్వారా వ్యాపారాభివృద్ధికి నిర్ణయాలు తీసుకునేలా క్లూస్‌ (ముగింపు) ఇవ్వడం వంటి సామర్థ్యాలు ఐటీ నిపుణులకు అవసరం. ఇందుకు ఎస్‌క్యూఎల్‌, స్టాటిస్టిక్స్‌, పైతాన్‌ వంటి ఉపకరణాలు ఉపయోగపడతాయి. టెక్నాలజీతో డేటాను మిళితం చేసి వాణిజ్య విస్తరణకూ, విధాన రూపకల్పనకూ కావలసిన ప్రాతిపదికలు సిద్ధం చేయడం విలువైన ప్రతిభగా గుర్తిస్తారు. డేటా ఎనలిస్ట్‌, డేటా ఇంజినీర్స్‌గా అవకాశాలు బాగుంటాయి.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌కి ఆకాశమే హద్దు

బాగా డిమాండ్‌లో ఉన్న ఐటీ నైపుణ్యాల్లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఒకటి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మౌలిక వేదికలు నిర్మించి, వాటిని నిర్వహించడం నేర్చుకోగలగాలి. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నేర్చుకుంటే క్లౌడ్‌ డెవలపర్‌, క్లౌడ్‌ అడ్మినిస్ట్రేటర్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌ వంటి పొజిషన్లు లభిస్తాయి. ఎ.డబ్ల్యు.ఎస్‌, గూగుల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌, అజర్‌, ఒరాకిల్‌ నైపుణ్యాలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ నిపుణులుగా తయారుచేస్తాయి.

మెషిన్‌ లెర్నింగ్‌తో మరో మెట్టుకు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో భాగమైన మెషిన్‌ లెర్నింగ్‌ అనేది ప్రోగ్రామర్స్‌కి వచ్చి ఉండాల్సిన ముఖ్యమైన నైపుణ్యం. డేటా ప్రొఫెషనల్స్‌గా రాణించాలన్నా ఈ నైపుణ్యం సాధనంగా దోహదపడుతుంది. మెషిన్‌ లెర్నింగ్‌ మౌలిక సామర్థ్యాలను ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా నేర్చుకోవచ్చు. ఆపై పారామెట్రిక్‌, నాన్‌-పారామెట్రిక్‌ ఆల్గారిథÇమ్స్‌, కెర్నెల్స్‌, క్లస్టరింగ్‌, డీప్‌లెర్నింగ్‌ టెక్సిక్‌, మెషిన్‌ లెర్నింగ్‌లో సామర్థ్యాలను పెంచుకునేందుకు తోడ్పడతాయి.

ఈ ఏడు రకాల నైపుణ్యాల్లో ఆసక్తి గలవాటిని నేర్చుకోవడం వల్ల ఐటీ ప్రొఫెషనల్‌గా రాణించవచ్చు. వీటిలో ప్రాథమిక అంశాలు నేర్చుకోవడం ద్వారా ఫ్రెషర్స్‌ ప్రాంగణ నియామకాల్లో ఎంపిక అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు. అడ్వాన్స్‌ కోర్సులు చేసి నైపుణ్యాలు పెంపొందించుంటే కెరియర్‌ ఉజ్వలంగా ఉంటుంది.  

ఏవి.. ఎలా నేర్చుకోవాలి?

కోర్సులు: గూగుల్‌ నిర్వహిస్తున్న ఐటీ సపోర్ట్‌ ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌ కోర్సు, సైబర్‌ సెక్యూరిటీ, ఆటోమేషన్‌, డేటా అనాలిసిస్‌ వంటి కోర్సులు ఉద్యోగార్థులకు అందుబాటులో ఉన్నాయి.

స్వయంగా: విద్యానేపథ్యం ఏదైనా సరే, ఐటీ నైపుణ్యాలు నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రవేశించవచ్చు. వీటిని నేర్చుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టవలసిన అవసరం లేదు. లక్షణంగా మీ అంతట మీరే స్వయంగా నేర్చుకోవచ్చు.  ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌, డేటా అనాలిసిస్‌ టెక్నిక్స్‌ వంటి ఐటీ నైపుణ్యాలను తక్కువ ఖర్చుతో ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. అలాగే కొన్ని వెబ్‌సైట్స్‌ ద్వారా ఆన్‌లైన్‌ ప్రాజెక్టులు చేయడం ద్వారా వాటిపై పట్టు సాధించవచ్చు.  

సర్టిఫికేషన్‌: ఆన్‌లైన్‌ కోర్సులు చేసి నైపుణ్యాలు వచ్చాయని వదిలేయడం ఒక పద్ధతి కాగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్‌ కోర్సులు చేయడం మరోమార్గం. ఈ విధమైన కోర్సుల్లో నేర్చుకొని, పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. దీనికి సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. విశ్వసనీయతగల సంస్థల ద్వారా పొందిన సర్టిఫికెట్స్‌ ఎంపికల సమయంలో అభ్యర్థికి పనికొస్తాయి.  

బూత్‌ క్యాంప్స్‌: కొన్ని వారాలు లేదా నెలలపాటు శిక్షణ ఇచ్చే బూత్‌ క్యాంప్స్‌ ఇటీవలికాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కొన్ని ప్రత్యేకమైన ఐటీ స్కిల్స్‌ నేర్పేందుకు బూత్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తున్నారు. కోడింగ్‌ ద్వారా ఆదరణ పొందిన బూత్‌ క్యాంప్స్‌ సైబర్‌ సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు.  

డిగ్రీ: కంప్యూటర్‌ సైన్స్‌ చేయని ఇతర కోర్సుల విద్యార్థులు ఇలా రకరకాల మార్గాల ద్వారా అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం వెచ్చిస్తుంటారు. దీనికంటే, కాస్త సమయం పట్టినా డిగ్రీ చేస్తే మెరుగు కదా అనుకుంటే కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేయవచ్చు. దీనివల్ల ప్రాథమిక అంశాలనుంచి అడ్వాన్స్‌డ్‌ సబ్జెక్ట్‌ వరకు నేర్చుకునే అవకాశంతో పాటు ఐటీ రంగంలోని వేర్వేరు నైపుణ్యాల ఉద్యోగాలకు పోటీపడవచ్చు.

యస్‌.వి. సురేష్‌ సంపాదకుడు, ఉద్యోగ సోపానం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు