రాబడిని విభజించేది... రాష్ట్రాల వాటాలు నిర్ణయించేది!

సమాఖ్య వ్యవస్థ అయిన భారతదేశంలో మూడు స్థాయుల్లో పరిపాలన జరుగుతుంది. వీటి మధ్య ఆర్థిక పరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయా స్థాయుల్లో ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారు.విత్త సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించి, వసూలు చేస్తుంది.

Published : 03 Apr 2024 00:24 IST

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్‌ ఎకానమీ

సమాఖ్య వ్యవస్థ అయిన భారతదేశంలో మూడు స్థాయుల్లో పరిపాలన జరుగుతుంది. వీటి మధ్య ఆర్థిక పరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయా స్థాయుల్లో ఆర్థిక సంఘాలను ఏర్పాటు చేశారు.విత్త సమీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించి, వసూలు చేస్తుంది. వచ్చిన రాబడి నుంచి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆ రాష్ట్రాలకు ద్రవ్యాన్ని బదిలీ చేస్తుంటుంది.
భారత ఆర్థిక సంఘం ఒక చట్టబద్ధమైన సంస్థ లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థ లేదా శాసనబద్ధమైన సంస్థ.

భారత విత్త సంఘం - కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు

(Finance Commission of India)

భారత ఆర్థిక సంఘం - విధులు

భారత రాజ్యాంగంలో 280 అధికరణం ప్రకారం రాష్ట్రపతి ప్రతి అయిదేళ్లకొకసారి లేదా అంతకంటే ముందే ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.

 • ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికేతర విత్త వనరుల బదిలీ, పంపిణీ సమస్యలను పరిష్కరించాలి.
 • భారత ఆర్థిక సంఘం ప్రధాన కార్యాలయం న్యూదిల్లీ (జవహర్‌ వ్యాపార్‌ భవన్‌) లో ఉంది. దీన్ని 1951 నవంబరు 22న స్థాపించారు.
 • మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పన్ను రాబడి నుంచి రాష్ట్రాలకు ఏ మేరకు ద్రవ్యాన్ని బదిలీ చేయాలనే ప్రాతిపదికను సూచించడం ఆర్థిక సంఘం విధి. ప్రధానంగా ఆర్థిక సంఘం కింది విధులను నిర్వహిస్తుంది.

ఎ) పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన నికర రాబడిలో రాష్ట్రాల వాటా నిర్ణయించడం.
నిర్ణయించిన వనరులను రాష్ట్రాలకు కేటాయించడానికి తగిన ప్రాతిపదిక సూత్రాలను సూచించడం.
బి) కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయక విరాళాలు మంజూరు చేయడానికి అవసరమైన నియమ నిబంధనలు సూచించడం.
సి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇతర విత్త అంశాల పంపిణీ పరిష్కారాలను సూచించడం.
డి) పన్నుల ద్వారా సమకూరిన నికర రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, అందులో వాటాను నిర్ణయించడం.
ఉదా: ఆదాయ పన్ను, కేంద్ర ఎక్సైజ్‌ సుంకం, 269 ఆర్టికల్‌ కింద ఉన్న అదనపు ఎక్సైజ్‌ సుంకాలు.
ఇ) భారత రాజ్యాంగం మొదటి భాగం షెడ్యూల్‌ క్లాజ్‌ (1) 278 ఆర్టికల్‌ లేదా 306 ఆర్టికల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పంద కాలం కొనసాగింపు లేదా ఏవైనా మార్పులు చేసుకునే అవకాశం కల్పించడం.

రాష్ట్రపతికి సిఫారసు చేసే అంశాలు

 • కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల రాబడిలో విభజన
 • పన్నుల ద్వారా సమకూరిన నికర రాబడిని రాష్ట్రాలకు కేటాయించే శాతం
 • కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ మంజూరుకు నియమాలు రూపొందించడం.
 • ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు.
 • గిరిజన ప్రాంతాలకు గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌.

ఆర్థిక సంఘం - అధికారాలు

 • ఆర్థిక సంఘానికి 1908, కోడ్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రొసీజర్‌ ప్రకారం సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
 • ఏ కార్యాలయం, కోర్టు నుంచైనా పబ్లిక్‌ రికార్డు లేదా డాక్యుమెంట్‌ను అడిగే అధికారం దీనికి ఉంటుంది.
 • దేశ సంక్షేమం కోసం ఎలాంటి సమాచారమైనా ఏ వ్యక్తి నుంచైనా పొందవచ్చు.
 • ఆర్థిక సంఘం సివిల్‌ కోర్టులాగా విధులను నిర్వహిస్తుంది.
 • ఇందులో ఒక ఛైర్మన్‌, నలుగురు సభ్యులు, ఒక సెక్రటరీ ఉంటారు.
 • వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు.
 • ఈ సభ్యులు కింది అర్హతలు కలిగి ఉండాలి
 • హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితమవ్వడానికి అర్హత ఉన్న వ్యక్తి అయి ఉండాలి.
 • ప్రభుత్వంలో విత్తం, పద్దుల విషయాల గురించి ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.
 • పరిపాలన ఆర్థిక విషయాల్లో అపార అనుభవం ఉండాలి.
 • అర్థశాస్త్రంలో ప్రత్యేక పరిజ్ఞానం ఉండాలి.
 • రాష్ట్రపతి ఉత్తర్వుల్లో నిర్దేశించిన విధంగా ఆర్థిక సంఘం ఛైర్మన్‌, ఇతర సభ్యులు తమ పదవుల్లో కొనసాగుతారు.
 • పదవీ కాలం పూర్తయిన తర్వాత సభ్యులు మరొకసారి నియమితులయ్యేందుకు అర్హులు.
 • సాక్షులను పిలిచి విచారించడంలో ఆర్థిక సంఘం సివిల్‌ న్యాయస్థానంలా వ్యవహరిస్తుంది.
 • ఆర్థిక సంఘం తన విధుల నిర్వహణలో అత్యున్నత స్థాయి పరిపాలనాధిపతులను, ప్రముఖ రాజకీయ నాయకులను సంప్రదిస్తుంది.
 • దేశంలోని వివిధ విత్త సంస్థల అధిపతులను సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తుంది.
 • ఆర్థిక సంఘం తన పని పూర్తిచేసిన తర్వాత నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
 • ఆ నివేదికకు ఒక వివరణాత్మక నోట్‌ను జతపరిచి పార్లమెంట్‌ ఉభయసభల్లో లేదా ఏదైనా ఒక సభలో ప్రవేశపెట్టేలా చూస్తారు.
 • ఈ సిఫారసులన్నింటినీ లేదా కొన్నింటిని రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

రాష్ట్ర ఆర్థిక సంఘం

దేశంలోని పలు రాష్ట్రాల్లో రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఏర్పాటు చేశారు.

 • వీటి ద్వారా ఆయా రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సహకారం అందిస్తారు.
 • భారత రాజ్యాంగంలోని 243(1) అధికరణంలో పేర్కొన్న నియమాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రతి అయిదేళ్లకొకసారి ఏర్పాటు అవుతుంది.
 • దీనిలో ఛైర్మన్‌, మెంబర్‌ సెక్రటరీ, ఇతర సభ్యులు ఉంటారు.
 • రాష్ట్ర ఆర్థిక సంఘానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్లు అందుతాయి.

రాష్ట్ర ఆర్థిక సంఘం విధులు

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్థిక సంఘాలు కింద పేర్కొన్న విధులు నిర్వర్తిస్తాయి.

 • కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన గ్రాంట్లను రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్యకలాపాలకు ఆర్థిక సంఘమే బదిలీ చేస్తుంది.
 • రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వాటిని ఆర్థికంగా మెరుగుపర్చేందుకు ప్రోత్సహిస్తుంది.
 • విత్త అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తుంది.
 • రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపాలిటీల్లో విధించే పలు పన్నులు, సుంకాలు, ఫీజులను నిర్ధారిస్తుంది.
 • కోశ వికేంద్రీకరణలో రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు లభించే వనరులకు మధ్యవర్తిత్వం వహిస్తుంది. దీని సిఫారసుల వల్ల వనరుల బదిలీ యంత్రాంగం స్థిరంగా, సూచనాత్మకంగా ఉండేలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్లు: కింద పేర్కొన్న వివిధ భాగాలు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్లు పొందుతాయి.

 • కోశ పరిపాలన
 • జిల్లాల పరిపాలన
 • అవస్థాపన అభివృద్ధి
 • వైద్యసేవలు
 • ప్రాథమిక విద్య
 • పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్‌ శిక్షణ
 • ప్రభుత్వ గ్రంథాలయాలు
 • వారసత్వ పరిరక్షణ
 • పోలీస్‌, శాంతి భద్రతలు
 • అగ్నిమాపక సేవలు
 • జైళ్లశాఖల నిర్వహణ
 • రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి అధిక నిధులు మంజూరై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది.
 • ఈ సంఘం సిఫారసులు కింద పేర్కొన్న కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటాయి.
 • రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు
 • రాబడి వనరులు, అయిదేళ్ల తర్వాతి కాలంలో వాటికి డిమాండ్‌
 • గడిచిన ఆరేడేళ్లలో పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపాలిటీల ఆర్థిక సంబంధమైన సమీక్ష
 • రాష్ట్ర ఆర్థిక సంఘం గతంలో చేసిన సిఫారసులు
 • కేంద్ర ఆర్థిక సంఘం సిఫారసులు
 • ప్రస్తుతం అమల్లో ఉన్న దత్తాంశ సేకరణ నిర్వహణ విధానం
 • రాష్ట్ర ఆర్థిక సంఘం స్థానిక సంస్థల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లతో పాటు రాష్ట్రస్థాయి వనరుల వాటాల పంపిణీని సిఫారసు చేస్తుంది.
 • వివిధ రాష్ట్రాల్లోని పంచాయతీరాజ్‌ సంస్థలు, మున్సిపాలిటీల వనరుల పరిధి కూర్పు, వాటాలు, సూత్రాలను బట్టి ఈ విధానం ఒక్కొక్కచోట ఒక్కొక్కరకంగా ఉన్నట్లు తెలుస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని