అంతుపట్టని అవని పుట్టుక

సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు నిత్యం సాధారణ కంటికి కనిపించే ఖగోళ అద్భుతాలు. భూమి లేదా అవని ఆవిర్భావం వందల మిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగింది.

Published : 21 Apr 2024 00:52 IST

ప్రపంచ భూగోళ శాస్త్రం

సూర్యుడు, భూమి, చంద్రుడు, నక్షత్రాలు నిత్యం సాధారణ కంటికి కనిపించే ఖగోళ అద్భుతాలు. భూమి లేదా అవని ఆవిర్భావం వందల మిలియన్ల సంవత్సరాల క్రితమే జరిగింది. దీనికి సంబంధించి అంతుపట్టని రహస్యాల మధ్య పలు సిద్ధాంతాలు వెలువడ్డాయి. ఒకప్పటికీ, ఇప్పటికీ భూమి అనేక మార్పులకు గురైంది. అదే విధంగా చంద్రుడు నెలలో ఒకసారి క్షీణిస్తాడు, మరోసారి వృద్ధి చెందుతాడు. సూర్యుడి దృశ్య రూపానికి, వాస్తవానికి తేడాలు ఉంటాయి. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు భూమి వయసు, శిలా సముదాయాలు, పర్వతాలు, జీవుల పుట్టుక, నక్షత్రరాశి, ధ్రువ నక్షత్రం, రాక్షస బల్లుల కాలం, వివిధ మండలాలు, బిందువుల గురించీ తెలుసుకోవాలి.

భూ ఆవిర్భావం

భూ ఆవిర్భావం గురించి వివరించే సిద్ధాంతాలు రెండు రకాలు. అవి

1) ఆకస్మిక సిద్ధాంతాలు 2) పరిణామక్రమ సిద్ధాంతాలు. భూఆవిర్భావం గురించి మొదటగా వివరించిన శాస్త్రవేత్త జార్జ్‌ డి బఫెన్‌.

1) ఆకస్మిక సిద్ధాంతాలు: ఇవి భూ ఆవిర్భావాన్ని గురించి వివరించే అతిప్రాచీన సిద్ధాంతాలు. వీటి ప్రకారం సూర్యుడిలోని కొంత వాయు పదార్థం ఆకస్మికంగా, దూరంగా విసిరివేతకు గురై లేదా రెండు కాస్మిక్‌ పదార్థాలు ఒకదాంతో మరొకటి ఢీకొనడం వల్ల ఏర్పడినట్లు వివరిస్తాయి. అవి-

ఎ) టైడల్‌ హైపోథెసిస్‌ (తరంగ పరికల్పన సిద్ధాంతం): దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు జీన్స్‌, జఫ్రీస్‌.
బి) బైనరీ స్టార్‌ థియరీ (ద్వినక్షత్ర సిద్ధాంతం): ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు లిటిల్‌ టన్‌, రస్సెల్‌. సి) ఉల్కాపాత సిద్ధాంతం: ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఆట్టోమన్‌, స్కిమిడ్‌.
డి) ప్లానా టెసిమల్‌ థియరీ (గ్రహకాల పరికల్పన సిద్ధాంతం): ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఛాంబర్లిన్‌, మౌల్టన్‌.
ఇ) సూపర్‌నోవా సిద్ధాంతం: ప్రతిపాదించినశాస్త్రవేత్తలు హోలే, లిటిన్‌టన్‌.

2) పరిణామక్రమ సిద్ధాంతాలు:  గ్రహాల ఆవిర్భావం చాలా నెమ్మదిగా, క్రమపద్ధతిలో ఒక దశ నుంచి మరొక దశకు జరిగిందని ఈ సిద్ధాంతాలు పేర్కొంటాయి. ఎ) నెబ్యులార్‌ హైపోథెసిస్‌ (నీహారిక పరికల్పన సిద్ధాంతం):  ప్రతిపాదించిన శాస్త్రవేత్త లాప్లాస్‌. బి) వాయు పరికల్పన సిద్ధాంతం: ఇమాన్యుల్‌ కాంట్‌.సి) ఫొటోప్లానెట్‌ సిద్ధాంతం: కూపియర్‌. డి) విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతం: దీన్ని మొదట వాన్‌ విజ్‌ సాకర్‌ ప్రతిపాదించగా, తర్వాత ఆల్ఫేన్‌ సవరించాడు.

చంద్రమాన చతుష్కాలు, చంద్రకళలు: చంద్రమాన చతుష్కాలు అంటే అమావాస్య చంద్రుడి నుంచి తిరిగి మరొక అమావాస్య చంద్రుడి దశ వరకు ఉన్న 29 1/2 రోజుల కాలాన్ని 7 రోజుల చొప్పున విభజిస్తే ఒక చంద్రమాన మాసంలో 4 చతుష్కాలు, 8 చంద్రకళలు ఏర్పడతాయి. చంద్రకళల వల్ల భూమిపై విశేష ప్రభావాలు కనిపిస్తాయి.

శుక్లపక్ష చంద్రుడు: అమావాస్య చంద్రుడి నుంచి పౌర్ణమి దశ వరకు కొనసాగే చంద్రకళ పురోగతిని శుక్ల పక్ష చంద్రుడు అంటారు. ఇది అమావాస్య తర్వాత పదో రోజున కనిపిస్తుంది.

కృష్ణపక్ష చంద్రుడు: పౌర్ణమి చంద్రుడి నుంచి అమావాస్య చంద్రుడి వరకు ఉండే చంద్రకళ క్షీణదశను కృష్ణపక్ష చంద్రుడు అంటారు. ఇది అమావాస్య తర్వాత 17వ రోజున కనిపిస్తుంది.
సిజిగి: భూమికి తూర్పు, పడమర దిశల్లో చంద్రుడి స్థితి.

క్వాడ్రేచర్‌: భూమికి ఉత్తర, దక్షిణ దిశల్లో చంద్రుడు ఉండే స్థితి. (శుద్ధ సప్తమి నుంచి బహుళ సప్తమి మధ్య కాలం)

ముఖ్యమైన అంశాలు:

సౌరకుటుంబంలో అత్యధిక సాంద్రత ఉన్న గ్రహం భూమి, అత్యల్ప సాంద్రత ఉన్న గ్రహం శని. అత్యధిక భ్రమణ కాలం ఉన్న గ్రహం శుక్రుడు, అత్యల్ప భ్రమణ కాలం ఉన్న గ్రహం బృహస్పతి. అతి ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. అతి అందమైన గ్రహం శని. అత్యధిక ఉపగ్రహాలున్న గ్రహం కూడా శనే. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. దీ సూర్యుడు, ఇతర గ్రహాలు ఎంత ఎత్తులో ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి, అక్షాంశాల విలువలను లెక్కించడానికి సెక్సె ్టంట్‌ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.దీ నక్షత్రాల వయసును కొలిచే పరికరం ఆప్టికల్‌ పైరోమీటర్‌.

గ్రేట్‌ బేర్‌/ఉర్సా మేజర్‌: ఉత్తర ధ్రువం వద్ద నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలాన్ని గ్రేట్‌ బేర్‌ లేదా ఉర్సా మేజర్‌ అని పిలుస్తారు.

ఉర్సా మైనర్‌: దక్షిణ ధ్రువం వద్ద నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర మండలాన్ని ‘ఉర్సా మైనర్‌’ అని పిలుస్తారు.

సూర్యుడి దృశ్య రూపం, వాస్తవ రూపం: సూర్యుడి దృశ్య రూపానికి, వాస్తవ రూపానికి సూర్యోదయ కాలంలో తేడా ఉంటుంది. సూర్యోదయంలో సూర్యుడు ఉదయించడానికి కనీసం 2 నిమిషాల ముందుగానే మనకు కనిపిస్తాడు. దీనికి కారణం సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు వాతావరణంలో ప్రవేశించి వక్రీభవనం చెందడమే. దాని వల్ల  సూర్యుడు 30 డిగ్రీల పైన ఆకాశంలో ఉన్నట్లు కనిపిస్తాడు (సూర్యుడు దిజ్జమండలానికి దిగువ 30 డిగ్రీల పరిధిలో ఉన్నప్పటికీ). సూర్యుడు అస్తమించే, ఉదయించే సమయాల్లో ఎర్రగాను, బింబం పెద్దదిగా ఉండటానికి కారణం కాంతి కిరణాల వివర్తనం, అధిక మందంగా ఉన్న వాతావరణం, కిరణాల ఏటవాలు ప్రయాణం వల్ల ఆ విధంగా సూర్యుడు కనిపిస్తాడు.

ధ్రువ నక్షత్రం: ఉత్తర ధ్రువానికి 90 డిగ్రీల కోణంలో ఊర్ధ్వ దిశలో ఉండే నక్షత్రం.

నక్షత్ర రాశి: మన దృష్టికి ఒక ఊహా చిత్రాన్ని ఏర్పరిచే నక్షత్రాల గుంపును నక్షత్ర రాశి అంటారు. ఇది ధ్రువ నక్షత్రానికి ఊర్ధ్వ దిశలో ఉంటుంది. ఉదా: సప్తర్షి మండలం (Great Bear). ఏడు నక్షత్రాలతో ఉండే నాగలి ఆకార సమూహం.

గెగెన్‌ షైన్‌: సూర్యుడి దృశ్యామార్గంలో, సూర్యుడి ఉనికికి వ్యతిరేక దిశలో 180 కోణంలో రాత్రి సమయాల్లో కనిపించేే అస్పష్ట కాంతి.

దిజ్జ మండలం (Horizon): ఇదొక దృశ్యా విశేషం. సాధారణ మానవ దృష్టికి భూమి ఆకాశం కలిసే చోటు. ఆకాశంలో పైకి వెళ్లే కొద్ది దీని పరిధి వృత్తం ఆకారంలో విస్తరించుకుని అధిక విశాల ప్రాంతంగా మారడాన్ని దర్శించవచ్చు. భూమికి బదులు (కొన్ని ప్రాంతాల్లో) సముద్రం ఉన్నపుడు ఆకాశం, సముద్రం కలిసినట్లు కనిపించే రేఖ దిజ్జ మండలాన్ని విశ్వాంతరాళంలోకి చూస్తే దాన్ని ఖగోళ దిజ్జ మండలం అంటారు. అంటే మన భూమి లేదా సముద్రం అంచు ఆకాశంతో కలిసినట్లుండే చోటు నుంచి విశ్వాంతరాళంలోనికి విస్తరించే వర్తుల రేఖ.

స్వర్ణబిందువు (Zanith): భూమిపై నిలబడిన వ్యక్తికి సరాసరి తల మీద ఆకాశ మార్గంలో ఉండే ఊహా బిందువు. ఒక నిలువు రేఖ సరాసరిగా పైకి ప్రయాణించి విశ్వగోళం రేఖను తాకే బిందువు. దీన్నే మస్తకం అంటారు.

నాదిర్‌/పాతాళ బిందువు: స్వర్ణ బిందువుకు సరాసరి వ్యతిరేక దిశలో విశ్వగోళం రేఖను తాకే బిందువు. స్వర్ణ బిందువుకు, పాతాళ బిందువుకు మధ్య 180్న కోణం ఉంటుంది. దక్షిణ ధ్రువం వద్ద నిల్చున్న వ్యక్తికి ధ్రువ నక్షత్రం పాతాళ బిందువు ప్రాంతంలో ఉంటుంది.

చంద్రుడి మీద మనకు కనిపించే స్త్రీ లేదా చెట్టుకింద వృద్ధురాలు అనే భావాలకు కారణమైన మచ్చలు ఉంటాయి. అవి కేవలం మరియా లేదా సముద్రాలు. అయితే వాటిలో నీరు మాత్రం ఉండదు. వీటికి ‘సీ ఆఫ్‌ షవర్స్‌’, ‘సీ ఆఫ్‌ సెరెనిటీ’, ‘సీ ఆఫ్‌ ట్రాంక్విలిటీ’, ‘సీ ఆఫ్‌ ఫెర్టిలిటీ’ అనే పేర్లు ఉన్నాయి. దీ భూమి వయసును 5 కల్పాలుగా పేర్కొంటున్నారు. కల్పాలను తిరిగి మహా యుగాలుగా, మహాయుగాలను ఉపయుగాలుగా విభజించారు.

భూమి వయసు (జియోలాజికల్‌ టైమ్‌ స్కేల్‌): అయిదు కల్పాల్లో ఆర్కియో జోయిక్‌ (4,500 - 3,000 మిలియన్‌ సంవత్సరాలు) కల్పంలో భూమి ఆవిర్భవించింది. ప్రొటిరో జోయిక్‌ (3,600 - 700 మిలియన్‌ సంవత్సరాలు) కల్పంలో భూమిపై శిలాసముదాయాలు ఆవిర్భవించాయి. 

 • భూమిపై మొదటగా జీవఆవిర్భావం ప్రొటిరో జోయిక్‌ కల్పంలో జరిగింది.దీ ప్రాచీన జీవుల ఆవిర్భావం పేలియో జోయిక్‌ (600 - 280 మిలియన్‌ సంవత్సరాలు) కల్పంలో జరిగింది. 
 • ఆధునిక జీవుల ఆవిర్భావం సీనో జోయిక్‌ (65 - 0.02 మిలియన్‌ సంవత్సరాలు) కల్పంలో జరిగింది. దీ ప్రస్తుత మనిషి నివసిస్తున్న ఉపయుగం హ్యాలోసీన్‌ (ఒక మిలియన్‌ సంవత్సరాల నుంచి ప్రస్తుతం కొనసాగేది). 
 • ప్లీస్టోసీన్‌ (ఒక మిలియన్‌) కాలంలో హెూమోసెపియన్స్‌ (ఆదిమానవులు) నివసించారు. దీనినే హిమ యుగంగా పేర్కొంటారు. ఈ కాలంలో ఉత్తర అమెరికాలోని గ్రేట్‌ లేక్స్‌ ఏర్పడ్డాయి.
 • ప్లియోసీన్‌ కాలంలో ఆల్ఫైన్‌ పర్వతాలు ఆవిర్భవించాయి. టెథిస్‌ సముద్రం అదృశ్యమైంది.
 • మియోసీన్‌ పీరియడ్‌లో హిమాలయాల ఆవిర్భావం ప్రారంభమైంది. 
 • జురాసిక్‌ యుగంలో టెథిస్‌ రెండుగా విడిపోయింది. 
 • కార్బోనిఫెరస్‌ యుగం (345 మిలియన్ల సంవత్సరాలు) లో భూగర్భంలో ఏర్పడిన శిలాజాల నుంచి ప్రస్తుతం మనకు బొగ్గు లభిస్తుంది.
 • కేంబ్రియన్‌ పీరియడ్లో అతిపురాతనమైన కెలెడోనియన్‌ పర్వతావిర్భావం జరిగింది. ప్రీకాంబ్రియస్‌ మహాయుగంలో ప్రస్తుతం మనం నివసిస్తున్న భూభాగమంతా ఒకే ఖండంగా ఉండేది. దీనినే పాంజియా అంటారు. అంతేకాకుండా పర్వత ఉద్భవం ప్రారంభమైంది.
 • పాలియోజోయిక్‌ లేదా పురాజ్జీవ మహాయుగంలో దాదాపు (400 మిలియన్ల సంవత్సరాలు) జీవి మొదటిసారిగా ఉద్భవించిన సూచనలు కనిపిస్తున్నాయి.
 • మిసోజోయిక్‌ మహాయుగంలో ఈ భూ ప్రపంచాన్ని ఏలిన రాక్షస బల్లులు జీవించి ఉన్నాయి. 
 • టెర్షియరీ యుగంలో దాదాపు (32-60 మిలియన్‌ సంవత్సరాలు) నవీన ముడత పర్వతాలైన రాఖీస్‌, ఆండీస్‌, ఆల్ఫ్‌, హిమాలయాలు ఉద్భవించాయి.

రచయిత: జయకర్‌ సక్కరి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని