స్వపరిపాలన పోరులో ఆంధ్రుల చైతన్యం!

భారత స్వాతంత్య్ర పోరాటం ప్రతి దశలోనూ ఆంధ్రులు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. జైళ్లకు వెళ్లారు. ప్రాణత్యాగాలు చేశారు.

Published : 29 Apr 2024 00:17 IST

భారత స్వాతంత్య్ర పోరాటం ప్రతి దశలోనూ ఆంధ్రులు జాతీయ స్ఫూర్తిని ప్రదర్శించారు. అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. జైళ్లకు వెళ్లారు. ప్రాణత్యాగాలు చేశారు. దాంతోపాటు శక్తిమంతమైన పత్రికలను నెలకొల్పి ప్రజా చైతన్యాన్ని రగిలించారు. ముఖ్యంగా హోంరూల్‌ ఉద్యమంలో స్వపరిపాలనే లక్ష్యమని చాటారు. మాంటేగ్‌- ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు, పత్రికల్లో తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారు. అణచివేతలకు ప్రత్యక్ష రూపమైన రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసి, వలసపాలకుల అకృత్యాలను నిరసించారు. జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొంటూనే ఆగస్టు ప్రతిపాదన సమయంలో ప్రత్యేక ఆంధ్ర ఆకాంక్షలనూ వ్యక్తం చేశారు. ఆంధ్రుల రాజకీయ భావోద్వేగాల బలానికి అద్దం పట్టే ఈ సంఘటనల వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. స్వాతంత్య్రం కోసం ఇక్కడి ప్రజలు, నాయకులు ఏకమై సాగించిన సమరాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆంధ్రలో హోంరూల్‌ ఉద్యమం

(జాతీయోద్యమ వ్యాప్తి)

ఆంగ్లేయులు 1608లో భారతదేశానికి వర్తకం కోసం వచ్చారు. విస్తరణలో భాగంగా అనేక కోటలను నిర్మించారు. 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత అధికార స్థాపన చేశారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అనంతరం భారత్‌లోని మేధావులు జాతీయోద్యమం నడిపించారు. అందులో అనేకమంది ఆంధ్రులు పాల్గొని ప్రాణ త్యాగాలు చేశారు. ఆంధ్రాలో బిపిన్‌ చంద్రపాల్‌ వ్యాపింప జేసిన వందేమాతర ఉద్యమం(1905) లోనూ జైళ్ల పాలయ్యారు.

మాంటేగ్‌ ప్రకటన (ఆగస్టు 20, 1917): భారత్‌లో   పరిపాలనాసంస్కరణలు ప్రవేశపెట్టడానికి, ప్రభుత్వ ఆధునికీకరణ కోసం మార్పులు తీసుకురావడానికి 1917, ఆగస్టు 20న ఇంగ్లండ్‌ కామన్స్‌ సభలో మాంటేగ్‌ ఒక ప్రకటనను ప్రవేశపెట్టాడు. అందులో భారతీయులకు పలు ప్రభుత్వ శాఖల్లో ప్రవేశ అవకాశాలను ఎక్కువ చేయాలి. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు కోసం స్థానిక స్వపరిపాలన సంస్థలను క్రమంగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రకటన ఆంధ్రాలో కొత్త ఆశలను చిగురింపజేసింది. ప్రత్యేక ఆంధ్రా కోసం సమైక్యంగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ భావించారు.1917 చివరి నాటికి తెలుగు జిల్లాలన్నింటిలో ప్రజాభిప్రాయం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వైపు మొగ్గు చూపింది. సంబంధిత అంశాలను చర్చించడానికి విజయవాడలో ‘ఆంధ్ర మహాసభ’ ప్రత్యేకసమావేశం ఏర్పాటు చేసింది. 1200 మంది హాజరయ్యారు. అయ్యదేవర కాళేశ్వరరావు ఛైర్మన్‌గా, సీవీఎస్‌ నరసింహరాజు అధ్యక్షుడిగా వ్యవహరించారు. సభ్యులందరూ ప్రత్యేక ఆంధ్రకు ఆమోదం తెలిపారు. మాంటేగ్‌ మద్రాసు రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర విషయమై ఆయనను కలవడానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు. కానీ మద్రాసు ప్రభుత్వం అడ్డుకుంది. దాంతో మాంటేగ్‌కు అనేక టెలిగ్రామ్‌లు పంపారు. చివరకు 21 మందితో కలవడానికి అనుమతి లభించింది. ఆ బృంద నాయకుడు న్యాపతి సుబ్బారావు. మద్రాసులోని తెలుగు జిల్లాలన్నింటినీ కలిపి ‘ప్ర£త్యేక ఆంధ్ర’ ఏర్పాటు చేయాలని వారు మాంటేగ్‌ను కోరారు. ఆ ప్రతిపాదన పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

హోంరూల్‌ ఉద్యమం: బాల గంగాధర్‌ తిలక్‌ను 1908లో బర్మాలోని మాండలే జైలులో (దేశ బహిష్కరణ) నిర్బంధించారు. 1915లో ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత ఉద్యమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా 1916, ఏప్రిల్‌ 28న హోంరూల్‌ లీగ్‌ను స్థాపించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాధించి తీరుతా’ అని నినాదం ఇచ్చారు. ఈ ఉద్యమాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌, లఖ్‌నవూ, అలహాబాద్‌ల్లో మహ్మద్‌ అలీ జిన్నా వ్యాప్తి చేశారు. ‘‘ముందు మనం భారతీయులం ఆ తర్వాత ముస్లింలం’’ అంటూ ఉద్యమ సమయంలో జిన్నా నినదించారు. తిలక్‌ హోంరూల్‌ ఉద్యమాన్ని ఆంధ్రలో ప్రచారం చేసింది గాడిచర్ల హరిసర్వోత్తమరావు. ఈయన ‘స్వపరిపాలనా పరమోద్దేశం’ అనే పేరుతో కరపత్రాన్ని ప్రచురించారు. కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, కె.వి.రెడ్డి నాయుడు లాంటి ప్రముఖులు ఆంధ్రా హోంరూల్‌ లీగ్‌లో చేరారు. సరోజినీ నాయుడు రాసిన ‘అవెక్‌ మదర్‌’ అనే కరపత్రాన్ని గాడిచర్ల ‘హైందవ మాతృగీతం’ అనే పేరుతో తెలుగులోకి అనువదించి ప్రచారం చేశారు. ‘నేషనలిస్ట్‌’ అనే పత్రికను స్థాపించి తీవ్రవాద ధోరణిలో వ్యాసాలు రాశారు.

హోంరూల్‌ ఉద్యమ కాలంలో అనిబిసెంట్‌: మద్రాసులో హోంరూల్‌ లీగ్‌ను ప్రారంభించిన అనిబిసెంట్‌ దాన్ని ఆంధ్రాలోనూ బాగా వ్యాప్తి చేశారు. లఖ్‌నవూ కాంగ్రెసు సమావేశం తర్వాత ఆమె ఆంధ్రాలో పర్యటించారు. కాకినాడ, రాజమండ్రి, ఏలూరుల్లో బహిరంగ ఉపన్యాసాలిచ్చారు. ఏలూరుకు చెందిన మోచర్ల హనుమంతరావు తదితర మితవాద నాయకులు అనిబిసెంట్‌ ఆంధ్ర పర్యటన విజయవంతమవడానికి కృషి చేశారు. గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా సమావేశాల్లో స్వపరిపాలనకు అనుకూలంగా తీర్మానాలను ఆమోదించారు. నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభ అయిదో సమావేశంలో స్వపరిపాలన విషయం ప్రస్తావనకు వచ్చింది. కొండా వెంకటప్పయ్య తన అధ్యక్షోపన్యాసంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, స్వపరిపాలన ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రజల్లో హోంరూల్‌ ఉద్యమం పట్ల పెరుగుతున్న ఆదరణకు చూసి ఓర్వలేని మద్రాసు ప్రభుత్వం విచ్చలవిడిగా అణచివేత చర్యలను చేపట్టింది. విద్యార్థులు రాజకీయ సమావేశాలకు హాజరు కాకూడదంటూ సర్క్యులర్‌ జారీ చేసింది. ‘న్యూ ఇండియా’ పత్రిక ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించింది. ఈ సమయంలో అనిబిసెంట్‌, ఆమె అనుచరులను అరెస్టు చేయడంతో నిరసిస్తూ దేశమంతా సభలు నిర్వహించారు. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఉద్యమాలు తీవ్రరూపం దాల్చాయి. మచిలీపట్నం జాతీయ కళాశాలలోని ఉద్యోగులందరూ హోంరూల్‌ ఉద్యమాన్ని ఉద్దృతం చేయడానికి కృషి చేశారు. మదనపల్లి కళాశాల ఉద్యోగులు జాతీయ శిబిరాన్ని నిర్వహించి స్వపరిపాలన గురించి ప్రజలకు వివరించారు. తెలుగు పత్రికలు ‘దేశాభిమాని’, ‘దేశమాత’ అనిబిసెంట్‌ అరెస్టును తీవ్రంగా నిరసించాయి. హోంరూల్‌ లీగ్‌ ప్రకోప దళాన్ని ఏర్పాటు చేసి మెడలో అనిబిసెంట్‌ బ్యాడ్జ్‌ ధ]రించి దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటూ ప్రతిజ్ఞలు చేశారు. ముస్లింలీగ్‌, జాతీయ కాంగ్రెస్‌లు అనిబిసెంట్‌ విడుదలకు అనేక చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా 1917, సెప్టెంబరు 17న ఆమెను విడుదల చేశారు. ఈమె దత్తపుత్రుడు జిడ్డు కృష్ణమూర్తి.

మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్ట్‌ సంస్కరణలు - 1919: ఈ సంస్కరణలను 1918, జులైలో ప్రకటించారు. వీటి ప్రకారం రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి రిజర్వు చేసిన శాఖ, రెండోది బదలాయించిన శాఖ. రిజర్వు చేసిన శాఖ విషయాలను గవర్నరు చూసేవారు కానీ, జవాబుదారీ కారు. బదలాయింపు శాఖకు సంబంధించిన అంశాలను మంత్రుల సహకారంతో గవర్నరు నిర్వహించేవారు. ఆ సంస్కరణల పట్ల తీవ్ర అసంతృప్తిని ప్రకటించడానికి విజయవాడ, కడప పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ సంస్కరణలు ఏ మాత్రం దోహదపడవని విజయవాడ సమావేశం అభిప్రాయపడింది. దాన్నే గంజాం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల సభలు సమర్థించాయి. 1918, ఆగస్టు 17న కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన గుంటూరులో ఆంధ్రమహాసభ ప్రత్యేక సమావేశం జరిగింది. దానికి బి.ఎన్‌.శర్మ, బి.వెంకటపతిరాజు, ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కాళేశ్వరరావు, రామదాసు తదితర ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాంటేగ్‌-ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలను కొన్ని మార్పులు చేర్పులతో అమలు చేయాలని బి.ఎన్‌.శర్మ అభిప్రాయపడ్డారు. మాంటేగ్‌ ఛెమ్స్‌ ఫర్డ్‌ సంస్కరణలను తెలుగు పత్రికా రంగం విమర్శించింది. కృష్ణాపత్రికలో రాసిన వ్యాసంలో- ‘కొండను తవ్వి ఎలుకను పట్టడం జరిగింది. ఇంతకాలం దేశం అడిగింది ఒకటైతే ఇచ్చింది మరొకటి. అధికారాలను కుడిచేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకున్నట్లు ఉంది. యంత్రానికి అనేక చక్రాలు అమర్చారు. అన్ని చక్రాలు వెనుకకు తిరిగేవే’ అని పేర్కొన్నారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ ఈ సంస్కరణలకు మద్దతు ఇచ్చారు. ఈయన కాంగ్రెస్‌ నుంచి విడిపోయి ‘నేషనల్‌ లిబరల్‌ ఫెడరేషన్‌ పార్టీ’ని స్థాపించారు. ఈయన అనుచరులను లిబరలిస్ట్‌లు అంటారు. 1920 ఎన్నికల్లో లిబరలిస్ట్‌లు ఘోరంగా ఓడిపోయారు.

రౌలత్‌ చట్టం - 1919: 1919లో ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం వ్యక్తులను ఇష్టానుసారంగా నిర్బంధించడానికి, పత్రికల స్వేచ్ఛను హరించడానికి, రాజకీయ ఖైదీలను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి తిరుగులేని అధికారాలు దక్కాయి. అప్పటికి తెలుగు పత్రికా రంగంలో ప్రధాన పత్రికలైన ‘ఆంధ్రపత్రిక’, ‘కృష్ణా పత్రిక’ ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శించాయి. పౌర హక్కులను కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ‘కృష్ణా పత్రిక’ పేర్కొంది. ఈ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ 1919, ఏప్రిల్‌ 6న ఉపవాస/ప్రార్థనా /జాతికి అవమాన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఆ మేరకు విశాఖపట్నం, నర్సాపుర్‌, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు పట్టణాల్లో ఉపవాస దినాన్ని ఆచరించారు. విజయవాడ తాలుకా రైతులు ‘కొలవెన్ను’ వద్ద సమావేశం జరిపి రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకించారు. 1919, సెప్టెంబరులో నిర్వహించిన నెల్లూరు జిల్లా సమావేశానికి అధ్యక్షత వహించిన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రాథమిక హక్కులను ప్రకటించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రచయిత: గద్దె నరసింహారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని