JEE Main 2026: జేఈఈ (మెయిన్‌) రాస్తారా? ఇవిగో స్మార్ట్‌ టిప్స్‌, యాప్స్‌!

Eenadu icon
By Features Desk Updated : 02 Nov 2025 16:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌/బీఆర్క్‌ సీట్ల భర్తీకి, జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత పొందేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏటా దాదాపు 12లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాయగా.. వీరిలో కేవలం 1శాతం మంది మాత్రమే ఐఐటీల్లో అడ్మిషన్లు సాధిస్తుంటారు. ఎంతో కఠినంగా ఉండే ఈ పరీక్షకు ఇప్పట్నుంచే పక్కా ప్రణాళిక, తగిన సన్నద్ధతతో ముందుకెళ్తే విజయం సులువేనంటున్నారు నిపుణులు. ఇందుకోసం పరీక్షకు ముందు హడావుడిగా చదివి ఒత్తిడికి గురికాకుండా స్థిరమైన ప్రిపరేషన్‌, ఓర్పు, తగినంత కృషీ అవసరమని సూచిస్తున్నారు. స్మార్ట్‌ ప్రిపరేషన్‌ కోసం వారు సూచిస్తోన్న కొన్ని మెలకువలు, యాప్‌లు ఇవిగో! (JEE Main 2026 prepration Tips)

జేఈఈ మెయిన్ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

  • జేఈఈ పరీక్షకు వేగం ఎంత ప్రధానమో.. కచ్చితత్వమూ అంతే ముఖ్యం. అందువల్ల ఒకవైపు స్థిరమైన ప్రిపరేషన్‌ను కొనసాగిస్తూనే.. మరోవైపు క్రమం తప్పకుండా ప్రాక్టీస్‌ చేస్తుండాలి. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా ముందుగా సిలబస్‌ పరిధిని తెలుసుకోవడం అత్యవసరం. 
  • జేఈఈ మెయిన్‌కు కూడా సిలబస్‌, పరీక్షా సరళి గురించి సరైన అవగాహనతో సన్నద్ధత మొదలుపెట్టడమే మీ విజయానికి తొలి మెట్టుగా భావించండి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి. 
  • ఫార్ములాలను బట్టీ పట్టొద్దు. కాన్సెప్టులపైనే దృష్టి పెట్టండి. జేఈఈ పరీక్షలో అడిగే ప్రశ్నలను ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి టాపిక్‌పైనా పట్టు సాధించేందుకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఎంచుకొని వాటిని లోతుగా చదవండి. క్లిష్టమైన అంశాలను మరింతగా నేర్చుకొనేందుకు ఇతర పుస్తకాలనూ అధ్యయనం చేయండి. 
  • కాలేజీల్లో నిర్వహించే ప్రాక్టీస్‌ టెస్టుల్లో మీరు ఎక్కడ వెనుకబడ్డారో, ఏయే పొరపాట్లు చేస్తున్నారో ఒకచోట రాసిపెట్టుకోండి. వీలుకుదిరినప్పుడల్లా వాటిని ఒకసారి సరిచూసుకోవడం వల్ల ఆ తప్పులు పునరావృతం చేసే అవకాశాలను తగ్గించుకోగలుగుతారు. మీరు చదివే అంశాలను రెగ్యులర్‌గా రివిజన్‌ చేస్తుండండి. 
  • మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో కొన్ని టాపిక్స్‌ను ఎంచుకొని వారంలో వాటిని పూర్తి చేసుకొనేలా స్వల్ప కాలిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.  వీక్లీ గోల్స్‌ పెట్టుకొని సాధించేందుకు ప్రయత్నించడం ద్వారా మీ ముందున్న కొండంత లక్ష్యాన్ని కరిగించగలుగుతారు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఆ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే మీ ప్రిపరేషన్‌ సాఫీగా సాగుతుంది. ఉదా: కెమిస్ట్రీలో పీరియాడిక్‌ టేబుల్‌ని రివిజన్ చేయడం, కొన్ని ప్రశ్నలను నిర్దేశించుకొని పరిష్కరించగలిగేలా ప్రయత్నించడం వంటివి. 
  • మీ సమయానుకూలంగా క్విజ్‌లు వంటివి పెట్టుకొని మీకు మీరే ఓ పరీక్ష వాతావరణాన్ని సృష్టించుకోండి. తద్వారా పరీక్షల ఒత్తిడి తగ్గడంతో పాటు మీ ప్రాక్టీసూ ప్రిపరేషనూ మరింత మెరుగుపడుతుంది.ఈ తరహా ప్రిపరేషన్‌తో మీ ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు సబ్జెక్టుపై పట్టూ ఏర్పడుతుంది. 

జేఈఈ మెయిన్‌ పూర్తి సిలబస్‌ కోసం క్లిక్‌ చేయండి

కొన్ని యాప్‌లు మీకోసం.. 

  • ఎన్‌టీ అభ్యాస్‌(NT Abhyas): జేఈఈ మెయిన్‌, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌లందించేందుకు ఈ యాప్‌ను ఎన్‌టీఏ సిద్ధం చేసింది. జేఈఈ ఆశావహులకు ఈ యాప్‌ ఉచిత డైలీ మాక్‌టెస్టులు అందిస్తోంది. ప్రతి మాక్‌ టెస్టులో వివరణాత్మకంగా సొల్యూషన్లు ఇవ్వడంతో పాటు పెర్ఫామెన్స్ అనాలసిస్‌ కూడా ఉంటుంది. విద్యార్థులు ఏ సమయంలోనైనా నేర్చుకొనేందుకు వీలుగా ఆఫ్‌లైన్‌ యాక్సెస్‌ని సైతం అందుబాటులో ఉంచింది. 
  • మెల్‌వానో (Melvano): ఈ యాప్‌ని ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థులు రూపొందించారు. దీంతో విద్యార్థులు ఏ అంశంలో వీక్‌గా ఉన్నారో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి గుర్తించే వీలుంటుంది. ఆల్‌ ఇండియా టెస్ట్‌ సిరీస్‌లు, 45 ఏళ్ల పాత ప్రశ్నలూ అందుబాటులో ఉంటాయి. 
  • స్వయం(SWAYAM):  ప్రఖ్యాత ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రొఫెసర్లతో రూపొందించిన వీడియో లెక్చర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో కాన్సెప్టులను నేర్చుకొనేందుకు వీలుగా ఇది ఉపయోగపడుతుంది.

Published : 02 Nov 2025 15:57 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు