JEE Main 2024: జేఈఈ మెయిన్‌కు అప్లై చేస్తున్నారా? ఈ మార్పుల్ని గుర్తుంచుకోండి!

జేఈఈ మెయిన్‌ 2024 పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందు విద్యార్థులు ఈ మార్పుల్ని గమనంలోకి తీసుకుంటే మంచిది.

Updated : 09 Nov 2023 19:02 IST

JEE Main 2024 Registrations| ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2024(JEE Main 2024) పరీక్షకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జనవరిలో జరిగే తొలి విడత పరీక్షకు నవంబర్ 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గతేడాదితో పోలిస్తే JEE Main 2024పరీక్షకు సంబంధించి కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. దరఖాస్తు చేసుకొనే ముందు అభ్యర్థులు వీటిని గమనంలోకి తీసుకుంటే మేలు. వెబ్‌సైట్‌ అడ్రస్‌ మొదలుకొని సిలబస్‌ వరకు చేసిన పలు మార్పులను గమనిస్తే.. 

జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు షురూ.. పరీక్ష తేదీలు, సిలబస్‌ ఇదే..!

  • జేఈఈ మెయిన్‌ 2024కి సంబంధించి హోస్ట్‌ వెబ్‌సైట్‌ అడ్రస్‌లో ఎన్‌టీఏ మార్పు చేసింది. గతంలో jeemain.nta.nic.in ఉండగా.. తాజాగా దాన్ని jeemain.nta.ac.inగా మార్చారు. కొత్త వెబ్‌సైట్‌లో విద్యార్థులకు సహాయపడేందుకు వీలుగా చాట్‌ బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు, నోటిఫికేషన్‌, అడ్మిట్‌ కార్డులు, ఫలితాలు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉండనున్నాయి.
  • జేఈఈ మెయిన్‌ 2024 పరీక్షకు రిజిస్ట్రేషన్‌ చేసుకొనే సమయంలో విద్యార్థులు ఎన్‌ఏడీ పోర్టల్‌ ద్వారా డిజీలాకర్‌ అకౌంట్‌ లేదా అకడెమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ ఐడీ (ABC ID)ని సృష్టించుకోవాలి. డిజీలాకర్‌/ఏబీసీ ఐడీ ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోని విద్యార్థులు పరీక్ష జరిగే రోజున పరీక్షా కేంద్రంలో ప్రవేశ సమయానికి గంట ముందుగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.  అలాగే, JEE Main రిజిస్ట్రేషన్‌కు పాస్‌పోర్టు నంబర్‌, పాన్‌ నంబర్‌ లేదా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌లను ఉపయోగించవచ్చు. అయితే, వీటితో నమోదు చేసుకోవడం వల్ల కూడా పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది.
  • జేఈఈ మెయిన్‌ 2024 పరీక్ష సిలబస్‌ను సవరించారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ సిలబస్‌ నుంచి కొన్ని అధ్యాయాలను పూర్తిగా తొలగించగా.. మరికొన్ని సబ్‌ టాపిక్‌ల కూడా తొలగించారు. కరోనా కాలంలో సీబీఎస్‌ఈ విద్యార్థులకు 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ లేదా తత్సమాన తరగతిలో సిలబస్‌ తగ్గించినందున ఆ ప్రకారమే జేఈఈ మెయిన్‌ పరీక్షలకు కూడా తగ్గించారు. రసాయన శాస్త్రంలో పలు పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు. భౌతికశాస్త్రం, గణితంలో కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగా, మరికొన్నింట్లో పాక్షికంగా తొలగించారు. తొలగించిన పాఠ్యాంశాల వివరాలను జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్లో ఎన్‌టీఏ అందుబాటులో ఉంచింది.
  • దరఖాస్తు రుసుంలో ఈసారి స్వల్ప మార్పు జరిగింది. గతేడాది జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ(NCL) కేటగిరీకి చెందిన అబ్బాయిలకు రూ.1000ల చొప్పున ఫీజు ఉండగా.. ఈసారి దాన్ని రూ.900లకు తగ్గించారు. 
  • జేఈఈ మెయిన్తో‌ 2023 పరీక్షతో పోలిస్తే ఈసారి పరీక్ష నిర్వహించే నగరాలు/పట్టణాల సంఖ్యను తగ్గించారు. గతసారి ఈ పరీక్షను 304 సిటీల్లో నిర్వహించగా.. ఈసారి మాత్రం 300 నగరాల్లోనే నిర్వహిస్తున్నారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని