బండి.. ఎగురుతుందండీ..!

హాయ్‌ నేస్తాలూ.. ‘మనం పెద్దవాళ్లతో కలిసి బైక్‌ మీద వెళ్తూ, ట్రాఫిక్‌లో చాలాసేపు ఆగిపోతే ఏమనుకుంటాం?’ - బండికి కూడా రెక్కలు ఉంటే.. ఈ ట్రాఫిక్‌ బాధలు లేకుండా ఎంచక్కా రయ్‌మంటూ ఎగురుతూ వెళ్లిపోవచ్చు అనుకుంటాం కదా!

Published : 21 Mar 2023 00:54 IST

హాయ్‌ నేస్తాలూ.. ‘మనం పెద్దవాళ్లతో కలిసి బైక్‌ మీద వెళ్తూ, ట్రాఫిక్‌లో చాలాసేపు ఆగిపోతే ఏమనుకుంటాం?’ - బండికి కూడా రెక్కలు ఉంటే.. ఈ ట్రాఫిక్‌ బాధలు లేకుండా ఎంచక్కా రయ్‌మంటూ ఎగురుతూ వెళ్లిపోవచ్చు అనుకుంటాం కదా!   కానీ, అదంతా ‘స్టార్‌వార్స్‌’లాంటి సిరీస్‌ల్లోనే సాధ్యమని మనకు మనమే సర్దిచెప్పుకొంటాం. కానీ, ఇటీవలే ఎగిరే బైక్‌లాంటి వాహనాన్ని తయారు చేసిందో స్టార్టప్‌. ఆ వివరాలే ఇవి..

ప్పటివరకూ మనం డ్రోన్లు, ఫ్లయింగ్‌ కార్ల గురించే విని ఉంటాం. ఇంకొందరు వాటిని చూసి ఉంటారు. అమెరికాలోని డెట్రాయిట్‌లో జరుగుతున్న ఆటో షోలో జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్‌ తయారు చేసిన ఫ్లయింగ్‌ బైక్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది అచ్చం హెలికాప్టర్‌ మాదిరి గాల్లో ఎగురుతూ ఔరా అనిపిస్తోంది.

విద్యుత్తు సహాయంతో..

ఈ ఫ్లయింగ్‌ బైక్‌ పూర్తిగా విద్యుత్తు సహాయంతో పనిచేస్తుంది. దీనికి నాలుగు వైపులా ఉండే టర్బయిన్ల సాయంతో గాల్లోకి ఎగురుతుంది. ఈ బైక్‌ దాదాపు 300 కిలోల బరువు ఉంటుంది. వంద కిలోల వరకూ బరువును మోయగలదు. దీనిలోని బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా గంటకు 99 కిలోమీటర్ల వేగంతో సుమారు 40 నిమిషాలపాటు గాల్లో ప్రయాణించగలదని తయారీదారులు చెబుతున్నారు.

సెన్సార్లతో నియంత్రణ

‘మరి గాల్లో దీనికేమైనా అడ్డంకులు ఎదురైతే ఎలా?’ అనే భయం వద్దు నేస్తాలూ.. దీనికి అమర్చిన సెన్సార్లు, మ్యాపింగ్‌ కంట్రోల్స్‌ సాయంతో యాక్సిడెంట్లు కాకుండా సాఫీగా ప్రయాణించవచ్చు. దీనికోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఆప్‌లో ఈ బైక్‌ బ్యాటరీ, సెన్సార్లు తదితర పరికరాల స్థితిగతులను కిందనున్నవారు కూడా పర్యవేక్షించవచ్చు. మరి ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ధర కూడా అంతే ఉంటుంది కదా.. ప్రస్తుతం కంపెనీ నిర్ణయించిన ధర అయితే రూ.4 కోట్ల పైమాటే.. ఈ ఫ్లయింగ్‌ బైక్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ‘ఫ్లయింగ్‌ బైక్‌’ విశేషాలివీ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని