సముద్రంలో తార!

పేరుకు అదో నక్షత్రం... కానీ ఆకాశంలో ఉండదు. తీరుకు అదో జీవి... కానీ నేలపై ఉండదు. ఎంచక్కా... సముద్రంలో జీవిస్తుంది. ‘ఆ... మాకెప్పుడో అర్థమైపోయింది. దాని పేరు స్టార్‌ఫిష్‌.

Published : 31 Mar 2023 00:54 IST

పేరుకు అదో నక్షత్రం... కానీ ఆకాశంలో ఉండదు. తీరుకు అదో జీవి... కానీ నేలపై ఉండదు. ఎంచక్కా... సముద్రంలో జీవిస్తుంది. ‘ఆ... మాకెప్పుడో అర్థమైపోయింది. దాని పేరు స్టార్‌ఫిష్‌. నక్షత్ర చేప అని కూడా అంటారు’ అని మీరు చెబుదామనుకుంటున్నారా ఫ్రెండ్స్‌. అయితే మీరు తప్పులో కాలేస్తున్నట్లే! ఎందుకంటే ఆ జీవి నక్షత్రంలానే ఉంటుంది. సముద్రంలోనే జీవిస్తుంది. కానీ... దాని పేరు స్టార్‌ఫిష్‌ కాదు. మరి ఆ ప్రాణి పేరేంటో తెలుసుకోవాలని ఉందా?! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చకచకా చదివేయండి.

ముద్రంలో జీవించే ఈ జీవి పేరు బ్రిటల్‌ స్టార్‌. దీనికి సాధారణంగా అయిదు పొడవైన చేతుల్లాంటి నిర్మాణాలుంటాయి. ఇవి దాదాపు 60 సెంటీమీటర్ల పొడవు వరకూ పెరగగలవు. ఇది స్టార్‌ఫిష్‌ కాకపోయినప్పటికీ, కాస్త దాని లక్షణాలే దీనికుంటాయి. వీటిలో రెండువేలకు పై చిలుకు జాతులున్నాయి. మళ్లీ ఇందులో 1200 జాతుల వరకు సముద్రంలో లోతైన ప్రాంతాల్లోనే జీవిస్తుంటాయి.

కళ్లు అనేవే ఉండవు..

ఈ బ్రిటల్‌ స్టార్స్‌కు అసలు చూపే ఉండదు. కానీ... వీటి శరీరంలో ఉండే ప్రత్యేక నరాల వ్యవస్థ ద్వారా స్పర్శ, కాంతిని గుర్తించగలుగుతాయి. వీటికి కళ్లు అయితే ఉండవు కానీ, అయిదు దవడలతో నోరైతే ఉంటుంది. చిన్న చిన్న సముద్రజీవులను ఆహారంగా తీసుకుంటుంది. ఇవి అయిదేళ్ల వరకు జీవిస్తాయి. అనుకూల పరిస్థితులుంటే ఇంకా ఎక్కువ కాలం కూడా బ్రతుకుతాయి.

అచ్చం బల్లుల్లా...

ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఇవి అచ్చం బల్లులు తమ తోకను తెంపేసుకుని శత్రువును అయోమయానికి గురి చేసినట్లే... ప్రవర్తిస్తాయి. ఈ బ్రిటల్‌ స్టార్‌ తమకున్న అయిదు చేతుల్లో ఒక చేతిని లేదా... అందులో కొంత భాగాన్ని కోల్పోతుంది. శత్రువు దృష్టి మరల్చడానికే ఈ ఏర్పాటన్నమాట. తర్వాత కొన్నాళ్లకు అది తిరిగి పెరుగుతుంది. బ్రిటల్‌ స్టార్‌ సముద్రం అడుగున కదలడానికి, ప్రయాణించడానికి తన చేతుల్లాంటి నిర్మాణాలను ఉపయోగించుకుంటుంది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ బ్రిటల్‌ స్టార్‌ విశేషాలు. ఈ సంగతులన్నీ భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని