పెర్ల్‌.. ప్రపంచంలోనే అతి చిన్న కుక్క!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి చిన్న పిల్లలకు పప్పీలంటే బోలెడు ఇష్టం కదూ! సమయం దొరికినప్పుడల్లా ఎంచక్కా పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్తుంటాం.

Updated : 11 Apr 2023 05:12 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి చిన్న పిల్లలకు పప్పీలంటే బోలెడు ఇష్టం కదూ! సమయం దొరికినప్పుడల్లా ఎంచక్కా పెంపుడు జంతువులను బయటకు తీసుకెళ్తుంటాం. కావాల్సినంతసేపు వాటితో ఆడుకుంటాం. అయితే, ఇటీవల ఓ బుజ్జి కుక్కపిల్ల మాత్రం ఏకంగా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేసింది.  ప్రపంచంలోనే బతికున్న కుక్కల్లో అదే అతి చిన్నదట. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

అమెరికాకు చెందిన సెల్మెర్‌ అనే మహిళ దగ్గర ఓ బుజ్జి కుక్కపిల్ల ఉంది. రెండు సంవత్సరాల వయసున్న దాని పేరు ‘పెర్ల్‌’. ఇటీవల అది పరిమాణం పరంగా ప్రపంచంలోనే అతి చిన్న కుక్కగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది.

ఒకే ఇంట్లో రెండు రికార్డులు..

అంతకుముందు ఈ రికార్డు ‘మిరాకిల్‌ మిల్లీ’ అనే కుక్క పేరిట ఉండేది. 2020లో అనారోగ్యంతో అది చనిపోయింది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇప్పుడు రికార్డుల్లోకి ఎక్కిన పెర్ల్‌కు అది పెద్దమ్మ వరస అవుతుందట. అది కూడా సెల్మెర్‌ దగ్గరే పెరిగిందట. కానీ, ఈ పెర్ల్‌ పుట్టకముందే అది ప్రాణాలు విడిచింది. అంటే.. అప్పటివరకూ ఆ ఇంట్లోని కుక్క పేరిట ఉన్న రికార్డును, అక్కడే ఉండే మరోటి బద్ధలు కొట్టిందన్నమాట. ఇంతకీ ఈ బుజ్జి పప్పీ ఎంత చిన్నగా ఉంటుందో మీకు చెప్పనేలేదు కదూ.. 9.14 సెంటీమీటర్ల ఎత్తు, 12.7 సెంటీమీటర్ల పొడవు, 553 గ్రాముల బరువు ఉందట. మిల్లీలాగే ఈ పెర్ల్‌ కూడా పుట్టినప్పుడు 28 గ్రాముల బరువే ఉందని యజమాని చెబుతోంది.

టీవీ షోతో పరిచయం..

అసలీ బుజ్జి కుక్క గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందంటే.. ఒకరోజు పెర్ల్‌ను యజమాని సెల్మెర్‌ ఓ టీవీ టాలెంట్‌ షోకి తీసుకెళ్లిందట. అక్కడి వారంతా ఈ చిన్న పప్పీని చూసేందుకు విపరీతంగా ఆసక్తి చూపారట. అలా ఆ విషయం గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులకు తెలపడంతో.. వారు ఆమె ఇంటికి వెళ్లారు. నిబంధనల ప్రకారం వేర్వేరు సమయాల్లో మూడుసార్లు పెర్ల్‌ కొలతలను తీసుకున్నారట. టీ కప్పు కన్నా కాస్త పెద్దగా, థంబ్లర్‌ కంటే చిన్నగా ఉందా పప్పీ. ఇది చూడ్డానికి చిన్నగానే ఉన్నా.. బాగా తెలివైందట. చాలా నెమ్మదిగా ఉండటంతోపాటు చికెన్‌, చేపలను ఇష్టంగా తింటుందట. ఇంకో విషయం ఏంటంటే.. దీంతోపాటు పుట్టిన మరో మూడు పిల్లలు మాత్రం కాస్త పెద్దగా, మామూలు కుక్కల్లాగే ఉన్నాయి. తమ ఇంట్లోని పప్పీలే రెండుసార్లు
గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కడం తనకెంతో గర్వంగా ఉందని సెల్మెర్‌ తెగ సంబరపడిపోతోంది. నేస్తాలూ.. ఇవీ ప్రపంచ రికార్డు సాధించిన పెర్ల్‌ విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని