Friendship: ఇది మరో స్నేహబంధం!

నేస్తాలూ... మీకు కొంగకూ.. ఓ అంకుల్‌కు మధ్య స్నేహం గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది కదా! మరి మీకు మరో కొంగకూ, ఇంకో అన్నయ్యకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుసా? తెలియదు కదా! అయితే ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.... సరేనా!

Published : 03 Apr 2023 00:06 IST

నేస్తాలూ... మీకు కొంగకూ.. ఓ అంకుల్‌కు మధ్య స్నేహం గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది కదా! మరి మీకు మరో కొంగకూ, ఇంకో అన్నయ్యకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలుసా? తెలియదు కదా! అయితే ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది.... సరేనా!

త్తరప్రదేశ్‌లోని అమేఠీ జిల్లాలోని మండ్కా గ్రామ నివాసి మహమ్మద్‌ ఆరీఫ్‌, ఒక పే..ద్ద కొంగ స్నేహం గురించి ఆ మధ్య సోషల్‌ మీడియాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. కాలు విరిగి, ప్రాణాపాయ స్థితిలో తనకు ఆ కొంగ కనిపిస్తే.. ఆరీఫ్‌ అనే అంకుల్‌ సపర్యలు చేసి దాన్ని బతికించారు. తర్వాత ఆ కొంగ ఆ అంకుల్‌కు ఫ్రెండ్‌గా మారింది. ఇదంతా మీకు తెలుసు కదా....! పక్షి, మనిషి మధ్య అచ్చం ఇలాంటి అనుబంధమే మరోటి కూడా అదే రాష్ట్రంలో ఉంది. ఈ మధ్య ఇది కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  

అక్కున చేర్చుకుని...

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌ రాజ్‌కు చెందిన అమీర్‌కు ప్రస్తుతం 15 సంవత్సరాలు. ఈ అన్నయ్యకు కొన్ని నెలల క్రితం ఓ కొంగపిల్ల దొరికింది. అప్పటి నుంచి దాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ... స్వేచ్ఛగా వదిలేశాడు. అయినా అది అమీర్‌ను వదిలి వెళ్లడం లేదు.

ఎక్కడికెళ్లినా...

అమీర్‌ ఎటు వెళ్లినా... ఈ కొంగ కూడా వెళుతుంది. సైకిల్‌ మీద వెళితే... ఈ కొంగ ఎగురుతూ అమీర్‌ను అనుసరిస్తోంది. ఎప్పుడైతే ఆరీఫ్‌, కొంగల మధ్య స్నేహం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందో... అప్పటి నుంచి అమీర్‌ కూడా సెలబ్రిటీగా మారిపోయాడు. చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి కూడా వచ్చి ప్రజలు అమీర్‌ను, కొంగను చూసి వెళుతున్నారు. సెల్ఫీలూ తీసుకుంటున్నారు. న్యూస్‌ఛానళ్ల వారు కూడా వరస కడుతున్నారు.

‘ఏనాడూ బంధించలేదు’

‘ఆ కొంగ చిన్నగా ఉన్నప్పుడే చేరదీశాను. ఇప్పటివరకూ దాన్ని ఏనాడూ బంధించలేదు. స్వేచ్ఛగా వదిలేశాను. రొట్టెలు, చేపలను ప్రతిరోజూ ఆహారంగా పెడుతున్నా. ఈ కొంగ ఎప్పటికీ నాతోపాటే ఉండాలని కోరుకుంటున్నా’ అని అమీర్‌ చెబుతున్నారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ అమీర్‌, కొంగ స్నేహం విశేషాలు.. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని