కాగితంపై చిత్రాలు కాల్చినారూ!

‘శిలలపై శిల్పాలు చెక్కినారూ..!’ అని కదా ఉండాలి... మరేంటి.. ‘కాగితంపై చిత్రాలు కాల్చినారూ...!’ అని ఉందని ఆశ్చర్యపోతున్నారా?! మీరు అవాక్కయ్యేలా ఉంది కాబట్టే మన ‘హాయ్‌బుజ్జీ’ పేజీ ఈ రోజు మీ కోసం ఈ విశేషాలు మోసుకొచ్చింది.

Updated : 07 Apr 2023 07:02 IST

‘శిలలపై శిల్పాలు చెక్కినారూ..!’ అని కదా ఉండాలి... మరేంటి.. ‘కాగితంపై చిత్రాలు కాల్చినారూ...!’ అని ఉందని ఆశ్చర్యపోతున్నారా?! మీరు అవాక్కయ్యేలా ఉంది కాబట్టే మన ‘హాయ్‌బుజ్జీ’ పేజీ ఈ రోజు మీ కోసం ఈ విశేషాలు మోసుకొచ్చింది. మరి కాగితం ఏంటో.. చిత్రాలు ఏంటో... కాల్చడం ఏంటో.. తెలుసుకుందామా! అయితే ఇంకెందుకాలస్యం ఈ కథనం చదివేయండి మరి. మీకే తెలుస్తుంది అసలు విషయం!

బొమ్మలు గీయాలంటే ఏం ఉండాలి?.. కుంచె, రంగులు ఉండాలి. కానీ ఓ అంకుల్‌కు మాత్రం అగ్గిపుల్ల కావాలి. అంటే అగ్గిపుల్లతో చిత్రాలు గీస్తారేమో అనుకునేరు. అస్సలు కాదు... ఆయన నిప్పుతో చిత్రాలు గీస్తారు. ఆ అంకుల్‌ పేరు కమల్‌ కాంతి రాణా. ఆయన గుజరాత్‌లోని వడోదరలో ఉంటున్నారు

సొంతంగానే...

ఈ ఫైర్‌ ఆర్ట్‌ను ఆయన ఎవ్వరి దగ్గరా నేర్చుకోలేదు. సొంతంగానే ఇందులో నిష్ణాతులయ్యారు. ‘ఏదైనా ఒక వస్తువు నిప్పుతో కాల్చుతున్నప్పుడు ఒక దశలో దాన్ని ఆర్పగలిగితే అదో కళాఖండం అవుతుంది’ అంటారు ఈ అంకుల్‌. కొన్ని సెకన్లు అటూఇటూ అయినా ఆర్ట్‌ సరిగా రాదని చెబుతున్నారు.

కాగితం, పెన్సిల్‌తోనే..

ఈ అంకుల్‌ ముందుగా తాను వేయదలుచుకున్న బొమ్మ అవుట్‌ లైన్‌ను కాగితంపై పెన్సిల్‌తోనే వేసుకుంటారు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఈ స్కెచ్‌ చుట్టూ పెట్రోల్‌, కిరోసిన్‌ లాంటి ద్రావణాలను సన్నని ధార వచ్చే పరికరంతో పోస్తారు. కొన్ని సార్లు స్ఫటికాల రూపంలో ఉండే మండే రసాయనాలనూ ఆయన వినియోగిస్తారు. ఇప్పుడిక అగ్గిపుల్లతో నిప్పు అంటిస్తారు. నిర్దిష్ట సమయం తర్వాత దాన్ని ఆర్పివేస్తారు. అంతే అద్భుత చిత్రం సిద్ధమవుతుంది. ఇందులో కిటుకు మొత్తం ఆ నిప్పును నియంత్రించడంలోనే ఉంటుంది.

కళకు కాస్త కసరత్తు..

ఈ చిత్రకళకు ముందు కాస్త కసరత్తు కూడా ఉంటుంది. ఏంటంటే... కాగితం త్వరగా మండకుండా రసాయనాలతో ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కాగితానికి సంబంధించిన కొన్ని పొరలు మాత్రమే అగ్ని ప్రభావానికి లోనవుతాయి. దీంతో కాగితం కాలిపోదు. ఇలా కేవలం కాగితం మీదే కాకుండా, కాన్వాస్‌, కర్ర పైన కూడా చిత్రాలు వేయగలరు ఈ అంకుల్‌.

రికార్డుల మీద రికార్డులు...

నలభై సంవత్సరాలుగా ఈ ఫైర్‌ ఆర్ట్‌ మీద ఈ అంకుల్‌ ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 35 రకాల పద్ధతులను ఆయన కనుగొన్నారు. మొత్తంగా ఆయన 300పై చిలుకు చిత్రాలు వేశారు. ఇందుకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. ప్రపంచంలోనే అతి పొడవైన ఫైర్‌ ఆర్ట్‌ రికార్డు కూడా ఈయన పేరు మీదే ఉంది. 63 అడుగుల పొడవు, ఏడు అడుగుల వెడల్పుతో క్రికెట్‌ క్రీడాకారులకు సంబంధించిన చిత్రాన్ని గీశారు. ఏదైనా సాధించాలి అంటే ఫైర్‌ ఉండాలి అంటారు కానీ... ఈ అంకుల్‌ మాత్రం ఫైర్‌తోనే చిత్రాలు గీస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తున్నారు. అన్నట్లు మీకు మరో విషయం తెలుసా... మన దేశం మొత్తం మీద కమల్‌ కాంతి రాణా ఒక్కరే ఫైర్‌ ఆర్టిస్టు. నేస్తాలూ మీరు మాత్రం ఇలాంటివి అస్సలు ప్రయత్నించొద్దు సరేనా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని