మట్టి బొమ్మలకో మ్యూజియం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఎన్ని బొమ్మలున్నా.. కొత్తవి కనిపిస్తే చాలు.. అది కూడా కొనుక్కుంటే బాగుంటుందనిపిస్తుంది కదూ! ఇక ఆ బొమ్మలతో ఆడుకుంటుంటే.. మనకు సమయమే తెలియదు.

Published : 24 Mar 2023 00:47 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనకు ఎన్ని బొమ్మలున్నా.. కొత్తవి కనిపిస్తే చాలు.. అది కూడా కొనుక్కుంటే బాగుంటుందనిపిస్తుంది కదూ! ఇక ఆ బొమ్మలతో ఆడుకుంటుంటే.. మనకు సమయమే తెలియదు. కొత్తవి వచ్చేకొద్దీ, రకరకాల కారణాలు చెప్పి.. పాతవాటిని మూలకు పడేస్తుంటాం. కానీ, ఓ అన్నయ్య మాత్రం పాత మట్టి బొమ్మలతో ఏకంగా ఓ మ్యూజియాన్నే ఏర్పాటు చేశాడు. మరి ఆ అన్నయ్య ఎవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.!

పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాకు చెందిన మహదేవ్‌ ముఖర్జీ అన్నయ్యకు కళలు, మన సంస్కృతి మీద విపరీతమైన ఆసక్తి. ఆ ఇష్టంతోనే ప్రపంచంలోని నలుమూలల నుంచి పురాతన బొమ్మలను సేకరిస్తూ.. తన ఇంటినే ఓ మ్యూజియంలా తీర్చిదిద్దాడు. అందులో ఇప్పుడు మనం ఉపయోగించే ప్లాస్టిక్‌, రబ్బరువి ఏమీ ఉండవు నేస్తాలూ.. అన్నీ పర్యావరణహితమైనవేనట.

పిల్లల కోసం..  

మహదేవ్‌ అన్నయ్య దాదాపు 17 సంవత్సరాలుగా మట్టి బొమ్మలను సేకరిస్తున్నాడు. అలా ఇప్పటివరకూ దాదాపు 1400 బొమ్మలను సేకరించాడు. మన జానపద కళలు, ప్రాచీన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ సేకరణను హాబీగా మలుచుకున్నాడీ అన్నయ్య. ఈ మ్యూజియంలో మమ్మీల బొమ్మలతోపాటు ఆఫ్రికా, టాంజానియా ప్రాంతాల నుంచి సేకరించినవీ ఉన్నాయట. అంతేకాదు.. ప్రతి బొమ్మకు సంబంధించిన వివరాలను కూడా జాగ్రత్తగా రాసి ఉంచుతున్నాడు. ఎక్కడ బొమ్మల ప్రదర్శన నిర్వహించినా.. కచ్చితంగా అక్కడికి వెళ్లి, చరిత్రకు సంబంధించినవి ఏవైనా ఉంటే కొనుగోలు చేసి మరీ ఇంట్లో ఏర్పాటు చేసిన మ్యూజియంలో భద్రపరుస్తాడట. తన తర్వాత కూడా ఈ బొమ్మల మ్యూజియం కొనసాగేలా చూస్తానని చెబుతున్నాడు మహదేవ్‌. తనలాగే ఆసక్తి ఉన్న వాళ్లు ఎవరైనా కనిపిస్తే, ఆ బాధ్యతను వారికి అప్పగిస్తాడట. నేస్తాలూ.. మొత్తానికి బొమ్మలు భలే ముచ్చటగా ఉన్నాయి కదూ..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని