నాలుగేళ్ల బుడత.. ‘గిన్నిస్‌’ రచయిత!

నేస్తాలూ.. నాలుగేళ్ల వయసు పిల్లలను ఏబీసీడీలు రాయమంటేనే బద్ధకిస్తారు...అమ్మానాన్నలకు ఏవో సాకులు చెప్తూ హోంవర్క్‌ చేయకుండా తప్పించుకుంటారు కదా!

Published : 04 Apr 2023 00:09 IST

నేస్తాలూ.. నాలుగేళ్ల వయసు పిల్లలను ఏబీసీడీలు రాయమంటేనే బద్ధకిస్తారు...అమ్మానాన్నలకు ఏవో సాకులు చెప్తూ హోంవర్క్‌ చేయకుండా తప్పించుకుంటారు కదా! కానీ, ఓ చిన్నారి మాత్రం ఆ వయసులో ఏకంగా ఓ పుస్తకాన్నే రాశాడు. గిన్నిస్‌ రికార్డు కూడా సాధించాడు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఆ చిన్నారి ఎవరో, అతడి విశేషాలేంటో తెలుసుకుందామా..!

అబుదాబికి చెందిన సాయిద్‌ రషీద్‌కి ప్రస్తుతం నాలుగు సంవత్సరాలు. అయితేనేం.. తన వయసు పిల్లలంతా ఆడుతూపాడుతూ నర్సరీ చదువుకుంటుంటే..  ఈ నేస్తం మాత్రం ‘ది ఎలిఫెంట్‌ సాయిద్‌ అండ్‌ ది బియర్‌’ పేరుతో ఏకంగా ఓ పుస్తకాన్నే ప్రచురించాడు. చిన్నతనం నుంచే కథలు వినడం, చదవడం, రాయడమంటే ఆసక్తి ఉండటంతో.. అతి పిన్న వయసు రచయితగా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం దక్కించుకున్నాడు. ఇప్పటికే ఈ పుస్తకం వెయ్యికి పైగా కాపీలు అమ్ముడయ్యాయట.

అక్క స్ఫూర్తితో..

సాయిద్‌ వాళ్ల అక్క అల్దాబీ కూడా గతంలోనే గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఎనిమిదేళ్ల వయసులోనే ద్విభాషా పుస్తకాన్ని రచించిన మొదటి బాలికగా నిలిచిందామె. నాలుగు నుంచి పదేళ్ల వయసు పిల్లలందరికీ నచ్చేలా బొమ్మలతో సహా అరబిక్‌, ఆంగ్ల భాషల్లో పుస్తకాలు రచించింది అల్దాబీ. సాయిద్‌ కూడా వాళ్ల అక్కను చూసి, ఎలాగైనా తను కూడా ఓ పుస్తకం రాయాలని అనుకున్నాడు.

కల్పిత పాత్రలతో..

తన కథనానికి ఏనుగు, ధృవపు ఎలుగుబంటి కల్పిత పాత్రలను ఎంచుకున్నాడు సాయిద్‌. ఒకరోజు పిక్నిక్‌కి వెళ్లిన ఏనుగుకు అక్కడో ధృవపు ఎలుగుబంటి కనిపిస్తుందట. భారీగా ఉండే ఆ ఏనుగును చూసి, అది తనను తినేస్తుందేమోనని ఎలుగు భయపడిపోయిందట. కానీ, ఏనుగు మాత్రం ఆ ఎలుగు దగ్గరికి వెళ్లి, ఎంతో స్నేహంగా మాట్లాడిందట. దాంతో అవి రెండూ మంచి మిత్రులుగా మారాయి. మనం హోంవర్క్‌ రాయడమే చాలా పెద్ద పనిగా భావిస్తుంటాం.. అలాంటిది.. ఏకంగా పుస్తకం అంటే మాటలు కాదు కదా.. ఏనుగు, ఎలుగుబంటిల అంశాన్నే సాయిద్‌ బొమ్మలతో సహా ఎంతో చక్కగా రచించాడట. అంతేకాదు.. తన పుస్తకాన్ని పాఠశాలలో తల్లిదండ్రులు, స్నేహితుల ముందే అందరికీ చదివి వినిపించాడట. ప్రస్తుతం తను రెండో పుస్తకం రాసే పనిలో ఉన్నాడు. మ్యాథ్స్‌ అంటే ఇష్టమని చెబుతున్న సాయిద్‌.. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి, ఈ అక్కాతమ్ముళ్లకు మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని