నోరూరించే కారు!

చాక్లెట్‌ అనే పదం వినిపిస్తే చాలు.. పిల్లలమైన మనకు నోట్లో నీళ్లూరుతాయి కదూ! అలాగే మనకు కారు అన్నా భలే ఇష్టం కదా! ఈ రెండింటినీ కలిపేస్తే చాక్లెట్‌ కారు!! అవును ఓ అంకుల్‌ ఏకంగా చాక్లెట్‌తో కారునే తయారు చేశాడు.

Published : 22 Mar 2023 01:26 IST

చాక్లెట్‌ అనే పదం వినిపిస్తే చాలు.. పిల్లలమైన మనకు నోట్లో నీళ్లూరుతాయి కదూ! అలాగే మనకు కారు అన్నా భలే ఇష్టం కదా! ఈ రెండింటినీ కలిపేస్తే చాక్లెట్‌ కారు!! అవును ఓ అంకుల్‌ ఏకంగా చాక్లెట్‌తో కారునే తయారు చేశాడు. ఇది చూడ్డానికి అచ్చం నిజమైన కారులానే ఉంటుంది. మరి దాని సంగతులేంటో తెలుసుకుందామా..! అయితే ఇంకేం.... చకచకా ఈ కథనం చదివేయండి.

ఇంతకీ ఈ చాక్లెట్‌ కారును తయారు చేసిన అంకుల్‌ ఎవరో? ఆయన పేరేంటో? చెప్పనేలేదు కదూ! ఫ్రాన్స్‌కు చెందిన అమౌరీ గుయిచోన్‌ అనే వ్యక్తి ఈ కారుకు రూపం ఇచ్చాడు. ఈయన ఓ ప్రముఖ చెఫ్‌. గతంలోనూ రకరకాల జంతువులు, పక్షులు, వాహనాలు, రోబోలు, పిల్లలు ఆడుకొనే గుర్రం బొమ్మలెన్నింటినో ఆయన చాక్లెట్‌తో తయారు చేశాడు.

తీరుగా.. తీయగా...

అమౌరీ ఈ కారును తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. దానికో ఆకారం తీసుకురావడానికి రకరకాల పరికరాలను ఉపయోగించాడు. దళసరి కాగితం మీద ముందుగానే కారు ఆకృతిని సిద్ధం చేసుకున్నాడు. అంతకు ముందే చాక్లెట్‌ సిరప్‌ను అచ్చులుగా పోసి తయారు చేసుకున్న షీట్లను కారుకు కావాల్సిన భాగాల ఆకారంలో కత్తిరించి పెట్టుకున్నాడు. తర్వాత వాటన్నింటినీ చాక్లెట్‌ ద్రావణంతోనే అతికించాడు.

రంగులద్ది... చక్రాలు దిద్ది...

కారు ఆకృతి తయారైన తర్వాత దానికి ఫుడ్‌ కలర్‌ను ఈ అంకుల్‌ స్ప్రే చేశాడు. తర్వాత నాలుగు చాక్లెట్‌ దిమ్మెలను తీసుకుని వాటిని చక్రాలుగా చెక్కుకున్నాడు. వాటికీ నల్లని రంగు వేసి, ఆ కారు ఆకృతికి అమర్చాడు.

నెట్టింట్లో తెగ షి‘కారు’!

ఇక చివర్లో ఈ చాక్లెట్‌ కారుకు హ్యుందాయ్‌ ఈవీ ఐకానిక్‌-6 లోగోను తీర్చిదిద్దాడు. ఈ ప్రక్రియనంతా ఎంచక్కా వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. అంతే... ఆ వీడియో తక్కువ సమయంలోనే వైరలైపోయింది. దీనికి హ్యుందాయ్‌ సంస్థ కూడా స్పందించింది. అద్భుతంగా తమ కారు మోడల్‌ను తయారు చేసిన అమౌరీని అభినందించింది కూడా... ఈ కారును చూస్తేనే మనకు నోరు ఊరుతోంది. మరి తయారు చేసేటప్పుడు ఈ అంకుల్‌ ఎలా కంట్రోల్‌ చేసుకుని ఉంటాడోనని.. మీకు ఈ పాటికే అనుమానం వచ్చి ఉంటుంది కదూ! నేస్తాలూ.. మొత్తానికి ఇవీ చాక్లెట్‌ కారు విశేషాలు. భలే ఉన్నాయి కదా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు