వింతైన పోస్టాఫీసు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇప్పుడంటే సెల్‌ఫోన్లూ, ఇంటర్నెట్‌ వచ్చాక అందరూ ఉత్తరాలు మరిచిపోయారు కానీ ఒకప్పుడు ప్రజలు వాటిద్వారానే సమాచారాన్ని పంచుకునేవారు. ప్రస్తుతం లెటర్లు రాయడం

Published : 21 May 2022 00:06 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇప్పుడంటే సెల్‌ఫోన్లూ, ఇంటర్నెట్‌ వచ్చాక అందరూ ఉత్తరాలు మరిచిపోయారు కానీ ఒకప్పుడు ప్రజలు వాటిద్వారానే సమాచారాన్ని పంచుకునేవారు. ప్రస్తుతం లెటర్లు రాయడం తగ్గిపోయినా.. కొన్ని పోస్టాఫీసులు మాత్రం వాటి ప్రత్యేకతను ప్రపంచానికి చాటుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిదే..

మంగోలియాలో టెంగర్‌ అనే ఎడారి ప్రాంతం ఒకటి ఉంది. ఆ ఇసుక దిబ్బల్లో ఒకే ఒక గదిలో కొనసాగే ఓ పోస్టాఫీసు ఉంది. మామూలే కదా అని అనుకోకండి.. దానికో ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. అది ప్రపంచంలోనే మారుమూల పోస్టాఫీసు అట. 35 ఏళ్లుగా కొనసాగుతోంది. రోడ్డుకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే దీనికి వచ్చేవారు చాలా తక్కువ. ఎవరైనా నడుచుకుంటూ రావాల్సిందే. అయినా, గత డిసెంబరులో దాదాపు 20 వేల ఉత్తరాలు ఇక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్లాయట.

చెక్కలతోనే నిర్మాణం
కొద్దిరోజుల ముందు వరకూ ఎవరికీ తెలియని ఈ పోస్టాఫీసు గురించి.. ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుందంటే - దానికి కారణం జాంగ్‌. అక్కడ పనిచేసేందుకు కొత్తగా వచ్చిన ఉద్యోగి ఆమె. ఎడారిలో విసిరేసినట్లుగా ఉండే ఈ కార్యాలయాన్ని ఎలాగైనా వెలుగులోకి తీసుకురావాలని అనుకుందామె. మొదట సమీపంలోని పట్టణంలో చెక్కలతో కొత్తగా ఓ గదిని నిర్మించి.. ఇక్కడకు తరలించాలనుకుంది. కానీ, ఇసుకలో సాధ్యపడలేదు. దాంతో చెక్క ముక్కలనే తీసుకెళ్లి.. దాదాపు 20 రోజులు కష్టపడి ప్రస్తుతం ఉన్నచోటనే నిర్మించారట.

చెబితే చాలు..
‘పోస్టాఫీసును తీర్చిదిద్దాం సరే.. మరి ఉత్తరాలు రావాలంటే ఎలా?’ అని అనుకుంది జాంగ్‌. తన సహాయకురాలితో కలిసి ఇంటర్నెట్‌ సాయంతో దానికీ ఓ మార్గం ఆలోచించింది. అదేంటంటే - ఉత్తరాలు పంపించాలనుకున్న వారు ఫోన్‌ ద్వారా చెబితే.. జాంగ్‌ స్వయంగా ఆ సందేశాన్ని రాసి, చెప్పిన చిరునామాకు పోస్టు చేయడం. కాలు కదపకుండా పని జరిగిపోతుండటంతో చుట్టుపక్కల ప్రజలు.. ఫోన్లు చేయడం ప్రారంభించారు. అలా ఏరోజుకారోజు వచ్చిన ఉత్తరాలన్నింటిపైన.. ఈ పోస్టాఫీసు ఏరియల్‌ వ్యూతో ముద్రించిన స్టాంపులను అతికించి, నడుచుకుంటూ రోడ్డు మీదకు వెళ్లి, వాహనానికి అందిస్తుందట. ప్రపంచంలోనే అత్యంత మారుమూల పోస్టాఫీసు నుంచి లెటర్‌ రావడమంటే గొప్పే కదా మరి! ఈ ఫొటోలు చూశాక.. దాని వివరాలు తెలుసుకున్నాక.. భలే పోస్టాఫీసు అని అనిపిస్తుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని