పిట్ట కొంచెం.. పట్టుదల ఘనం!

తనో చిన్నారి. తనకు పట్టుమని పదేళ్లూ నిండలేదు.. కానీ చిత్రలేఖనంలో పట్టు సాధించింది. మరోవైపు పుస్తకాలనూ ఓ పట్టు పడుతోంది. రికార్డుల మీద రికార్డులూ కొల్లగొడుతోంది.

Published : 10 Jun 2022 00:19 IST

తనో చిన్నారి. తనకు పట్టుమని పదేళ్లూ నిండలేదు.. కానీ చిత్రలేఖనంలో పట్టు సాధించింది. మరోవైపు పుస్తకాలనూ ఓ పట్టు పడుతోంది. రికార్డుల మీద రికార్డులూ కొల్లగొడుతోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే....

కేరళ రాష్ట్రంలోని మలప్పురం జిల్లా తిరూర్‌కు చెందిన చిన్నారి ఎస్‌.ఎన్‌.దక్షిణ.. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. తనకు మూడేళ్ల వయసున్నప్పటి నుంచే బొమ్మలు గీయడం ప్రారంభించింది. అలా చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. ఇప్పటివరకు వేలాది పెయింటింగ్స్‌ వేసింది. అత్యధిక ఆయిల్‌ పెయింటింగ్స్‌ వేసినందుకు గాను ఈ చిన్నారికి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం దక్కింది. 

కరోనా కాలంలో...
కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే తను ఈ రికార్డు సాధించింది. తను అంతకు ముందు మాములు స్కెచ్‌లతోనే పెయింటింగ్‌లు వేసేది. లాక్‌డౌన్‌ కాలంలో చాలా తీరిక దొరకడంతో ఆయిల్‌ పెయింటింగ్‌ల మీద దృష్టి పెట్టింది. పెద్దగా శిక్షణ లేకుండా, సొంతంగానే బొమ్మలు వేయడం నేర్చుకుంది.

నడిచే లైబ్రరీ..
దక్షిణ.. కేవలం బొమ్మలు వేయడంతోనే ఆగిపోలేదు. అమ్మానాన్న ప్రోత్సాహంతో ఈ చిన్నారి ఇప్పటి వరకు ఏకంగా 1,000 పుస్తకాలను చదివేసింది. ఓ వైపు పుస్తకాలు చదువుతూనే ఒక నెలలో 65 తైలవర్ణ చిత్రాలు వేసి రికార్డు సాధించింది. మరో విశేషం ఏంటంటే ఈ చిన్నారి ఇప్పటి వరకు 200 పుస్తకాలకు సమీక్షలూ రాసింది.

ఉడతా భక్తిగా..
దక్షిణకు సాయం చేసే గుణమూ ఎక్కువే. 2019లో తన చిత్రాల ప్రదర్శనతో వచ్చిన రూ.20,000ను ‘ముఖ్యమంత్రి సహాయనిధి’కి అందించింది. ఇంత మంచి పని చేసినందుకు అప్పట్లో చాలామంది దక్షిణను ఎంతగానో ప్రశంసించారు. భవిష్యత్తులో సైంటిస్టు కావాలనేది ఈ నేస్తం ఆశయమట. ఫ్రెండ్స్‌... తనకు మరో కోరికా ఉంది తెలుసా! అదేంటంటే ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించడం. ఈ చిన్నారి ఆశలూ, ఆశయాలూ నెరవేరాలని మనమూ కోరుకుందామా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని