చల్‌ చల్‌ గుర్రం... చిన్ని గుర్రం!

అది చిట్టి పొట్టి గుర్రం.. మేఁ.. మేఁ.. మేక కన్నా చిన్నది.. భౌ.. భౌ.. కుక్క కన్నా చిట్టిది.. ఎంతో ప్రత్యేకమైంది.. ప్రపంచ ప్రఖ్యాతమైంది! మరి దాని విశేషాలు తెలుసుకుందామా!!

Updated : 13 Jun 2022 06:40 IST

అది చిట్టి పొట్టి గుర్రం.. మేఁ.. మేఁ.. మేక కన్నా చిన్నది.. భౌ.. భౌ.. కుక్క కన్నా చిట్టిది.. ఎంతో ప్రత్యేకమైంది.. ప్రపంచ ప్రఖ్యాతమైంది! మరి దాని విశేషాలు తెలుసుకుందామా!!

ఆ చిట్టి గుర్రం పేరే బాంబెల్‌. అంటే బుడగ అని అర్థమట. ఇంతకీ ఈ గుర్రం ఎక్కడ ఉందో తెలుసా.. ప్రస్తుతం ఇది పోలాండ్‌లో ఉంది. దీని ఎత్తు కేవలం 56.7 సెంటీమీటర్లు మాత్రమే. దాదాపు ఒక అడుగు మీద పది అంగుళాలు. అంటే పెద్దవాళ్లకు మోకాళ్ల ఎత్తు అన్నమాట.

వరించిన గిన్నిస్‌...
ఈ బాంబెల్‌ ప్రస్తుతం బతికున్న వాటిల్లో అత్యంత పొట్టి మగ గుర్రం. దీని పేరిట ‘గిన్నిస్‌ రికార్డు’ కూడా ఉంది. ఇది 2014లో జన్మించింది. దీని తల్లిదండ్రులు మామూలు గుర్రాలే. అంటే మరగుజ్జు రకానికి చెందినవి కావు. కానీ దీనికి మాత్రం ప్రత్యేక లక్షణాలు వచ్చాయి. దీనికి రెండు నెలల వయసున్నప్పుడు ఇది తన యజమానులైన పట్య్రాక్‌, కటర్‌జైనా జెలెన్‌స్కియా దగ్గరకు చేరింది. కొన్ని నెలల్లోనే వాళ్లకు బాంబెల్‌ పెరుగుదలలో ఏదో తేడా ఉన్నట్లు అనుమానం వచ్చింది. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అది నిజమని తేలింది. దీంతో వీళ్లు ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు కొంతకాలం తర్వాత దీనికి ప్రపంచంలోనే అత్యంత చిన్న గుర్రం రికార్డును ఇచ్చారు.

పిల్లలకు చాలా ఇష్టం..
ఈ చిట్టి పొట్టి గుర్రం అంటే మనలాంటి చిన్నారులకు చాలా ఇష్టం. అందుకే ఈ గుర్రాన్ని ప్రతి నెలకోసారి, వాళ్లు స్థానిక చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడి చిన్నపిల్లలు దీంతో సరదాగా కాసేపు ఆడుకుంటారు. ఈ బాంబెల్‌కు కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఇది కూడా వాళ్లతో చక్కగా కలిసిపోతుంది. సోషల్‌ మీడియాలో కూడా మన బాంబెల్‌కు పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇంతకు ముందు వరకు ప్రపంచంలోనే అతి చిన్న గుర్రం రికార్డు థంబులీనా అనే గుర్రం పేరిట ఉండేది. కానీ పాపం అది 2018లో చనిపోయింది. తర్వాత ఆ రికార్డు మన బాంబెల్‌ సొంతం చేసుకుంది.

నేస్తాలూ.. మొత్తానికి ఇవీ చిట్టి పొట్టి గుర్రం సంగతులు. ఈ విశేషాలు భలే సరదాగా ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు