తూటా అంత తుపాకీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..! ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో తుపాకీని. అలా అని మామూలు తుపాకీని కాదు. ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న తుపాకీని. తూటా అంత

Published : 27 Jun 2022 01:13 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా..! ఏంటి అలా చూస్తున్నారు. నేను ఎవరనా? నేనో తుపాకీని. అలా అని మామూలు తుపాకీని కాదు. ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న తుపాకీని. తూటా అంత తుపాకీని.. మరి నా విశేషాలు.. నా మాటల్లోనే తెలుసుకుంటారా?!

నా పేరు స్విస్‌ మినీ గన్‌. అధికారికంగా ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న తుపాకీని నేనే. నన్ను చూసి మీరు కీచైన్‌కు వాడే బొమ్మ తుపాకీ అనుకుంటారు. కానీ కాదు. నేను అసలు సిసలైన తుపాకీనే. తూటా అంతే ఉండే నాలోనూ ఆరు బుజ్జి తూటాలుంటాయి తెలుసా.

నేనూ పేలుతానోచ్‌!
స్విట్జర్లాండ్‌లో తయారైన నా పరిమాణం ఎంతుంటుందో తెలుసా.. కేవలం 5.5 సెంటీమీటర్లు! నాలో 2.34 ఎమ్‌.ఎమ్‌. బుల్లెట్లుంటాయి. నన్ను పేలిస్తే తూటాలు దూసుకెళతాయి. ఇవి గాయాల్ని కూడా చేయగలవు. కానీ మరీ అంత ప్రాణాంతకం కాదనుకోండి. అయినా నేనూ మారణాయుధాన్నే. ఎందుకంటే చాలా దగ్గర నుంచి నాతో షూట్‌ చేస్తే మాత్రం అవతల వాళ్ల ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.

ధర ఎక్కువే..!
నేనైతే బుజ్జి తుపాకీనే కానీ.. ధర మాత్రం ఎక్కువే ఉంటుంది. స్విట్జర్లాండ్‌లో నన్ను కొనాలంటే మన దేశ కరెన్సీలో దాదాపు 4,69,515 రూపాయలు కావాల్సిందే. మళ్లీ నాలో గోల్డ్‌ ఎడిషన్‌ కూడా ఉంది. దాని ధరైతే ఏకంగా 39,13,090 రూపాయలు! కానీ నాతో పాటు ఓ లెదర్‌ హోల్డర్‌ వస్తుంది. అది మాత్రం ఉచితమే!

నాకు ప్రవేశం లేదు
నేను చాలా చిన్నగా ఉంటాను కాబట్టి.. నాకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో ప్రవేశం లేదు. అన్నట్లు చెప్పడం మరిచిపోయా.. నా పేరిట గిన్నిస్‌ రికార్డు కూడా ఉంది. దాని ప్రకారం నా బరువు కేవలం 19.8 గ్రాములు మాత్రమే. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ బుజ్జి తుపాకీనైన నా విశేషాలు. బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని