దటీజ్‌ శివరాం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోవాలన్నా, ఆన్‌లైన్‌ క్లాసులు వినాలన్నా, బ్యాంకుల్లో పని జరగాలన్నా, టికెట్లు బుక్‌ చేసుకోవాలన్నా.. ఇలా ఒక్కటేమిటీ, ఈ సాంకేతిక యుగంలో

Published : 05 Feb 2023 16:01 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోవాలన్నా, ఆన్‌లైన్‌ క్లాసులు వినాలన్నా, బ్యాంకుల్లో పని జరగాలన్నా, టికెట్లు బుక్‌ చేసుకోవాలన్నా.. ఇలా ఒక్కటేమిటీ, ఈ సాంకేతిక యుగంలో ప్రతిదానికీ సాఫ్ట్‌వేర్‌ అవసరమే కదా! పెద్ద పెద్ద వారినే ముప్పుతిప్పులు పెట్టే అలాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ని ఓ నేస్తం చిన్నతనంలోనే అలవోకగా నేర్చుసుకుంటున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా!

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఆర్నవ్‌ శివరాంకు ప్రస్తుతం 13 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసు వారంతా పుస్తకాలతో కుస్తీ పడుతూనో, స్నేహితులతో ఆటలాడుకుంటూనో ఉంటారు. కానీ, మన శివరాం మాత్రం అందరిలా కాకుండా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకుంటూ అబ్బురపరుస్తున్నాడు.

ఒకటీ రెండూ కాదు..
శివరాంకు చిన్నతనం నుంచే రోబో బొమ్మలంటే చాలా ఇష్టమట. వాటితో ఆడుకోవడం సంగతి అటుంచితే.. అసలు అలాంటి బొమ్మలు ఎలా పనిచేస్తున్నాయా అని ఎక్కువగా ఆలోచించేవాడట. ఆ వివరాలను కంప్యూటర్‌లో వెతికేవాడు. అలా క్రమక్రమంగా ప్రోగ్రామింగ్‌పైన ఆసక్తి ఏర్పడింది. ఈ నేస్తం ఇష్టాన్ని గమనించిన కుటుంబ సభ్యులూ ఎంతో ప్రోత్సహించారు. దాంతో నాలుగో తరగతిలో ఉండగానే కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ నేర్చుకోవడం ప్రారంభించాడీ బాలుడు. ఇప్పటివరకూ 17 ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌పైన పట్టు సాధించాడట. అలాగని అవేవో అల్లాటప్పావని అనుకోకండి ఫ్రెండ్స్‌.. పెద్ద వాళ్లకే కొరుకుడు పడని జావా, పైథాన్‌లాంటి వాటిని మన శివరాం చాలావరకు నేర్చుసుకున్నాడు.

లక్ష్యాలూ ఉన్నతమే..
లాంగ్వేజెస్‌ అన్నీ పైపైనే చదివేయడం కాకుండా వాటిల్లో సర్టిఫికేషన్‌ కూడా చేస్తున్నాడీ నేస్తం. అంటే, తాను నేర్చుకున్న అంశాలతో ప్రోగ్రామింగ్‌ చేస్తూ.. వాటిని రియల్‌ టైంలో వినియోగిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతున్నాడు. భవిష్యత్తులో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ సాయంతో తక్కువ ఖర్చుతో ఆటో పైలట్‌ విధానాన్ని అభివృద్ధి చేయడం ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని చెబుతున్నాడు శివరాం. ఈ వయసులోనే ఇంత ప్రతిభ చూపుతున్న ఈ నేస్తం.. రాబోయే రోజుల్లో మరిన్ని ఘనతలు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుదామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని