వేడికీ కరగని ఐస్‌..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పుల్ల ఐస్‌ పేరు వింటేనే మనకు నోరూరిపోతుంటుంది. ఎక్కడ కరిగిపోతుందోనని పోటీ పడి మరీ గబగబా తినేస్తుంటాం. కానీ.. ఏదైనా, ఎలాగైనా చేయగలిగిన చైనా వాళ్లు అంత

Updated : 13 Jul 2022 01:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పుల్ల ఐస్‌ పేరు వింటేనే మనకు నోరూరిపోతుంటుంది. ఎక్కడ కరిగిపోతుందోనని పోటీ పడి మరీ గబగబా తినేస్తుంటాం. కానీ.. ఏదైనా, ఎలాగైనా చేయగలిగిన చైనా వాళ్లు అంత త్వరగా కరిగిపోని పుల్ల ఐస్‌ని తయారు చేశారట. నిజమేనండీ.. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే, చకచకా ఇది చదివేయండి మరి.

సోషల్‌ మీడియాలో గతవారం ఓ వీడియో వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఓ వ్యక్తి హీటర్‌తో ఒక ఐస్‌ క్యాండీని వేడి చేయడం. ‘ఇందులో వింత ఏముంది అంటారా?’ - అతను అంత వేడి చేస్తున్నా, అది ఏమాత్రం కరగకపోవడం గమనార్హం. మొదట ఈ వీడియో నిజం కాదనుకున్నారు చాలామంది. కానీ, దాన్ని తయారు చేసిన కంపెనీ స్పందించాక, నిజమేనని నమ్మాల్సి వచ్చింది.

రకరకాల స్పందనలు
సాధారణంగా అయితే, ఐస్‌ను ఫ్రిజ్‌లోంచి బయటకు తీశాక.. అంటే గది ఉష్ణోగ్రత వద్ద నాలుగైదు నిమిషాల్లో కరగడం ప్రారంభమవుతుంది. కానీ, ‘హెర్మస్‌ ఆఫ్‌ ఐస్‌’గా పిలిచే ఈ ఇది మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉందట. కొందరు దీనిలో నిల్వ ఉండేందుకు వాడే ఓ రసాయనాన్ని పరిమితి కంటే ఎక్కువ మోతాదులో వాడారనీ, అది ఆరోగ్యకరం కాదనీ కామెంట్లు చేశారు. దాంతో తయారీ సంస్థ ప్రతినిధులు వెంటనే ఓ వివరణ ఇచ్చారు. నిర్ణీత ప్రమాణాల ప్రకారమే ‘హెర్మస్‌ ఆఫ్‌ ఐస్‌’ని తయారు చేశామనీ, ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని స్పష్టం చేశారు. ఏదైనా పదార్థ నాణ్యతను కేవలం ఉడకబెట్టడం, ఎండబెట్టడం, వేడి చేయడం ద్వారా నిర్ణయించలేరని పేర్కొన్నారు. అమెరికా దేశ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు సైతం దీని తయారీలో వాడిన పదార్థాలు హానికరం కాదనీ, అన్నీ ప్రమాణాల మేరకే ఉన్నాయని నిర్ధారించారు. అయినా కూడా కొందరు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు.

ధర కూడా ఎక్కువే..
తొందరగా కరిగిపోని ఐస్‌ అంటే.. ఎక్కువసేపు తినొచ్చు అని సంబరపడిపోతున్నారేమో.. కానీ, దీని ధర వింటే దడ పుట్టాల్సిందే. మన కరెన్సీలో దాదాపు రూ.900 వరకూ పలుకుతున్న ఈ ‘హెర్మస్‌ ఆఫ్‌ ఐస్‌’ చైనాలోని ప్రముఖ నగరాల్లో అందుబాటులోకి వచ్చేసిందట. కాస్త డబ్బున్న వాళ్లు మాత్రం ధర అధికమైనా టేస్ట్‌ కోసం తింటున్నారు. త్వరగా అయిపోనీ, మోచేతి వరకూ కారే.. బాధలేని ఈ ఐస్‌ విశేషాలు చదువుతుంటే నోరూరుతోంది కదూ! అలాగనీ, మన దేశంలోకి రాగానే తినేద్దామని అనుకోకండి ఫ్రెండ్స్‌.. ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదంటేనే తిందాం మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని