మ్యూజిక్‌ మ్యూజియం

మనం ఏదైనా మ్యూజియానికి వెళ్లామనుకోండి.. మనల్ని ఏ వస్తువులనూ తాకనీయరు. కానీ ఈ మ్యూజియంలో మాత్రం వస్తువులను తాకమనే చెబుతారు. ఎందుకంటే వాటి నుంచి సంగీతం పుడుతుంది మరి.

Published : 26 Jul 2022 01:14 IST

మనం ఏదైనా మ్యూజియానికి వెళ్లామనుకోండి.. మనల్ని ఏ వస్తువులనూ తాకనీయరు. కానీ ఈ మ్యూజియంలో మాత్రం వస్తువులను తాకమనే చెబుతారు. ఎందుకంటే వాటి నుంచి సంగీతం పుడుతుంది మరి. ఈ వింత మ్యూజియం ఎక్కడో విదేశాల్లో కాదు, మన దేశంలోనే ఉంది. ఆ వివరాలు తెలుసుకుందామా మరి!

బెంగళూరులో ఉంది ఈ మ్యూజిక్‌ మ్యూజియం. మన దేశంలో  మొదటి సంగీత సంగ్రహణశాల ఇదే. దీని ప్రాంగణంలోనే సౌండ్‌ గార్డెన్‌ ఉంది. ఇదంటే మనలాంటి పిల్లలకు చాలా ఇష్టం. ఎందుకంటే... ఇక్కడ రాయి, స్టీల్‌, కర్ర వస్తువులతో తయారైన సంగీత సాధనాలుంటాయి. వాటిని తాకి, మీటి మనం సంగీతాన్ని సృష్టించవచ్చు.

ఒకటీ రెండు కాదు..

ఈ మ్యూజిక్‌ గార్డెన్‌లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదకొండు సంగీత సాధనాలున్నాయి. వాటిని మీటితే చాలు వీనుల విందైన శబ్దాలు లయబద్ధంగా వస్తాయి. గుండ్రంగా తొలిచిన ఓ రాయి ఉంటుంది. దీన్ని హమ్మింగ్‌ స్టోన్‌ అంటారు. అందులో తలపెట్టి మనం శబ్దం చేస్తే... అదో రాగంలా ప్రతిధ్వనిస్తుంది. మైక్‌ లేకుండానే... మైక్‌ నుంచి వచ్చిన శబ్దంలా ప్రతిధ్వనిస్తుంది. రెయిలింగ్‌ లాంటి నిర్మాణాన్ని తాకుతూ నడిస్తే చాలు.. సప్తస్వరాలు పలుకుతాయి! సుత్తిలాంటి పరికరంతో విచ్చుకున్న కమలం లాంటి ఆకృతిని నెమ్మదిగా కొడితే చాలు చక్కటి ధ్వని పుడుతుంది. బెంచీలాంటి నిర్మాణాన్ని మీటినా సంగీతమే వస్తుంది. ఇక్కడి గ్రానైట్‌ నిర్మాణాలూ సంగీతాన్ని పలుకుతాయి. చేతులను నీళ్లలో ముంచి వాటిని తాకితే చాలు... లయబద్ధంగా శబ్దాలు వస్తాయి. ఇలా ఇలాంటివి ఇక్కడ పదకొండు ఉన్నాయి.

లెక్కపెట్టలేనన్ని...

ఇక లోపల మ్యూజియంలో అయితే చాలా విలువైన సంగీత సాధనాలున్నాయి. గిటార్లు, వయొలిన్లు, హార్మోనియం పెట్టెలు, సన్నాయిలు, పిల్లనగ్రోవులు ఇలా చెప్పలేనన్ని, లెక్కపెట్టలేనన్ని సంగీత సాధనాలున్నాయి. డిజిటల్‌ రూపంలోనూ విలువైన వారసత్వ సంపద ఈ మ్యూజియంలో భద్రంగా ఉంది. టచ్‌స్క్రీన్లపై తాకి, చెవుల్లో హెడ్‌సెట్‌ పెట్టుకుని సంగీతాన్ని వింటూ సేదతీరొచ్చు. ఇక్కడ కొన్ని గేమింగ్‌ పరికరాలూ ఉన్నాయి. కాకపోతే అవీ సంగీతానికి సంబంధించినవే. అందుకే ఈ మ్యూజియం అంటే మనలాంటి పిల్లలకు చాలా ఇష్టమట. ఫెండ్స్‌... మొత్తానికి ఇవీ మ్యూజిక్‌ మ్యూజియం విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని