బుల్లి కుక్క.. బుజ్జి కుక్క!

‘బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట..’ అంటారు కదా.. ఇదేంటి? ‘బుల్లి కుక్క.. బుజ్జి కుక్క’ అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారు కదూ ఫ్రెండ్స్‌! మీకు అసలు విషయం తెలిస్తే.. మీరూ ఇలాగే అంటారేమో!

Published : 29 Jul 2022 00:27 IST

‘బుల్లి పిట్ట.. బుజ్జి పిట్ట..’ అంటారు కదా.. ఇదేంటి? ‘బుల్లి కుక్క.. బుజ్జి కుక్క’ అంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారు కదూ ఫ్రెండ్స్‌! మీకు అసలు విషయం తెలిస్తే.. మీరూ ఇలాగే అంటారేమో!

అదో కుక్క.. లాబ్రడార్‌ జాతికి చెందినది. దాని పేరు ర్యాంబో. వయసు కేవలం రెండు నెలలే. అంటే అక్షరాలా అరవై రోజులు. కానీ అప్పుడే అది నవీ ముంబయి పోలీసుల డాగ్‌స్క్వాడ్‌లో భాగం అవనుంది. బాంబులను పసిగట్టడంలో శిక్షణ తీసుకోనుంది.

ఏసీ గది.. ప్రత్యేక వసతి..
ఈ బుజ్జి కుక్క ప్రస్తుతం సకల భోగాలు అనుభవిస్తోంది. దానికి ప్రత్యేకంగా ఏసీ గదిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేకంగా ఆహారాన్ని అందిస్తున్నారు. అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. అది కూడా చక్కగా.. చకచకా అన్నీ నేర్చేసుకుంటోంది.

మరో రెండింటితో కలిసి..
ప్రస్తుతం నవీ ముంబయి పోలీసుల బాంబ్‌స్క్వాడ్‌లో రెండు జాగిలాలు ఉన్నాయి. అందులో ఒకదాని పేరు జాక్‌, మరోదాని పేరు జింబా. జాక్‌కు అయిదు సంవత్సరాలు. జింబాకు రెండు సంవత్సరాలు. ఇంతకు ముందు బ్రూనో అనే మరో కుక్క ఉండేది. కానీ అది ఇటీవలే మరణించింది. దాని స్థానంలోనే ఇప్పుడు ర్యాంబోను తీసుకున్నారు.

నచ్చిందిలే...
నవీ ముంబయి పోలీసులకు మన ర్యాంబో అన్ని విధాలుగా నచ్చింది. అందుకే ఇటీవలే దాన్ని 27,500 రూపాయలకు కొని మరీ శిక్షణకు ఎంపిక చేశారు. మన దేశంలో ఇలాంటి శిక్షణ కేంద్రాలు పుణె, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఉన్నాయి. ర్యాంబోకు మాత్రం పుణెలో శిక్షణ ఇవ్వనున్నారట. మరి మనం బుజ్జి ర్యాంబోకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెబుదామా ఫ్రెండ్స్‌!


సోషల్‌ మీడియాలో..

అసలు మన ర్యాంబో విషయం బయటి ప్రపంచానికి ఎలా తెలిసిందంటే... నవీ ముంబయి పోలీస్‌ కమిషనర్‌ ఈ ర్యాంబోతో తాను ఉన్న ఫొటో, వివరాలను క్లుప్తంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతే వెంటనే కొన్ని వందల లైకులు, కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు ర్యాంబో బుజ్జి సెలబ్రిటీ అయిపోయింది. నిజానికి ఆరునెలల వయసు నిండితేనే కానీ జాగిలాలను బాంబ్‌స్క్వాడ్‌లోకి తీసుకోరు. అలాగే కొన్ని ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని