స్టేడియంలోకి దూసుకొచ్చే రైలు!

అదో ఫుట్‌బాల్‌ స్టేడియం. రెండు జట్ల మధ్య రసవత్తరంగా మ్యాచ్‌ జరుగుతోంది. క్రీడాభిమానులంతా స్టాండ్స్‌లో కూర్చొని, కళ్లప్పగించి మరీ పోటీని చూస్తున్నారు. ఇంతలో కూ.. చుక్‌ చుక్‌ అంటూ ఓ పొగ రైలు ఆ స్టేడియం వైపు దూసుకొచ్చింది. అయినా, అక్కడి వారెవరూ భయపడలేదు. ఆడేవాళ్లు ఆడతున్నారు.

Published : 18 Aug 2022 01:21 IST

అదో ఫుట్‌బాల్‌ స్టేడియం. రెండు జట్ల మధ్య రసవత్తరంగా మ్యాచ్‌ జరుగుతోంది. క్రీడాభిమానులంతా స్టాండ్స్‌లో కూర్చొని, కళ్లప్పగించి మరీ పోటీని చూస్తున్నారు. ఇంతలో కూ.. చుక్‌ చుక్‌ అంటూ ఓ పొగ రైలు ఆ స్టేడియం వైపు దూసుకొచ్చింది. అయినా, అక్కడి వారెవరూ భయపడలేదు. ఆడేవాళ్లు ఆడతున్నారు.. చూసేవాళ్లు చూస్తున్నారు.. రైలు కూడా అలాగే ముందుకెళ్లిపోయింది. ‘అంతా గందరగోళంగా ఉందా?’.. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి మరి!

ఐరోపా దేశమైన స్లొవేకియాలో సిర్నీ బాలోగ్‌ అనే పట్టణం ఒకటి ఉంది. అక్కడ దాదాపు అయిదు వేల మంది నివసిస్తున్నారు. ఆ పట్టణానికి ఇప్పుడు పర్యాటకులు వరస కడుతున్నారట. ఎందుకంటే, అక్కడి ఫుట్‌బాల్‌ స్టేడియం లోపల ఉన్న ట్రాక్‌ మీద నుంచి రైళ్లు రాకపోకలు సాగించడమే.

నాలుగు దశాబ్దాల క్రితం..

దాదాపు 1980ల్లో సిర్నీ బాలోగ్‌ పట్టణంలో ఓ ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మించారు. ఆ ప్రదేశంలో పాడుబడిన రైల్వే ట్రాక్‌ ఉన్నా.. అధికారులు దాన్ని కలుపుకొంటూనే స్టేడియాన్ని కట్టేశారు. ఆ ట్రాక్‌ వాడుకలో లేకపోవడంతో మొదట ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అలా పదేళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1990ల్లో దేశంలోని రైల్వే ట్రాకులకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. అలా 1992లో ఫుట్‌బాల్‌ స్టేడియంలోని ట్రాక్‌నూ పునరుద్ధరించారు. అంతేకాకుండా.. దాన్నో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయానికొచ్చారు.

ప్రత్యేక ఆకర్షణగా..

స్లొవేకియాకు వేసవిలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. 17 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గంలో ఎత్తైన పర్వతాలూ, చారిత్రక ప్రదేశాల మీదుగా సాగుతుందా ప్రయాణం. ఇందులో స్టేడియం లోపలి నుంచి వెళ్లడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుందట. ఆట స్థలం, స్టాండ్స్‌ మధ్యలో ఉన్న ట్రాక్‌ మీదకు రైలు వచ్చినా.. దాన్నో అంతరాయంలా భావించకుండా.. ఆటగాళ్లూ, ప్రేక్షకులూ ఎవరి పనిలో వారు మునిగిపోతారట. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ ట్రాక్‌ను మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో నిర్మించారట. దాని ద్వారా కలప, ఆహారం తదితర సామగ్రిని తరలించేవారు. మ్యాచ్‌ సాగుతుండగా.. రైలు వస్తున్న వీడియోలను ఇటీవల కొందరు సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లతో స్పందిస్తూ.. ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఇటువంటి స్టేడియం మరెక్కడా లేదనీ చెబుతున్నారు. నిజంగా ఇదో వింతలా, భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని