పాముకు కాళ్లొచ్చాయి!

హాయ్‌ పిల్లలూ.. ‘పాము నడవడం ఎప్పుడైనా చూశారా?’ - ‘అదేంటి.. పాము పాకుతుంది కానీ నడుస్తుందా ఎక్కడైనా?’ అని అనుకుంటున్నారు కదూ! అది వాస్తవమే కానీ, ఓ పాము మాత్రం నిజంగానే కాళ్లతో నడుస్తోంది.

Published : 20 Aug 2022 00:44 IST

హాయ్‌ పిల్లలూ.. ‘పాము నడవడం ఎప్పుడైనా చూశారా?’ - ‘అదేంటి.. పాము పాకుతుంది కానీ నడుస్తుందా ఎక్కడైనా?’ అని అనుకుంటున్నారు కదూ! అది వాస్తవమే కానీ, ఓ పాము మాత్రం నిజంగానే కాళ్లతో నడుస్తోంది. పామేంటి? కాళ్లేంటి? నడవడం ఏంటి?.. అంతా గందరగోళంగా ఉందా.. అయితే, ఇది చదివేయండి మరి..

లెన్‌ పాన్‌ అనే యువకుడు ఓ యూట్యూబర్‌. ఎప్పుడూ ఏదో ఒక సరికొత్త ప్రయోగం చేస్తూ.. ఆ వీడియోలను తన యూట్యూబ్‌ ఛానల్‌లో పెడుతుంటాడు. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో తెలియదు కానీ అతడి ఆవిష్కరణలు మాత్రం చాలా వినూత్నంగా ఉంటాయి. ఎంతలా అంటే.. ‘అరె.. ఇలా కూడా చేయొచ్చా?’ అని అందరూ అనుకునేంతలా! అయితే, ఇటీవల అతడికి ఓ వింత ఆలోచన వచ్చింది. అదేంటంటే.. మనుషులు, జంతువుల మాదిరి పాములకు కూడా కాళ్లు ఉంటే ఎలా ఉంటుందీ అని. ఆ ఆలోచనలోంచే ఓ పరికరాన్ని సృష్టించాడా యువకుడు.

బొమ్మతో ప్రయోగం..
అలెన్‌ పాన్‌కు ముందునుంచీ మూగజీవులంటే ప్రాణం. ఇప్పటికే వివిధ ప్రమాదాల్లో గాయపడిన కొన్ని పక్షులకు కృత్రిమ కాళ్లు అమర్చాడు కూడా. ఒకరోజు పాములకు కూడా కాళ్లు ఉంటే ఎలా ఉంటుందోనని అనుకున్నాడు. వెంటనే, తన మెదడుకు పదును పెట్టి.. ఓ పొడవైన ప్లాస్టిక్‌ ట్యూబ్‌కు నాలుగు రోబోటిక్‌ కాళ్లు అమర్చాడు. ఈ పరికరం మొత్తాన్ని సాంకేతికత సాయంతో ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేశాడు. అంటే.. మనం కూర్చున్న దగ్గరి నుంచే ఆ కాళ్లను ఎటు కావాలంటే అటు కదిలించొచ్చన్నమాట. మొదట ఓ కొండచిలువ బొమ్మతో ఈ పరికరం పనితీరును పరిశీలించాడు. చిన్న చిన్న లోపాలంటే సరిదిద్దాడు.

నిజమైన పాముతో..
తరవాత పాములు పట్టే వ్యక్తి నుంచి ఓ పెద్ద పామును తీసుకొచ్చాడు పాన్‌. దానికి ఎటువంటి హానీ తలపెట్టనని హామీ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి సాయంతో పామును పరికరానికున్న ట్యూబ్‌లోకి పంపించాడతను. దాని శరీర కదలికల ఆధారంగా రోబో కాళ్లు కూడా కొంచెం కొంచెంగా ముందుకు నడవసాగాయి. మనం కూడా ల్యాప్‌టాప్‌లో దాని నడకను నియంత్రించవచ్చు. ఈ పరికరం సాయంతో కుక్కలు, పిల్లుల మాదిరి పాములను కూడా వాకింగ్‌కు తీసుకెళ్లొచ్చని చెబుతున్నాడా యూట్యూబర్‌. దీనికి సంబంధించిన వీడియోను గత వారం సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల కొద్దీ వ్యూస్‌తోపాటు లైకులూ వచ్చిపడుతున్నాయట. నెటిజన్లు ఆశ్చర్యపోవడంతోపాటు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. తన ఆవిష్కరణను మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు పాన్‌. శరీరం ఆధారంగానే రయ్యిన దూసుకెళ్లే పాములు.. కృత్రిమ కాళ్లతో నడుస్తుంటే ఆశ్చర్యంతోపాటు భయం కూడా వేస్తుంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని