భలే.. భలే... నలుసంత కంప్యూటర్‌!

అదో కంప్యూటర్‌... అలా అని సాదాసీదాది కాదు. ప్రపంచంలోకెల్లా అతి చిన్నది. ఉప్పు పలుకు కన్నా చిన్నది! పరీక్షగా చూస్తే కానీ అది మన కంటికి కనిపించదు. మరి ఈ నానో కంప్యూటర్‌

Published : 21 Aug 2022 01:04 IST

అదో కంప్యూటర్‌... అలా అని సాదాసీదాది కాదు. ప్రపంచంలోకెల్లా అతి చిన్నది. ఉప్పు పలుకు కన్నా చిన్నది! పరీక్షగా చూస్తే కానీ అది మన కంటికి కనిపించదు. మరి ఈ నానో కంప్యూటర్‌ విశేషాలేంటో తెలుసుకుందామా!

నేస్తాలూ..! మీకు కంప్యూటర్‌ అంటే ఇష్టమే కదూ! హాయిగా వీడియో గేమ్స్‌ ఆడుకోవచ్చు. సినిమాలూ చూడొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు మనకు కంప్యూటర్‌ దొరికితే ఎంచక్కా కాలక్షేపమూ చేయొచ్చు. మరి అలాంటి కంప్యూటర్‌ నలుసంత ఉంటే... ఆశ్చర్యమే కదూ! ఐబీఎమ్‌ కంపెనీ ఆ పనే చేసింది. ప్రపంచంలోకెల్లా అతిచిన్న కంప్యూటర్‌ను తయారు చేసింది. 2018 నుంచి ఆ రికార్డు దీని మీదే ఉంది.

చాలా చౌక..
ఇంతకు ముందు ఈ రికార్డు మిచిగాన్‌ మైక్రో మోట్‌ పేరు మీద ఉండేది. ఇది 2015లో తయారైంది. అది 2 మిల్లీమీటర్ల పొడవు, వెడల్పు ఉండేది. ఐబీఎమ్‌ వాళ్లు తయారు చేసిన బుజ్జి కంప్యూటర్‌ మాత్రం కేవలం 1 మిల్లీ మీటరు పొడవు, వెడల్పు ఉంది. ఈ బుల్లి కంప్యూటర్‌ తయారీకి కేవలం ఏడు రూపాయలు మాత్రమే ఖర్చైంది. ఈ బుజ్జి కంప్యూటర్‌ను భవిష్యత్తు అవసరాల కోసం ఐబీఎమ్‌ తయారు చేసిందట.

వేగంలో కాస్త వెనకే!
ఈ నానో కంప్యూటర్‌ 1990లో వచ్చిన కంప్యూటర్ల అంత వేగంగా మాత్రమే పనిచేయగలదు. అంటే ఇప్పుడున్న స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లతో పెద్దగా పోటీ పడలేదన్నమాట. కానీ ఇంత చిన్న పరిమాణంలో ఉన్న కంప్యూటర్‌కు ఆ వేగం చాలా ఎక్కువే అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. దీని మీద మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. మొత్తానికి ఇవీ నేస్తాలూ.. నలుసంత కంప్యూటర్‌ సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని