నాట్య మయూరి.. ఈ చిన్నారి!

తను గజ్జె కట్టి ఆడితే...  చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. తాను నర్తిస్తుంటే.. బుజ్జి నెమలే పురివిప్పి నాట్యం చేస్తుందా అన్నట్లుంటుంది! ఇలా చిరుప్రాయంలోనే కూచిపూడి నృత్యాలతో అలరిస్తూ..

Updated : 08 Sep 2022 01:05 IST

తను గజ్జె కట్టి ఆడితే...  చూడ్డానికి రెండు కళ్లూ చాలవు.. తాను నర్తిస్తుంటే.. బుజ్జి నెమలే పురివిప్పి నాట్యం చేస్తుందా అన్నట్లుంటుంది! ఇలా చిరుప్రాయంలోనే కూచిపూడి నృత్యాలతో అలరిస్తూ.. బహుమతులు సొంతం చేసుకుంటోంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇంకెందుకాలస్యం... చకచకా ఈ కథనం చదివేయండి మరి.

ఆ చిన్నారి నాట్యమయూరి ఎవరో కాదు.. ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన మోర్ల సస్మిత శ్రీ. వయసు 13 ఏళ్లు. కైకలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో 8వ తరగతి చదువుతోంది. తల్లి జయలక్ష్మి గృహిణి, తండ్రి రాము బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆర్థికంగా బలం లేకున్నా తల్లి సంకల్ప బలమే చిన్నారిని నాట్యం నేర్చుకునేందుకు ప్రేరేపించింది. దీంతో 5వ ఏట నుంచే కైకలూరు నాట్యరవళి అకాడమీలో చేర్చారు. గురువు పసుమర్తి శ్రీవల్లి దగ్గర నాట్యంలో ఓనమాలు దిద్దుకుని అనతి కాలంలోనే తన అభిరుచితో నాట్యంలో నైపుణ్యం సంపాదించింది.

అవార్డుల పర్వం
సస్మిత శ్రీ 2019లో ఏలూరు నృత్యభారతి వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి ‘నర్తన బాల- 2019’ అవార్డు సాధించింది. 2020లో శ్రీ నటరాజ నృత్య కళా మందిర్‌ వారు ఆన్‌లైన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నాట్య పోటీల్లో సోలో డ్యాన్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. 2018లో విశ్వకళా యజ్ఞంలో భాగంగా 108 రోజుల పాటు నిరవధికంగా బృంద కళా ప్రదర్శన చేసినందుకు ‘కల్చరల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, భారత్‌ వరల్డ్‌ రికార్డ్‌’లలో స్థానం సాధించి, అందరి మన్ననలు పొందింది. 2018లో జరిగిన నృత్యప్రదర్శనా యాగంలో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచి, నాట్యకళా రవళి పురస్కారం సాధించింది. 2018లో నేషనల్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌ అకాడమీ వారు నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో బెస్ట్‌ టాలెంటెడ్‌ డ్యాన్సర్‌ అవార్డు వరించింది. 2019లో కల్చరల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఫెడరేషన్‌ వారు నిర్వహించిన నేషనల్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ ఛాంపియన్‌లో విజేతగా నిలిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వంద వరకూ ప్రదర్శనలు చేసి ప్రశంసలు అందుకుంది.

ఉన్నత ఆశయంతో సాధన..
కేవలం నాట్య సాధన, పోటీలే కాకుండా.. చదువునూ సమన్వయం చేసుకుంటోంది. ఉదయం 5 గంటలకే మేల్కొని సాధన చేస్తోంది. మళ్లీ సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య నాట్య శిక్షణకు వెళుతోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి కూచిపూడికి ప్రాధాన్యం కల్పించాలనే ఆశయంతో సాధన చేస్తోంది.

- ఉప్పాల రాజాపృథ్వీ, ఈనాడు డిజిటల్‌, ఏలూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని