గాల్లో తేలినట్టుందే.. నీటిపైన నడిచినట్టుందే..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీలో ఎవరైనా నీటి మీద నడవగలరా?’ - ‘అదేంటి.. నీటిలో ఈదుతూ తేలుతాం కానీ, ఎలా నడుస్తాం?’.. అని మీ ఎదురుప్రశ్న కదా! నీటిపైన నడవడం మనకు సాధ్యం

Published : 10 Sep 2022 00:18 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మీలో ఎవరైనా నీటి మీద నడవగలరా?’ - ‘అదేంటి.. నీటిలో ఈదుతూ తేలుతాం కానీ, ఎలా నడుస్తాం?’.. అని మీ ఎదురుప్రశ్న కదా! నీటిపైన నడవడం మనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఓ రకం పక్షులకు మాత్రం అది వెన్నతో పెట్టిన విద్య. నిజమే నేస్తాలూ.. ఆ పక్షుల గురించి తెలుసుకోవాలంటే, గబగబా ఈ కథనం చదివేయండి మరి..

ఈ భూమిపైన మనకు తెలియని ప్రాణులు అనేకం ఉన్నాయి. అటువంటి వాటిలో గ్రీబ్స్‌ ఒకటి. సాధారణంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో అరుదుగా కనిపించే ఈ పక్షి జాతికి ఓ అరుదైన గుర్తింపు ఉంది. అందేంటంటే.. ఈ జాతిలో వెస్ట్రన్‌, క్లార్క్స్‌ అనే రకాలు నీటిపైన నడవగలిగిన, అతి బరువైన పక్షులట. దాదాపు 20 మీటర్ల వరకూ ఇవి నీటి మీద చకచకా ముందుకెళ్లగలవని శాస్త్రవేత్తలు తేల్చారు.

పెద్ద అడుగులు, వేగం..
కొన్ని రకాల సాలీళ్లు, మరికొన్ని జీవులు బరువు తక్కువగా ఉండటంతో కొంత సమయంపాటు నీటిపైన తేలగలవు. కానీ, వాటికి భిన్నంగా గ్రీబ్స్‌ పక్షులు బరువైన శరీరంతో నీటిపైన నడవడంతోపాటు పరుగులూ తీస్తాయట. ఇవి వాటి జీవిత కాలంలో కేజీ నుంచి రెండు కేజీల వరకూ బరువు పెరుగుతాయట. 2015లో అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడి, ఈ పక్షుల కదలికలను తమ కెమెరాల్లో రికార్డు చేశారట. వాటిని అన్ని కోణాల నుంచి పరిశీలించాక.. గ్రీబ్స్‌ పక్షుల పాదాలు చాలా విశాలంగా ఉండటంతోపాటు పెద్ద పెద్ద అడుగులు వేస్తాయని గుర్తించారు. పాదాలను వేగంగా కదిలించడంతో వాటి బరువును నియంత్రించుకోవడమే కాకుండా ఆ ఒత్తిడితో వేగంగా ముందుకు కదులుతుంటాయట. దాదాపు ఏడు సెకన్లపాటు ఈ పక్షులు నీటి ఉపరితలంపైన పరుగెత్తగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి ఎంత వేగంగా అడుగులు వేస్తాయంటే.. ఒక్క సెకను వ్యవధిలో దాదాపు 20 అడుగులు వేస్తాయట. నిజంగా వాటి ప్రత్యేకతతోపాటు చూడటానికి కూడా ఈ గ్రీబ్స్‌ పక్షులు భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని