పేద పిల్లలకూ బడి బస్సు!

హలో ఫ్రెండ్స్‌.. ప్రైవేటు స్కూల్‌ పిల్లల కోసం రోజూ బస్సులో, ఆటోలో, వ్యాన్లో వస్తుంటాయి. వాళ్లు ఎంచక్కా.. ఇంటి ముందే ఆయా వాహనాల్లో ఎక్కేసి.. బడికి వెళ్లి వస్తుంటారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పరిస్థితి ఉండదు. వాటిలో చదివే

Published : 17 Sep 2022 00:17 IST

హలో ఫ్రెండ్స్‌.. ప్రైవేటు స్కూల్‌ పిల్లల కోసం రోజూ బస్సులో, ఆటోలో, వ్యాన్లో వస్తుంటాయి. వాళ్లు ఎంచక్కా.. ఇంటి ముందే ఆయా వాహనాల్లో ఎక్కేసి.. బడికి వెళ్లి వస్తుంటారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పరిస్థితి ఉండదు. వాటిలో చదివే విద్యార్థులకూ అంత స్తోమత ఉండదు. ఎక్కువమంది నడుచుకుంటూనో, సైకిళ్ల మీదనో రోజూ బడికి వెళ్తుంటారు. ఓ ప్రభుత్వ బడి విద్యార్థులకు మాత్రం ఇకనుంచి ఆ ఇబ్బంది లేదు. అదెలాగో ఇది చదివి తెలుసుకోండి మరి..

ర్ణాటక రాష్ట్రంలో మిత్తూరు అనే గ్రామం ఉంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో 120 మంది చదువుకుంటున్నారు. ఆ విద్యార్థుల కోసం ఇటీవలే ఒక బస్సును కొనుగోలు చేశారు. దీని వెనక ఉపాధ్యాయులు, గ్రామస్థుల కృషి ఉంది. కొత్తగా బస్సు అందుబాటులోకి రావడంతో ప్రైవేటు కంటే మేమేమన్నా తక్కువా అన్నట్లు.. ఆ బడి పిల్లలంతా ఎంచక్కా.. అందులో ఎక్కేసి తరగతులకు హాజరవుతున్నారు.  

అయిదేళ్ల క్రితం ఆలోచన  

మిత్తూరు ప్రభుత్వ పాఠశాలకు ఆనుకొనే నాలుగెకరాల స్థలం ఉంది. అది బడికి చెందినదే కావడంతో.. అయిదేళ్ల క్రితం అంటే 2017లో పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆ స్థలంలో పోక వక్కల మొక్కలు నాటాలని నిర్ణయించారు. వెంటనే, సమీపంలోని పట్టణం నుంచి దాదాపు 628 పోక మొక్కలను కొనుగోలు చేసి.. బడి పక్కనున్న స్థలంలో నాటారు. రెండేళ్ల క్రితం ఆ తోట పర్యవేక్షణ బాధ్యతను ఓ గుత్తేదారుకు అప్పగించారు. అంతేకాదు.. పాఠశాలకు సదరు గుత్తేదారు ఏడాదికి రూ.2.5 లక్షలు చెల్లించేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

రెండేళ్ల ఆదాయంతో..

గతేడాదితోపాటు ఈ సంవత్సరం తోట నుంచి వచ్చిన ఆదాయం రూ.5 లక్షలతో.. ఇటీవలే ఓ బస్సును కొనుగోలు చేశారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొన్న ఈ బస్సులో మొత్తం 26 సీట్లు ఉన్నాయట. ఇంతకీ అక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్థులకు ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే.. ప్రతి రోజూ కొందరు విద్యార్థులు ఆలస్యంగా తరగతులకు హాజరవుతుండటం, ఇంకొందరు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వస్తుండటంతో.. స్కూల్‌కే ప్రత్యేకంగా బస్సు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. వారి ఆలోచనను పోక వక్కల తోట రూపంలో ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆ బస్సును స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభించారు. అంతేకాదు.. ఆ స్కూల్‌కి మరో అదనపు తరగతి గది నిర్మాణానికి కూడా ఆయన హామీనిచ్చారట. ఇంకో విషయం ఏంటంటే.. ఆ బస్సుకు అవసరమైన డీజిల్‌ ఖర్చును భరించేందుకు గ్రామస్థులే ముందుకొచ్చారు. కొత్తగా బస్సు రావడంతో పిల్లల్లోనూ స్కూల్‌కి వెళ్లాలనే ఆసక్తి మరింత పెరిగిందట. సర్కారు బడికి బస్సు అంటేనే.. ఆశ్చర్యంగా ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు