పులి కాని పులి!

హాయ్‌ నేస్తాలూ!... ‘పులి కాని పులి ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! నిజానికి అది తోడేలు జాతికి చెందిన జీవి. కానీ ఇప్పుడు అది మన మధ్య లేదు. ఎప్పుడో అంతరించిపోయింది. మరి

Updated : 19 Sep 2022 04:37 IST

హాయ్‌ నేస్తాలూ!... ‘పులి కాని పులి ఏంటబ్బా?’ అని ఆలోచిస్తున్నారు కదూ! నిజానికి అది తోడేలు జాతికి చెందిన జీవి. కానీ ఇప్పుడు అది మన మధ్య లేదు. ఎప్పుడో అంతరించిపోయింది. మరి ఆ వివరాలేంటో.. తెలుసుకుందామా..! అయితే ఈ కథనం చదివేయండి మరి.

మన భారతదేశంలో దాదాపు 70 సంవత్సరాల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. కొన్నిరోజుల క్రితమే నమీబియా నుంచి ఓ ఎనిమిదింటిని తీసుకొచ్చి కునో నేషనల్‌ పార్కులో వదిలారు. ఈ విషయం మీకు తెలుసు కదా నేస్తాలు. డైనోసార్ల నుంచి మొదలుకొని చాలా జీవుల వరకు ఎన్నో ఏళ్ల క్రితమే ఈ భూమి మీద నుంచి అంతర్థానమయ్యాయి. ‘టాస్మానియాన్‌ టైగర్‌’ అనే ఓ మాంసాహార జీవి కూడా అంతరించిపోయింది. దీన్ని ‘టాస్మానియన్‌ వూల్ఫ్‌’ అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది పులి కాదు, తోడేలు కూడా కాదు. తోడేలు జాతి జీవి మాత్రమే.

చారల వల్ల..
దీని అసలు పేరు థైలాసిస్‌. ఈ జీవి వెనక భాగంలో పెద్దపులిలా చారలు ఉండటం వల్లే దీన్ని టాస్మానియన్‌ టైగర్‌ అని పిలిచేవారు. ఈ జీవి 1936 సంవత్సరంలో అంతరించిపోయింది. టాస్మానియాలోని హోబర్ట్‌ జూలో ఈ ప్రపంచంలోనే చిట్టచివరి టాస్మానియన్‌ టైగర్‌ చనిపోయింది. దీంతో ఈ భూమి మీద ఈ జాతి అంతరించిపోయినట్లైంది.

వేటలో అదుర్స్‌...
టాస్మానియన్‌ టైగర్లు చక్కగా వేటాడేవి. కంగారూలు, గొర్రెలు, మేకల్ని ఇష్టంగా తినేవి. ఇవి తమ నోటిని 90 డిగ్రీల కోణం వరకు తెరవగలిగేవి. ఎక్కువ సమయం ఇవి నిశ్శబ్దంగానే ఉండేవి. కానీ వేటాడేటప్పుడే కాస్త కుక్కలా శబ్దాలు చేసేవి.

చూడ్డానికి కుక్కల్లా...
ఈ టాస్మానియన్‌ టైగర్లు చూడడానికి కాస్త కుక్కల్లా ఉండేవి. నోరు మాత్రం చాలా పొడవుగా, దంతాలు భయంకరంగా ఉండేవి. శరీరం కూడా పొడవుగా ఉండేది. ఇవి 15 నుంచి 30 కిలోల వరకు బరువు పెరిగేవి. తోక కూడా పొడవుగా ఉండేది.

ప్రయత్నించారు కానీ...
క్లోనింగ్‌ ప్రక్రియ ద్వారా ప్రయోగశాలలో కృత్రిమంగా టాస్మానియన్‌ టైగర్‌కు ప్రాణం పోయాలని పలువురు పరిశోధకులు 1999 నుంచి ప్రయత్నించారు. దీని కోసం వారు వందేళ్ల క్రితం భద్రపరిచిన ఆడ టాస్మానియన్‌ టైగర్‌ టిష్యూ శాంపిల్స్‌ను వాడారు. కానీ డీఎన్‌ఏ నాణ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రయోగం సాధ్యం కాదని 2005లో తేల్చేశారు. దీంతో టాస్మానియన్‌ టైగర్లు శాశ్వతంగా అంతరించిపోయిన జీవుల జాబితాలో చేరాయి. ‘ఇప్పటికీ ఇవి బతికే ఉన్నాయి.. అంతరించిపోలేదు’ అని వాదించేవారూ ఉన్నారు. కానీ వీరి వాదనలకు బలం చేకూర్చే ఆధారాలు లేవు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ టాస్మానియన్‌ టైగర్‌ విశేషాలు.


చీతాల్లానే ప్రమాదకరం కాదు...

మన దేశంలో అంతరించిపోయి.. ఇటీవలే నమీబియా నుంచి మన దగ్గరకు తిరిగి అడుగుపెట్టిన చీతాల్లానే ఈ టాస్మానియన్‌ టైగర్లు కూడా మనుషులకు అంత ప్రమాదకరం కాదు. నిజానికి వీటికి చాలా సిగ్గు. మనుషులు కనిపిస్తే చాలు దూరంగా వెళ్లిపోయేవి. మరో విషయం ఏంటంటే... మనదేశంలో చీతాలు అంతరించిపోవడానికి మానవులు ఎలా అయితే కారణం అయ్యారో.. అలాగే ప్రపంచం నుంచి ఈ టాస్మానియా టైగర్లు కూడా మనుషులు వేటాటడం వల్లే కనుమరుగైపోయాయి. అలాగే డింగో జాతి కుక్కలు కూడా వీటికి శత్రువులా మారి, వీటి సంతతిని వృద్ధి చెందకుండా చేశాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని