చీతా.. కేరాఫ్‌ కునో!

హాయ్‌ ఫ్రెండ్స్‌... నమీబియా నుంచి మన దేశానికి ఎనిమిది చిరుతలు వచ్చాయన్న సంగతి తెలుసు కదా...! ఇప్పుడు వాటికి కునో నేషనల్‌ పార్క్‌లో ఆశ్రయం కల్పించారు. ఇంతకీ ఈ కునో జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది? దాని విశేషాలేంటో మీకు

Published : 20 Sep 2022 00:11 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... నమీబియా నుంచి మన దేశానికి ఎనిమిది చిరుతలు వచ్చాయన్న సంగతి తెలుసు కదా...! ఇప్పుడు వాటికి కునో నేషనల్‌ పార్క్‌లో ఆశ్రయం కల్పించారు. ఇంతకీ ఈ కునో జాతీయ ఉద్యానవనం ఎక్కడుంది? దాని విశేషాలేంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వెంటనే ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది సరేనా!

కునో నేషనల్‌ పార్క్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉంది. దీన్ని 1981లో వైల్డ్‌ లైఫ్‌ శాంక్చువరీగా ఏర్పాటు చేశారు. 2018లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఇది దాదాపు 344 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

కొన్ని సంవత్సరాల క్రితమే...

ఒకవేళ చీతాలను తీసుకొస్తే.. వాటికి ఈ కునో నేషనల్‌ పార్క్‌లో ఆశ్రయం కల్పించాలని కొన్ని సంవత్సరాల క్రితమే సంకల్పించారు. దానికి అనుగుణంగానే ఈ సెప్టెంబర్‌ 17న అయిదు ఆడ చీతాలు, మూడు మగ చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలారు.

మృగరాజును కాదని...

ఈ కునో నేషనల్‌ పార్క్‌లో ఇప్పుడైతే చీతాలు ఆశ్రయం పొందాయి కానీ.. నిజానికి ఇక్కడికి గిర్‌ అభయారణ్యం నుంచి సింహాలను తరలించాల్సి ఉండేది. కానీ చీతా ప్రాజెక్ట్‌ వల్ల సింహాల తరలింపు పట్టాలెక్కకుండా ఆగిపోయింది. ఇక ఇప్పుడప్పుడే ఇక్కడ సింహాలు అడుగు పెట్టలేవు. చీతాల సంరక్షణ బాధ్యతలే దీనికి కారణం. 

ఏమేం ఉన్నాయంటే...

ఈ కునో నేషనల్‌ పార్కులో చిరుతపులులు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, హైనాలు, జింకలు, దుప్పులు, అడవి పందులు, అడవి ఆవులు, ఎద్దులూ, హనీబ్యాడ్జర్లు, ముంగిసలూ, ముళ్లపందులూ, మొసళ్లూ, తాబేళ్లూ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇంకా 129 రకాల పక్షి జాతులూ ఆశ్రయం పొందుతున్నాయి. తాజాగా వీటి జాబితాలోకి ఆఫ్రికన్‌ చిరుతలూ వచ్చి చేరాయి. ప్రస్తుతానికి ఇవి క్వారంటైన్‌లో ఉన్నాయి. అంటే చిరుతల పరుగులు చూడాలంటే సందర్శకులు ఇంకా కొంతకాలం ఎదురుచూడక తప్పదన్నమాట. నేస్తాలూ మొత్తానికి ఇవీ కునో నేషనల్‌ పార్క్‌ సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని