బాబోయ్‌.. ఇది మామూలు పక్షి కాదు!

హలో ఫ్రెండ్స్‌.. మీరు ఇప్పటివరకూ చాలా పక్షులను చూసుంటారు. వాటి గురించిన బోలెడు విశేషాలను చదువుకొనే ఉంటారు. కానీ, ‘రక్తం తాగే పక్షి’ గురించి ఎప్పుడైనా విన్నారా? - ‘పక్షి ఏంటి.. రక్తం తాగడం ఏంటి?’ అని నోరెళ్లబెట్టారు కదూ! అయినా, మీరు చదివింది నిజంగా నిజమే.

Updated : 27 Sep 2022 04:11 IST

హలో ఫ్రెండ్స్‌.. మీరు ఇప్పటివరకూ చాలా పక్షులను చూసుంటారు. వాటి గురించిన బోలెడు విశేషాలను చదువుకొనే ఉంటారు. కానీ, ‘రక్తం తాగే పక్షి’ గురించి ఎప్పుడైనా విన్నారా? - ‘పక్షి ఏంటి.. రక్తం తాగడం ఏంటి?’ అని నోరెళ్లబెట్టారు కదూ! అయినా, మీరు చదివింది నిజంగా నిజమే. ఆ పక్షి ఏంటో, దాని వివరాలేంటో తెలుసుకోండి మరి..

క్షులు సాధారణంగా పండ్లనో, పురుగులనో తింటుంటాయి. గద్దలు, రాబందులు మినహా మన దగ్గర ఎక్కువగా కనిపించే కాకులు, కోళ్లలాంటివి వృథాగా పడేసే ఆహార పదార్థాలతో కడుపు నింపుకొంటాయి. కానీ, ‘వాంపైర్‌ ఫించ్‌’ అనే పక్షి మాత్రం వాటన్నింటికీ భిన్నంగా రక్తాన్ని ఆహారంగా పీల్చేస్తోంది. అలాగని, ఈ పక్షులు మన దగ్గర లేవులేండి. గలపాగోస్‌, డార్విన్‌ అండ్‌ వూల్ఫ్‌ - అనే రెండు దీవుల్లో మాత్రమే ఈ పక్షులు కనిపిస్తుంటాయి.

పక్షి జాతికే భిన్నంగా..
‘వాంపైర్‌ ఫించ్‌’ స్వభావం, ఆహార అలవాట్లు.. పక్షి జాతికే పూర్తి భిన్నంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూసేందుకు చాలా చిన్నగా, పదునైన బుజ్జి ముక్కుతో కనిపించే ఈ పక్షులు.. ప్రవర్తనలో మాత్రం చాలా క్రూరంగా కనిపిస్తాయట. ఈ జాతిలో మగ పక్షులు నల్లగా ఉంటే ఆడవి మాత్రం గోధుమ రంగు కలిగి, చర్మంపై ముదురు గీతలు ఉంటాయట. అన్ని పక్షుల్లాగే ఫించ్‌లు కూడా విత్తనాలు, చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. అవి దొరకని సమయంలో ఆకలిని తీర్చుకునేందుకు ఇతర పక్షుల చర్మానికి రంధ్రం చేసి మరీ.. వాటి రక్తం తాగుతాయట. అలాగని చనిపోయిన పక్షులని అనుకోకండి ఫ్రెండ్స్‌.. బతికున్న పక్షుల రక్తాన్నే. అయితే, ఇవి కేవలం సముద్రాల ఒడ్డున జీవించే నజాకా, బ్లూ ఫుటెడ్‌ అనే రెండు రకాల పక్షుల రక్తాన్ని మాత్రమే పీలుస్తాయట.

కారణం మాత్రం తెలియదు
అయితే, అసలు ఈ పక్షులు రక్తాన్ని ఎందుకు తాగుతాయో సరైన కారణాన్ని మాత్రం ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్ని పక్షులు వాటికంటే చిన్నవాటి రెక్కలు, చర్మం పీక్కొని తినడం చూశాం కానీ ఇలా బతికున్న పక్షుల వెనకాల నెమ్మదిగా వాలి.. అవి చూస్తుండగానే రక్తం వచ్చేలా గాయపరిచే వాటిని ఇంతవరకూ చూడలేదని ఫించ్‌ల మీద పరిశోధనలు చేసిన కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. పింఛ్‌లు తమ రక్తాన్ని పీల్చేస్తుంటే, ఆ పక్షులు కనీసం ప్రతిఘటించవట. అంతేకాదు.. ఇవి ఇతర పక్షుల గుడ్లను కూడా కాళ్లతోనో, ముక్కుతోనో పగలగొట్టి.. వాటి కడుపు నింపుకొంటాయట. ఇవండీ.. ‘వాంపైర్‌ ఫించ్‌’ పక్షుల విశేషాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని