నదిని ఈదేశాడు.. రికార్డు పట్టేశాడు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి చాలామంది పిల్లలకు నీళ్లు చూస్తే మహా సరదా. మరికొందరేమో బోలెడంత భయంతో దూరం దూరంగా వెళ్లిపోతుంటారు. వేసవి సెలవుల్లో చాలామంది ఈత

Published : 30 Sep 2022 00:06 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి చాలామంది పిల్లలకు నీళ్లు చూస్తే మహా సరదా. మరికొందరేమో బోలెడంత భయంతో దూరం దూరంగా వెళ్లిపోతుంటారు. వేసవి సెలవుల్లో చాలామంది ఈత నేర్చుకునేందుకు వెళ్తుంటారు. అందరిలాగే, ఈత కొలనుకు వెళ్లిన ఓ నేస్తం.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకీ అతడెవరో, ఏం సాధించాడో తెలుసుకుందాం రండి..

తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన స్నేహన్‌కు 14 సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ నేస్తం ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ మధ్యనున్న నార్త్‌ ఛానల్‌ని ఈదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

చిన్నతనం నుంచే ఆసక్తి
చాలామంది పిల్లల్లాగానే స్నేహన్‌కి కూడా నీళ్లన్నా, అందులో ఈత కొట్టడమన్నా చిన్నప్పటి నుంచి చాలా సరదా. ఆ సరదానే క్రమంగా ఇష్టంగా మారింది. అలా ఈత కొట్టడంలో పట్టు సాధించాడు. అయిదేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో స్నేహన్‌కి కోచ్‌ విజయ్‌కుమార్‌ పరిచయం అయ్యారు. ఇక అక్కడి నుంచి ఈ నేస్తం పోటీలకు వెళ్లడం ప్రారంభించాడు. ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు సాధించాడు కూడా.

సాధనతోనే సులువు..
అత్యంత చల్లగా ఉండే నార్త్‌ ఛానల్‌ను ఈదడం అంటే మాటలు కాదు. అక్కడి వాతావరణం మహామహులను సైతం గజగజా వణికిస్తుంది. అందుకే, మన స్నేహన్‌ అందుకు తగినట్లుగా ముందే సన్నద్ధమయ్యాడని అతడి కోచ్‌ చెబుతున్నారు. ఈనెల 20న ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ మధ్యలో 35 కిలోమీటర్ల మేర ఉండే నార్త్‌ ఛానల్‌ని ఆరుగురు సభ్యుల జట్టు సునాయాసంగా ఈదేసింది. ఈ ఘనత సాధించేందుకు వారికి 14 గంటల 39 నిమిషాలు పట్టిందట. ఆ ఆరుగురు సభ్యుల్లో మన స్నేహన్‌ కూడా ఒకడు. అందరిలోకెల్లా అతి చిన్నవాడు కూడా ఇతడే. నార్త్‌ ఛానల్‌ని ఈదాలంటే అతి శీతల పరిస్థితులను తట్టుకోగలగాలి. అందుకే, ఇక్కడి నుంచి బయలుదేరే ముందే ఈ నేస్తంతో చల్లటి ప్రాంతమైన కొడైకెనాల్‌లో కోచ్‌ సాధన చేయించారు. ఆ తరవాత, అరుణాచల్‌ప్రదేశ్‌లో కొన్నాళ్లు మెలకువలు నేర్పించారు.

బుల్లి షార్కులు, జెల్లీ ఫిష్‌లు..
ఐర్లాండ్‌ వెళ్లాక.. దాదాపు 20 రోజుల పాటు అక్కడి వాతావరణానికి అలవాటుపడ్డాడు స్నేహన్‌. అంతా సిద్ధమయ్యాక.. ఉదయం ఆరున్నరకు ఈదడం ప్రారంభిస్తే.. రాత్రి తొమ్మిదింటికి గమ్యం చేరుకున్నారట. అలాగని ఇదేదో అల్లాటప్పాగా అయిపోయిందని అనుకోకండి ఫ్రెండ్స్‌.. ఆ నదిలో ఉండే జెల్లీఫిష్‌లు, చిన్న చిన్న షార్కులను తప్పించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్లు జరగడంతో.. ఇప్పటివరకూ నార్త్‌ ఛానల్‌ను ఈదిన చిన్న వయస్కుడిగా మన స్నేహన్‌ ఘనత దక్కించుకున్నాడు. ఈ రికార్డుతో అతడి తల్లిదండ్రులతోపాటు కోచ్‌ ఉబ్బితబ్బిబ్బవు తున్నారట. లక్ష్యసాధన కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలనీ, కష్టపడే వారెప్పుడూ విఫలం కారని చెబుతున్నాడీ బాలుడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని