ఔరా.. సౌరాదిత్య!

విక్రమాదిత్య తెలుసు... ఆదిత్య 369 తెలుసు.. ఈ సౌరాదిత్య ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారు కదూ!ఇది ఓ ఫెర్రీ. అలా అని మామూలు ఫెర్రీ కాదు.

Published : 03 Nov 2022 00:09 IST

విక్రమాదిత్య తెలుసు... ఆదిత్య 369 తెలుసు.. ఈ సౌరాదిత్య ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారు కదూ!ఇది ఓ ఫెర్రీ. అలా అని మామూలు ఫెర్రీ కాదు. సౌరశక్తితో నడిచే ఫెర్రీ. భారతదేశంలో ఇదే మొట్టమొదటి సోలార్‌ ఫెర్రీ. మరి దీని విశేషాలేంటో తెలుసుకుందామా నేస్తాలూ!

మామూలుగా ఫెర్రీల్లో ప్రయాణిస్తుంటే... పెద్దగా మోటారు శబ్దం, పొగ వస్తుంది. కానీ ఈ ఆదిత్యలో ప్రయాణిస్తుంటే అలాంటివేమీ ఉండవు. ఎందుకంటే ఇది సోలార్‌ ఫెర్రీ కాబట్టి. ఇది ప్రస్తుతం కేరళ జలాల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి కోచికి చెందిన సందిత్‌ తండ్‌చెరీ అనే ఆర్కిటెక్ట్‌ ప్రాణం పోశాడు. నవాల్ట్‌ సోలార్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ బోట్స్‌ అనే కంపెనీ వారు ఈ బోట్‌ను తయారు చేశారు.

పరిష్కార మంత్రం...

కేరళలో ప్యాసింజర్‌ బోట్లకు చాలా ప్రాధాన్యం ఉంది. కానీ, డీజిల్‌తో నడిచే బోట్ల వల్ల పర్యావరణానికి చాలా నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా వాయు, శబ్ద, జల కాలుష్యం జరుగుతోంది. బోట్‌ నడుస్తున్నప్పుడు ప్రకంపనలు కూడా ఎక్కువ వస్తాయి. అలాగే పెరుగుతున్న ఇందన ధరలు కూడా పెద్ద సమస్యే. వీటన్నింటికీ పరిష్కారమే ఆదిత్య!

నష్టమూ తప్పింది!

కేరళ రాష్ట్ర జల రవాణా విభాగం వారికి ఓ సాధారణ బోటును నడపాలంటే డీజిల్‌ కోసం దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే ప్యాసింజర్ల ద్వారా కేవలం అయిదువేల రూపాయల లాభమే వస్తోంది. అంటే కేరళ రాష్ట్ర జల రవాణా విభాగం వాళ్లకు రోజూ నష్టమే. ఆ నష్టాన్ని కూడా ఈ ఆదిత్య దూరం చేసింది.

సూర్యుడి నుంచి...

ఆదిత్య ఫెర్రీ పైన సౌర ఫలకాలుంటాయి. ఇవి సూర్యుడి వెలుతురుతో శక్తిని తయారు చేసి ఫెర్రీ మోటారుకు అందిస్తుంది. అప్పుడు మోటారు తిరిగి ఫెర్రీని ముందుకు కదిలేలా చేస్తుంది. అదనపు శక్తి బ్యాటరీల్లోనూ సేవ్‌ అవుతుంది. ఇది రాత్రిపూట, సూర్యరశ్మి తక్కువగా ఉన్నప్పుడు ఫెర్రీ కదిలేందుకు సాయపడుతుంది. కేరళలో డీజిల్‌ ఫెర్రీల వల్ల ఏటా దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అలాగే సుమారు 9.2 కోట్ల కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ గాల్లోకి విడుదలవుతుంది. ఈ పర్యావరణ విపత్తుకు సౌరాదిత్య ఫెర్రీ చక్కని పరిష్కారం చూపిస్తోంది.

రీ ఛార్జబుల్‌ కూడా...!

సూర్యుడు రాకపోతే మరి ఈ ఫెర్రీ ఎలా నడుస్తుందబ్బా.. అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది కదూ! అప్పుడు దీనికి కరెంట్‌తో ఛార్జింగ్‌ పెట్టేయడమే. అంటే అచ్చం ఎలక్ట్రిక్‌ కారులా అన్నమాట. రానున్న రోజుల్లో కేరళలో మరిన్ని సోలార్‌ ఫెర్రీలు రానున్నాయి. అప్పుడు పర్యావరణానికి మరింత మేలు కలుగుతుంది. మొత్తానికి ఆదిత్య సంగతులు భలే ఉన్నాయి కదూ!


బాహుబలి!

ఆదిత్య 20 మీటర్ల పొడవు, 7 మీటర్ల వెడల్పు ఉంటుంది. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణం మేర సౌరఫలకాలు అమర్చి ఉన్నాయి. ఇవి 20 కిలోవాట్ల మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫెర్రీకి 50 కిలోవాట్ల సామర్థ్యమున్న లిథియం అయాన్‌ బ్యాటరీలున్నాయి. వీటి బరువే కొన్ని వందల కిలోల వరకు ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని