కూర్చుంటే కుందేలు..! నిల్చుంటే జింక!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా చూస్తున్నారు. కాస్త జింకలా.. ఇంకాస్త కుందేలులా ఉన్నాను కదూ...! కానీ నేను నిజానికి కుందేలునూ కాదు.

Updated : 21 Nov 2022 00:33 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఏంటి అలా చూస్తున్నారు. కాస్త జింకలా.. ఇంకాస్త కుందేలులా ఉన్నాను కదూ...! కానీ నేను నిజానికి కుందేలునూ కాదు. జింకను అంతకన్నా కాదు. ఇంతకీ నేను ఎవరినో తెలుసా.. నేనో ఎలుకను. ఏంటి.. అవాక్కయ్యారా? ఈ కథనం చదవండి మీకే తెలుస్తుంది అసలు విషయం.

నా పేరు పటగోనియన్‌ మారా. నన్ను పటగోనియన్‌ కేవీ, పటగోనియన్‌ కుందేలు, డిల్లాబీ అని కూడా పిలుస్తారు. నేను శాకాహార జీవిని. నేను ఎక్కువగా అర్జెంటీనాలోని పటగోనియాలో కనిపిస్తుంటాను. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడా మావాళ్లు కొంతమంది జీవిస్తున్నారట.

చిన్ని తోక.. పెద్ద కాళ్లు...

నాకు పెద్ద చెవులు, కాళ్లు, చాలా చిన్ని తోక ఉంటుంది. అందుకే నాకు తోకున్నట్లు మీకు కనిపించదు. నా కాళ్లు మిగతా కుందేళ్లతో పోల్చుకుంటే చాలా పెద్దగా ఉండటం వల్ల నేను నిల్చున్నప్పుడు ఓ చిన్న జింకపిల్లలా కనిపిస్తా. కానీ నేను జింకను కాదు. అందుకే నాకు కొమ్ములు ఉండవు. కూర్చున్నప్పుడు కుందేలులా కనిపిస్తాను అయినా నేను చెవులపిల్లిని కాదు. నిజానికి నేను ఎలుకజాతి జీవిని.

నా పొడవు.. నా బరువు...

నేను 69 నుంచి 75 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. తోకేమో కేవలం 4 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దాదాపు 8 నుంచి 16 కిలోల వరకు బరువు తూగుతాను. రోజులో దాదాపు 46శాతం సమయాన్ని నేను తినడం కోసమే కేటాయిస్తాను. మాలో మగవాటికన్నా ఆడవే కాస్త ఎక్కువ సమయాన్ని తినడం కోసం కేటాయిస్తాయి. మేం గడ్డి, చెట్ల ఆకులు, పండ్లను ఆహారంగా తీసుకుంటాం.

శత్రువులు ఎక్కువే!

మాకు పెద్ద పులులు, చిరుతపులులు, సింహాలు, తోడేళ్లు, అడవి పిల్లులు, నక్కలు, అడవికుక్కలు, ముంగిసలు ప్రధాన శత్రువులు. మమ్మల్ని ఎక్కువగా ఇవి వేటాడి తినేస్తాయి. అందుకే మాలో మగవి కాపలాగా ఉంటాయి. దూరం నుంచే వాటి ఉనికిని గుర్తించి మాలో ఆడవాటిని, పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. మేం మా శత్రువుల బారి నుంచి కాపాడుకునే క్రమంలో గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పరిగెడతాం. మేం సాధారణంగా 14 సంవత్సరాల వరకు బతుకుతాం. చాలా వరకు అడవుల్లోనే జీవిస్తాం. పెంపుడు జంతువుల్లానూ మమ్మల్ని కొంతమంది పెంచుకుంటారు. మరో విషయం ఏంటంటే... మేము చాలా నిశ్శబ్దంగా ఉంటాం. పెద్దగా శబ్దాలు చేయం. అంటే అరుపులు, కేకలు పెట్టమన్నమాట. చాలా బుద్ధిగా ఉంటాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా గురించిన విశేషాలు. సరే ఇక ఉంటామరి బై. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని