బండి కాదు.. మొండి ఇది.!

హలో ఫ్రెండ్స్‌.. మనందరికీ కూ.. చుక్‌ చుక్‌ రైళ్ల గురించి తెలుసు కదా! వాటిలోనూ ఎక్కువ దూరం ప్రయాణించేవి, వేగంగా దూసుకెళ్లేవంటూ రకరకాల రికార్డులు ఉంటాయి

Updated : 17 Dec 2022 00:54 IST

హలో ఫ్రెండ్స్‌.. మనందరికీ కూ.. చుక్‌ చుక్‌ రైళ్ల గురించి తెలుసు కదా! వాటిలోనూ ఎక్కువ దూరం ప్రయాణించేవి, వేగంగా దూసుకెళ్లేవంటూ రకరకాల రికార్డులు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటిదే. ఇంతకీ ఆ రైలేంటో, దాని ప్రత్యేకతలేంటో చదివేయండి మరి..

మనం ఏదైనా ప్రయాణంలో ఉంటే.. వేగంగా వెళ్లి, త్వరత్వరగా గమ్యం చేరాలని చూస్తుంటాం. కానీ, తమిళనాడు రాష్ట్రంలో రాకపోకలు సాగించే ‘మెట్టుపాలయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్‌’ ట్రైన్‌లో మాత్రం ఆ పప్పులేమీ ఉడకవు. ఎందుకంటే.. మన దేశంలోనే అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు ఇదే కాబట్టి. ఇంతకీ దీని వేగం ఎంతా అంటే.. గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే. భారత్‌లో అత్యంత వేగంగా నడిచే రైలుతో పోలిస్తే, ఇది 16 రెట్లు నెమ్మదిగా వెళ్తుందన్నమాట. అందుకే, ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం యునెస్కో కూడా ఈ రైలును ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.

కొండ ప్రాంతం కావడంతో..

అధికారిక సమాచారం ప్రకారం నీలగిరి పర్వత ప్రాంతంలో రైల్వే లైన్‌ నిర్మాణం కోసం 1854లో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ, అదంతా కొండ ప్రాంతం కావడంతో ఆ పనులేమీ పట్టాలెక్కలేదు. చివరకు 1891లో పనులు ప్రారంభమయ్యాయి. పద్దెనిమిదేళ్లపాటు కార్మికులు ఎంతో శ్రమించి.. ఎట్టకేలకు 1908లో ట్రాక్‌ నిర్మాణ పనులను పూర్తి చేశారు.

వందకు పైగా వంతెనలు..

రైల్వే శాఖ లెక్కల ప్రకారం.. ఈ రైలు ప్రయాణం పెద్ద పెద్ద లోయలు, కొండల మీదుగా సాగుతుంది. చుట్టూ పచ్చటి చెట్లు, తేయాకు తోటలు ప్రయాణికులకు ఆహ్లాదాన్నిస్తాయట. మెట్టుపాలయం నుంచి ఊటీ వరకూ.. అంటే 46 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో రైలు 100కుపైగా వంతెనలతోపాటు కొండలను తొలచి నిర్మించిన సొరంగాలను దాటుతుంది. ఇది ప్రతి రోజూ ఉదయం మెట్టుపాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఊటీ చేరుకుంటుంది. కొంత విరామం అనంతరం మళ్లీ బయలుదేరి సాయంత్రానికి మెట్టుపాలయం వస్తుంది. మొదట్లో మూడు బోగీలతోనే ప్రారంభమైన ఈ రైలుకు.. క్రమంగా డిమాండ్‌ పెరగడంతో ఆరేళ్ల క్రితం అదనంగా మరో బోగీని జతచేశారు. సెలవు రోజుల్లో ఈ మార్గంలో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుందట. నేస్తాలూ.. ఈ రైలు విశేషాలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని