స్తంభాలే.. పాఠాలు చెబుతున్నాయి!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. తరగతి గదుల్లో ఉండే బ్లాక్‌ బోర్డులపైన టీచర్లు చెప్పే పాఠాలను మనం ఎంతో శ్రద్ధగా వింటుంటాం కదా.

Updated : 13 Jan 2023 04:58 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. తరగతి గదుల్లో ఉండే బ్లాక్‌ బోర్డులపైన టీచర్లు చెప్పే పాఠాలను మనం ఎంతో శ్రద్ధగా వింటుంటాం కదా. మరి.. ‘కనీసం అంగన్‌వాడీ బడి కూడా లేని ప్రాంతాల్లోని పిల్లలకు పాఠాలెలా?’ - ఇదే సంఘటన ఓ టీచర్‌కు ఎదురైంది. ఆ సమస్యకు ఆయన చూపిన తాత్కాలిక పరిష్కారమేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి మరి..

లాక్‌డౌన్‌ సమయంలో సపన్‌ కుమార్‌ అనే టీచర్‌.. జార్ఖండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఉన్న ఇళ్ల గోడలనే బ్లాక్‌ బోర్డులుగా మార్చి పిల్లలకు చదువు చెప్పారనీ, మైక్‌సెట్ల సహాయంతోనూ తరగతులు బోధించారని గతంలో మనం చదువుకున్నాం కదా! ఇప్పుడు ఆ మాస్టారే మళ్లీ.. ఇంకో గ్రామాన్ని తరగతి గదిగా మార్చేశారు. కానీ, ఈసారి ఆ ఊరిలో ఉండే కాంక్రీటు కరెంటు స్తంభాల సాయం తీసుకున్నారు.

బడి లేకపోవడంతో..

జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే దుమర్తూర్‌ అనే గిరిజన పల్లెలో అంగన్‌వాడీ బడి కూడా లేదు. దాంతో ఆ గ్రామంలోని చిన్న పిల్లలంతా ప్రాథమిక చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయం అక్కడికి దగ్గరలోనే ఉండే ఓ హైస్కూల్‌లో పనిచేసే సపన్‌ కుమార్‌ మాస్టారి దృష్టికి వెళ్లింది. దాంతో పిల్లలకు ఎలాగైనా అక్షరాలు, అంకెలు నేర్పించాలని అనుకున్నారు. వెంటనే, ఆ ఊరిలోని దాదాపు 80 కాంక్రీటు కరెంటు స్తంభాలపైన హిందీ, ఇంగ్లిష్‌, స్థానిక భాషల్లో వంద వరకూ అంకెలతోపాటు అక్షరాలనూ రాయించారు. ప్రాథమిక పాఠశాలలో చేరకముందే అక్కడి పిల్లలకు కనీస పరిజ్ఞానం ఉండాలనే ఇదంతా చేయించారాయన.

ప్రభుత్వానికీ దరఖాస్తు..

కరెంటు స్తంభాల సాయంతో చదువు చెప్పే వినూత్న ఆలోచన పిల్లలతోపాటు ఆ ఊరి పెద్దలకూ నచ్చింది. దాంతో రాష్ట్రంలో అంగన్‌వాడీ బడులు లేని ప్రాంతాల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆ రాష్ట్ర విద్యాశాఖకు లేఖ కూడా రాశారీ మాస్టారు. పిల్లలు ఆడుకునే సమయంలో కూడా ఆ స్తంభాల మీది అంశాలను చదువుకునే వీలుంటుందనీ, దాంతో వారి జ్ఞాపకశక్తి కూడా పెంపొందుతుందని చెబుతున్నారాయన. కరెంటు స్తంభాలను విజ్ఞానం పెంపొందించే వస్తువులుగా వినియోగించడం చాలా సరికొత్తగా ఉందని స్థానిక ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతవరకూ బడిలో అడుగు పెట్టకుండానే, కేవలం స్తంభాల పైన రాసిన అంశాలను చూసి.. మూడేళ్ల మా బాబు దిల్జీత్‌కు అంకెలు, అక్షరాలు నోటికి వచ్చేశాయి’ అని ఆ ఊరికి చెందిన విష్ణు చెబుతున్నారు. ‘ఎక్కడా లేనటువంటి స్తంభాలపైన చదువు అనేది సరికొత్తగా అనిపిస్తోంది. గ్రామంలో ఏ వీధికి వెళ్లినా, ఆడుతూపాడుతూ విద్య నేర్చుకుంటున్నాం’ అని దిల్జీత్‌ ఆనందంగా చెబుతున్నాడు. నేస్తాలూ.. నిజంగా ఈ కొత్త ప్రయోగం భలే ఉంది కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని