పాప.. పక్షి.. దోస్తీ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది ‘జంగిల్‌బుక్‌’ సినిమా చూసే ఉంటారు కదూ!  అందులో ఒంటరి పిల్లవాడైన మోగ్లీతో ఆ అడవిలో ఉండే అనేక రకాల జంతువులు, పక్షులు ఏ విధంగా స్నేహం చేసేవో చూశాం కదా.. ఇప్పుడు అచ్చం అలాగే.. ఓ పక్షి కూడా పాపతో స్నేహం చేస్తోంది.

Published : 17 Mar 2023 00:09 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలో చాలామంది ‘జంగిల్‌బుక్‌’ సినిమా చూసే ఉంటారు కదూ!  అందులో ఒంటరి పిల్లవాడైన మోగ్లీతో ఆ అడవిలో ఉండే అనేక రకాల జంతువులు, పక్షులు ఏ విధంగా స్నేహం చేసేవో చూశాం కదా.. ఇప్పుడు అచ్చం అలాగే.. ఓ పక్షి కూడా పాపతో స్నేహం చేస్తోంది. పాఠశాలకెళ్లినా తనతోనే ఉంటోంది. ఆ వివరాలే ఇవీ..

శ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కాంక్సా అనే గ్రామం ఉంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో అంకిత అనే ఓ పాప ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా ఎక్కడి నుంచో వచ్చిన పక్షి.. అంకిత భుజం మీద వాలింది. ఇక అప్పటినుంచి వారిద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. ఆ బాలిక ఎక్కడికి వెళ్తే.. పక్షి కూడా వెంటే వెళ్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  

దాని పేరు ‘మిఠు’..

సాధారణంగా చిన్న అలికిడి వినిపించినా.. పక్షులు అక్కడి నుంచి తుర్రుమని ఎగిరిపోతాయి. కానీ, ఈ పక్షి మాత్రం అంకిత పాఠశాలకు వెళ్లినా తననే అనుసరిస్తోందట. బడి గంట మోగినా, పిల్లలు అల్లరి చేసినా ఏమాత్రం భయపడకుండా వారితోనే ఉంటోంది. విద్యార్థులంతా తరగతి గదిలో కూర్చున్నప్పుడు కూడా ఆ పక్షి పాప భుజం మీద, తలపైన వాలుతూ.. అందరితోపాటే నిశ్శబ్దంగా పాఠాలు వింటోంది. అంతేకాదు నేస్తాలూ.. ఈ పక్షికి సరదాగా ‘మిఠు’ అని పేరు పెట్టిందట మన అంకిత. భోజన విరామ సమయంలో తను ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్‌లోని పదార్థాలనే మిఠూకు కూడా పెడుతోంది. మిగతా విద్యార్థులు పెట్టే ఆహార పదార్థాలనూ ఇష్టంగా తింటోంది. ఎక్కడ తిరిగినా, ఏం చేసినా.. చివరకు అంకిత దగ్గరికే వస్తుండటం చూసి ఉపాధ్యాయులూ, సిబ్బంది అవాక్కవుతున్నారు.

బడి దగ్గరే గూడు..

పాఠశాల ముగిసిన తర్వాత.. ఆ ఆవరణలోనే ఓ చెట్టు మీద ఏర్పరుచుకున్న గూటికి మిఠు వెళ్లిపోతుందట. మరుసటి రోజు బడి ప్రారంభ సమయానికి అంకిత దగ్గరకు వెళ్తుందట. ఎప్పుడైనా ఆ పాప.. బడికి హాజరుకాకపోతే, తనను వెతుక్కుంటూ మిఠూనే వాళ్ల ఇంటికి వెళ్తుందట. ‘ఒక్కోసారి మిఠు రావడం ఆలస్యమైతే, నేను కూడా చాలా బాధపడతాను’ అని బాలిక చెబుతోంది. నేస్తాలూ.. నిజంగా పాప, పక్షి స్నేహం భలే ఆసక్తిగా ఉంది కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని