ది గ్రేట్‌.. తులిప్స్‌!

హాయ్‌ నేస్తాలూ.. పువ్వుల్లో ‘తులిప్స్‌’ది ప్రత్యేక స్థానం. తలలో పెట్టుకునేందుకు, పూజలకు ఉపయోగపడకపోయినా.. డెకరేషన్లలో మాత్రం ఇవి కచ్చితంగా ఉండాల్సిందే.

Published : 19 Mar 2023 00:37 IST

హాయ్‌ నేస్తాలూ.. పువ్వుల్లో ‘తులిప్స్‌’ది ప్రత్యేక స్థానం. తలలో పెట్టుకునేందుకు, పూజలకు ఉపయోగపడకపోయినా.. డెకరేషన్లలో మాత్రం ఇవి కచ్చితంగా ఉండాల్సిందే. అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే ఈ పూల మొక్కలు.. మన దేశంలో జమ్మూ కశ్మీర్‌లో మాత్రమే కనిపిస్తుంటాయి. శ్రీనగర్‌లోని ‘ఇందిరా గాంధీ తులిప్‌ గార్డెన్‌’ సందర్శనకు నేటి నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఈ సందర్భంగా ఆ ఉద్యానవనం, తులిప్‌ పుష్పాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వివరాలివీ..

* శ్రీనగర్‌లోని ‘ఇందిరాగాంధీ తులిప్‌ గార్డెన్‌’ ఆసియాలోనే అతి పెద్దది. ప్రపంచ ప్రసిద్ధ దాల్‌ సరస్సు తీరాన.. దాదాపు 75 ఎకరాల్లో ఈ గార్డెన్‌ విస్తరించి ఉంది.

* ఇక్కడ 68 రకాలకు చెందిన మొత్తం 16 లక్షల మొక్కలు ఉన్నాయి. అవి వివిధ రంగుల్లో సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ గార్డెన్‌ నిర్వహణకు దాదాపు 100 మంది సిబ్బంది పనిచేస్తుంటారు.

* ఏటా రెండు లక్షల మంది ఈ గార్డెన్‌ను సందర్శిస్తుంటారు. 2020లో రికార్డు స్థాయిలో 3.60 లక్షల మంది పర్యాటకులు వచ్చారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్‌ గార్డెన్‌ నెదర్లాండ్స్‌లో ఉంది. ఈ దేశంలో ఏటా దాదాపు 300 కోట్లకు పైగా ఈ పువ్వులను సాగు చేస్తుంటారు.

* తులిప్‌ అంటే లాటిన్‌ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్స్‌లో దాదాపు 150 జాతులూ, మళ్లీ వాటిలో 3000 రకాలూ ఉన్నాయి.

* తులిప్స్‌లో చాలా వరకూ ఒక మొక్కకు ఒక పువ్వు మాత్రమే పూస్తుంది. కొన్ని రకాల్లో మాత్రం నాలుగు పూస్తాయి. అవన్నీ దాదాపు ఒకే రకమైన ఆకృతితో ఉంటాయి.

* ఈ పూలు వసంత కాలంలో మూడు వారాల నుంచి అయిదు వారాలపాటు మాత్రమే విరబూస్తుంటాయి.

* తులిప్స్‌లో ప్రతి రంగుకూ ఒక అర్థం ఉంటుంది. ఎరుపు రంగు పూలు స్వచ్ఛమైన ప్రేమకు, ఊదా రంగువి విధేయతకు చిహ్నంగా చెబుతుంటారు.

* ఎవరినైనా క్షమాపణ అడగాలనుకున్నప్పుడు, వారికి తెలుపు రంగు పువ్వులను ఇస్తుంటారు.

* వాస్తవానికి ఈ తులిప్‌ పుష్పాలు మధ్య ఆసియాకు చెందినవి. కానీ, ఇవి నెదర్లాండ్స్‌కు చేరిన తర్వాతే.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి.

* పార్కిన్‌సన్‌ వ్యాధి నివారణకు కృషి చేసే ఓ ఫౌండేషన్‌, తమ సంస్థ చిహ్నంగా తులిప్‌ పుష్పాలనే ఎంచుకొంది.

* తులిప్‌ పుష్పాలు చాలా ఖరీదైనవి. 1600 సంవత్సరంలో నెదర్లాండ్స్‌లో ఒక ఉద్యోగి సగటు జీతం కంటే ఈ పువ్వుల ధరే పది రెట్లు ఎక్కువట.

* ఈ తులిప్‌ పువ్వుల రేకులను తినొచ్చట. ఇప్పటికీ కొన్ని వంటకాల్లో ఉల్లిపాయలకు బదులుగా తులిప్‌ రెబ్బలనే వాడుతుంటారు.

* తులిప్‌ పుష్పాలు కాంతి పడే దిశగా పెరుగుతుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని