భలే... భలే... బిలింబి!

దొండ కాయలా కనిపిస్తాను.. కానీ దొండను కాదు. ద్రాక్షలా గుత్తులు గుత్తులుగా కాస్తాను.. కానీ ద్రాక్షనూ కాదు. వేపకాయల్లా కూడా అగుపిస్తాను.

Published : 26 Mar 2023 00:14 IST

దొండ కాయలా కనిపిస్తాను.. కానీ దొండను కాదు. ద్రాక్షలా గుత్తులు గుత్తులుగా కాస్తాను.. కానీ ద్రాక్షనూ కాదు. వేపకాయల్లా కూడా అగుపిస్తాను. కానీ.. కానేకాదు. రుచిలో ఉసిరిలా ఉంటాను... ఊహూఁ... ఉసిరినీ కాను.. మరి ఇంతకీ నేనెవర్ని?! మీకు తెలుసుకోవాలని తెగ ఆసక్తిగా ఉంది కదూ! ఆ సంగతులు మీతో చెప్పిపోదామనే ఇదిగో ఇలా వచ్చాను.

నా పేరు బిలింబి. నేనో పండును. ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, మాల్దీవుల్లో పెరుగుతాను. మీకు అంతగా తెలిసి ఉండదు కానీ నేను మీ భారతదేశంలోనూ అక్కడక్కడా కనిపిస్తాను. ముఖ్యంగా కేరళలో నన్ను ఎక్కువగా సాగు చేస్తున్నారు. నిజానికి బిలింబి అనేది నా హిందీ పేరు. మీ తెలుగులో కూడా నాకో పేరుంది తెలుసా...! నన్ను గుమ్మరేగు అని పిలుస్తారు.

ఊరించే ఉసిరిలా...

స్టార్‌ ఫ్రూట్‌ రకానికి చెందిన నేను, రుచిలో మాత్రం ఉసిరిలా ఉంటాను. నా చెట్టు కూడా చిన్నగా ఉంటుంది. 10 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. కాండానికే నేను కాయల్లా కాస్తాను. అంతకంటే ముందు ఎరుపురంగు పువ్వులు పూస్తాయి. అవే కాయలుగా, పండ్లుగా మారతాయి. కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పండ్లేమో లేత పసుపు రంగులోకి మారతాయి.

నాలో.. నీరే నీరు!

నోరూరించే నాలో నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విత్తనాలుంటాయి. రుచిలో కాస్త ఉసిరిలా ఉన్నా.... నేను చాలా పుల్లగా ఉంటాను. నన్ను నేరుగా తినేయొచ్చు. కొంతమంది పచ్చళ్లు కూడా పెట్టుకుంటారు. కేరళలో అయితే నన్ను ఉప్పు, కారం వేసి ఎండలో ఎండబెట్టి పొడి చేసుకుని కూడా కూరల్లో వాడుకుంటారు. అప్పుడు నేను అచ్చం పచ్చిమామిడి ఫ్లేవర్‌ను ఇస్తానన్నమాట.

ఫలం కొంచెం... ఫలితం ఘనం!

చాలా చిన్న ఫలాన్నే అయినప్పటికీ నాతో మాత్రం మీకు బోలెడు లాభాలున్నాయి. నాలో చాలా ఔషధ గుణాలున్నాయి. నేను రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాను. హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తాను. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాను. చెడు కొవ్వును కూడా తగ్గిస్తాను. మీ ఎముకల బలానికి కూడా సాయపడతాను. నాలో విటమిన్‌- సి,  విటమిన్‌- ఎ కూడా ఉంటుంది. నేస్తాలూ మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని