హస్వి.. రికార్డుల తపస్వి!

అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోందో నేస్తం. చదువుతోపాటు అథ్లెటిక్స్‌, స్కేటింగ్‌, బ్యాడ్మింటన్‌, సైక్లింగ్‌, పర్వతారోహణలో సత్తా చాటుతోంది.

Published : 02 Apr 2023 00:24 IST

అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తోందో నేస్తం. చదువుతోపాటు అథ్లెటిక్స్‌, స్కేటింగ్‌, బ్యాడ్మింటన్‌, సైక్లింగ్‌, పర్వతారోహణలో సత్తా చాటుతోంది. చిన్న వయసులోనే ఇన్ని అంశాల్లో రాణిస్తున్న తనెవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!

మంచిర్యాలకు చెందిన హస్వికి పద్నాలుగు సంవత్సరాలు. తల్లిదండ్రులు మాధవి-వెంకట్‌. హస్వి ప్రస్తుతం హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతోంది. తను మూడో తరగతిలో ఉన్నప్పుడే ఆటలపై మక్కువ పెంచుకుంది. స్కూల్‌కి వెళ్తూనే.. స్కేటింగ్‌, సైక్లింగ్‌లో శిక్షణ తీసుకుంది. ప్రతిరోజూ ప్రాక్టీస్‌ కూడా చేసేది. అలా స్కేటింగ్‌లో జాతీయ స్థాయికి చేరగా, అండర్‌-13, అండర్‌-15 బ్యాడ్మింటన్‌ పోటీల్లో సత్తా చాటింది. ‘రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌’ కార్యక్రమంలో భాగంగా హాఫ్‌ మారథన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. స్థానికంగా నిర్వహించే వేడుకల్లోనూ తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ట్రెక్కింగ్‌తో మొదలై..

చిన్న చిన్న పిల్లలు పర్వతాలు, కొండలను సునాయాసంగా అధిరోహించడం చూసి, తాను కూడా అందులో శిక్షణ తీసుకోవాలని అనుకుంది. తన ఆలోచనను తల్లిదండ్రులకు చెప్పడంతో వారూ సరేనన్నారు. అలా మొదటగా ట్రెక్కింగ్‌ చేయడం అలవాటు చేసుకుంది. అలా సాధన చేశాక.. 2021 నుంచి స్థానికంగా ఉండే పర్వతాలు ఎక్కడం మొదలుపెట్టింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ధైర్యంగా ముందుకెళ్లింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే 2021లో 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్టు బేస్‌క్యాంప్‌ను అధిరోహించింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఆఫ్రికాలోనే అతిపెద్దదైన.. 5,895 మీటర్ల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అలవోకగా ఎక్కేసింది. అదే ఏడాది చివరిలో హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు పర్వతాలను ఎముకలు కొరికే చలిలోనే విజయవంతంగా అధిరోహించింది. 2022లో లేహ్‌లో కొద్దిరోజులు అతి కఠినమైన శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే లద్దాఖ్‌లోని రెండు పర్వతాలను అతి తక్కువ సమయంలో అధిరోహించి.. ‘ఇండియా బుక్‌ ఆప్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది. గత ఆగస్టు 15న ఐరోపాలోని అత్యంత ఎత్తైన ఎల్‌బ్రస్‌ను అవలీలగా అధిరోహించింది హస్వి. సముద్రమట్టానికి 5642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరంపైన జాతీయ పతాకాన్ని ఎగరేసింది. 45 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, - 20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, వాతావరణ ప్రతికూలతల మధ్య విజయవంతంగా తన యాత్రను పూర్తి చేసిందీ నేస్తం.

ప్రముఖుల నుంచి ప్రశంసలు

పిన్న వయసులోనే ప్రపంచంలోనే పేరున్న పర్వత శిఖరాలను అధిరోహించడంతోపాటు బ్యాడ్మింటన్‌, సైక్లింగ్‌, స్కేటింగ్‌లో ప్రతిభ చూపుతున్న హస్వి.. పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు కూడా అందుకుంది. తెలంగాణ గవర్నర్‌ తమిళి సై, హిమాచల్‌ప్రదేశ్‌ అప్పటి గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నుంచి సత్కారం పొందింది. అంతేకాదు.. ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘యూత్‌ కార్నివాల్‌’ పేరిట నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి పురస్కారం అందుకుందీ నేస్తం.

కుందారపు సతీష్‌, న్యూస్‌టుడే, మంచిర్యాల సిటీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని