ఈ రాయి... నిజంగా ఓ వింతేనోయి!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా?! ‘మేం బాగున్నాం కానీ... ఈ రాయి ఏంటి.. ఆ వింతేంటబ్బా...?’ అని ఆలోచిస్తున్నారు కదా! అయితే ఇక ఆలస్యం ఎందుకు.. ఎంచక్కా ఈ కథనం చదివేయండి.

Published : 05 Apr 2023 00:14 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా?! ‘మేం బాగున్నాం కానీ... ఈ రాయి ఏంటి.. ఆ వింతేంటబ్బా...?’ అని ఆలోచిస్తున్నారు కదా! అయితే ఇక ఆలస్యం ఎందుకు.. ఎంచక్కా ఈ కథనం చదివేయండి. విషయం ఏంటో.. వింత ఏమిటో... మీకే తెలుస్తుంది. సరేనా!

‘మనం ఎంత బరువున్న రాయిని కదల్చగలం..?’ - కిలో, రెండు కిలోలైతే తేలిగ్గా కదిలిస్తాం. అయిదు కిలోల రాయైతే కాస్త కష్టమవుతుంది. పదికిలోలైతే ఇంకా కష్టమవుతుంది. ఇరవై కిలోల రాయైతే పెద్దవారు కదిలించగలరేమో కానీ, మనలాంటి బుజ్జాయిల వల్ల అయితే అస్సలు కాదు. మరి ఓ వంద కిలోల రాయైతే... అసలు పెద్దవాళ్లు కూడా కదిలించలేరు. కానీ కొన్ని టన్నుల బరువున్న రాయిని మాత్రం ఎంచక్కా కదిలించవచ్చు.

అడవి ఒడిలో...

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా టన్నుల బరువున్న రాయి అంటే మామూలు విషయం కాదు. నిజానికి దాన్ని కదిలించడం ఏనుగుల వల్ల కూడా కాదు. కానీ, ఫ్రాన్స్‌లోని హ్యూల్‌గోట్‌ అనే అడవిలో ట్రెంబ్లింగ్‌ స్టోన్‌ను మామూలు మనుషులే కదిలించవచ్చు. అన్నట్లు దీని బరువెంతో తెలుసా.. సుమారు 132 టన్నులు.

ఎలా సాధ్యమంటే...

అన్నేసి టన్నులున్న రాయిని సాధారణ మనుషులు ఎలాంటి యంత్రాల సాయం లేకుండానే సులువుగా కదిలించొచ్చు.నిజానికి ఇదో అద్భుతం. కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. దీన్ని నిర్దిష్ట దిశ నుంచి కదిలించినప్పుడు మాత్రమే ఇది కదులుతుంది. ఈ ట్రెంబ్లింగ్‌ స్టోన్‌ చదునుగా ఉన్న మరో రాయి మీద ఉంటుంది. ఒక మూల నుంచి కదిపితే కిందకు, పైకి ఊగుతుందా రాయి. ఈ వింతను చూడ్డానికి దేశవిదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడకు వస్తున్నారు. హమ్మయ్య.. మనం అక్కడికి వెళ్లలేకపోయినా... ఈ విడ్డూరం గురించైతే తెలుసుకున్నాం. మొత్తానికి ట్రెంబ్లింగ్‌ స్టోన్‌ సంగతులు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని