century egg: రత్నం కాదు.. గుడ్డే!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం బడికి తీసుకెళ్లిన లంచ్‌ బాక్స్‌ని తినకుండా ఇంటికి తీసుకొస్తే అమ్మ కోప్పడుతుందనే భయంతో.. ఎలాగోలా ఖాళీ చేసేస్తాం కదా! కానీ, ఓ అక్క మాత్రం బ్యాగు జేబులో పెట్టిన ఓ పదార్థాన్ని మర్చిపోయి అలాగే ఇంటికి తీసుకొచ్చింది.

Updated : 06 Apr 2023 07:41 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనం బడికి తీసుకెళ్లిన లంచ్‌ బాక్స్‌ని తినకుండా ఇంటికి తీసుకొస్తే అమ్మ కోప్పడుతుందనే భయంతో.. ఎలాగోలా ఖాళీ చేసేస్తాం కదా! కానీ, ఓ అక్క మాత్రం బ్యాగు జేబులో పెట్టిన ఓ పదార్థాన్ని మర్చిపోయి అలాగే ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. గబగబా ఇది చదివేయండి మరి..

చైనాకు చెందిన ఫు చుగ్‌ అనే అక్క.. తన స్కూల్‌ బ్యాగ్‌లో మర్చిపోయిన ఓ ఉడకబెట్టిన గుడ్డు.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా రెండ్రోజులకే పాడైపోవాల్సిన గుడ్డును జాగ్రత్తగా భద్రపరచడంతో అది ఇప్పుడు ఓ విలువైన రాయి మాదిరి కనిపిస్తోంది. దాన్ని చూసినవారంతా ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

సెంచురీ ఎగ్‌..

ఆ అక్క బడికి వెళ్లే రోజుల్లో ఒకరోజు వాళ్ల అమ్మ తన బ్యాగ్‌ జేబులో ఉడకబెట్టిన గుడ్డును స్నాక్స్‌లా పెట్టింది. కానీ, ఆ అక్క మాత్రం దాన్ని తినడం మర్చిపోయింది. మూడు రోజులపాటు ఆ బ్యాగ్‌లోనే ఉండిపోయింది. తర్వాత చూసినా.. బాగానే ఉన్నా కానీ, దాన్ని తినే ధైర్యం చేయలేదు. అలాగనీ బయట కూడా పడేయలేదు. దాన్ని ‘సెంచురీ ఎగ్‌’లా మార్చాలనుకున్నారా తల్లీకూతుళ్లు. అంటే.. చైనాలో ప్రత్యేక పద్ధతుల ద్వారా ఉడకబెట్టిన బాతు, కోడి గుడ్లను.. కొన్ని నెలలు, సంవత్సరాలపాటు నిల్వ చేస్తారన్నమాట. దీనికోసం మట్టి, బూడిద, నిమ్మకాయలు, ఉప్పు వాడుతుంటారు. ఈ సెంచురీ ఎగ్స్‌ను కొన్ని ప్రత్యేక వంటకాల్లో వినియోగిస్తారు. అక్కడ ఈ పద్ధతి దాదాపు 600 సంవత్సరాల క్రితం నుంచే ఉందట. అలాగే, ఈ తల్లీకూతుళ్లు కూడా ఆ గుడ్డును ఫ్రిజ్‌లో భద్రపరిచి మర్చిపోయారు.

క్షణాల్లోనే....

కొన్ని నెలల తర్వాత చుగ్‌ అక్క వాళ్ల అమ్మ ఫ్రిజ్‌లో దేనికోసమో వెతుకుతుంటే.. భద్రపరిచిన గుడ్డు కనిపించిందట. అప్పటికే అది ముదురు ఎరుపు రంగులోకి మారింది. దాన్ని అక్కడి నుంచి తీసి.. ఓ జువెల్లరీ డబ్బాలో పెట్టేసిందట. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇటీవల ఇల్లు సర్దుతుండగా.. బీరువాలోని జువెల్లరీ డబ్బాలో దాచిన గుడ్డు కనిపించింది. అప్పటికే అది పైన పగుళ్లతో ఓ రబ్బరు బంతిలా మారిపోయిందట. విలువైన జాతి రత్నంలా కనిపిస్తున్న ఆ గుడ్డు ఫొటోను ఆమె చైనా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. క్షణాల్లోనే అది అంతటా వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘సెంచురీ ఎగ్‌’ విధానం గురించి తెలియని కొందరేమో ‘అసలు ఇన్ని రోజులు కుళ్లిపోకుండా ఎలా ఉంటుంది?’ అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని