వామ్మో... ఎంత పే..ద్ద పిజ్జానో!

దోశలా గుండ్రంగా ఉంటుంది...ఊతప్పంలా మందంగా ఉంటుంది..కాస్త ఆమ్లెట్‌లా కూడా కనిపిస్తుంది!!

Published : 09 Apr 2023 01:21 IST

దోశలా గుండ్రంగా ఉంటుంది...
ఊతప్పంలా మందంగా ఉంటుంది..
కాస్త ఆమ్లెట్‌లా కూడా కనిపిస్తుంది!!
చతురస్రాకార డబ్బాలో వస్తుంది...
త్రిభుజాకారంలో కత్తిరించుకు తింటారు...
మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది...
ఇదంతా పిజ్జా గురించి అని...
కానీ ఇది అలాంటి.. ఇలాంటి..
పిజ్జా కాదు! దీనికో ప్రత్యేకత ఉంది..
మరి దాని విశేషాలేంటో తెలుసుకుందామా!

అమెరికాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌ వాళ్లు ఇటీవలే ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జాను తయారు చేశారు. లాస్‌ ఏంజిల్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అందుకు వేదికగా నిలిచింది. న్యూయార్క్‌ స్టైల్‌ పిజ్జాగా పేరున్న దీని తయారీకి సుమారు ఆరువేల కిలోల పిండి అవసరమైంది. ఇంకా రెండువేల రెండువందల కిలోల మారినారా సాస్‌, నాలుగువేల కిలోల చీజ్‌, ఏకంగా 6,30,496 పెప్పరోని ముక్కలను వాడారు.

భలే.. భలే.. బాహుబలే!

వేల కిలోల పదార్థాలు వాడిన తర్వాత ఈ పిజ్జా  కూడా భారీ ఆకారంలో తయారైంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 13,990 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది. ఈ పిజ్జా తయారీలో యూట్యూబ్‌ స్టార్‌ ఎరిక్‌ డెక్కర్‌ తన సహాయ సహకారాలు అందించారు.

ఎంచక్కా... రికార్డుల్లోకి...

ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు ఇంతపెద్ద పిజ్జా తయారు చేయలేదు కాబట్టి, ఇది ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. ఇంతకు ముందు ఈ రికార్డు 2012లో ఇటలీలోని రోమ్‌లో నమోదైంది. అప్పుడు ఆ పిజ్జాను దాదాపు 13,580 చదరపు అడుగుల కొలతతో తయారు చేశారు. తాజాగా లాస్‌ఏంజిల్స్‌ పిజ్జా గత రికార్డును బద్దలు కొట్టిందన్నమాట. రికార్డు నమోదైన తర్వాత పిజ్జాను లాస్‌ఏంజిల్స్‌లోని స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా పంపిణీ చేశారట. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ప్రపంచంలోనే అతిపెద్ద పిజ్జా విశేషాలు. మీరు మాత్రం పిజ్జాలు, బర్గర్‌లు ఎక్కుగా తినకండి. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు.. సరేనా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని