రెక్కల హరివిల్లు.. నమ్మలేవు మన కళ్లు!

‘ప్రపంచంలోకెల్లా అతిచిన్న పక్షి ఏది?’ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం వెంటనే.... ‘హమ్మింగ్‌ బర్డ్‌’ అని చెబుతాం.

Published : 10 Apr 2023 00:12 IST

‘ప్రపంచంలోకెల్లా అతిచిన్న పక్షి ఏది?’ అని మనల్ని ఎవరైనా అడిగితే మనం వెంటనే.... ‘హమ్మింగ్‌ బర్డ్‌’ అని చెబుతాం. ‘ఇది రంగులు మార్చగలదా?’ అని అడిగారనుకోండి. ముందు ఆశ్చర్యపోతాం. కాసేపటికి తేరుకుని ‘లేదు మార్చదు’ అని చెబుతాం. కానీ ఈ జవాబు తప్పు. సరైన సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం చదివేయండి మరి.

అవును హమ్మింగ్‌ బర్డ్స్‌ రంగులు మార్చగలవు. కానీ అన్నీ కాదు. వీటిలో అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్స్‌ అనే రకానికి చెందినవి మాత్రమే రంగులు మార్చగలవు. అదీ ఊసరవెల్లికన్నా వేగంగా... కేవలం సెకన్లలోనే. కానీ తల, గొంతు దగ్గర ఉన్న ఈకల రంగే మారుతుంది. ఈ పక్షులు ఉత్తర అమెరికాలో మాత్రమే జీవిస్తాయి. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఇవి కనిపించవు. ఈ అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్స్‌కు సురకావ్‌ అనే మరో పేరు కూడా ఉంది.

తల తిప్పినప్పుడల్లా...!

బొటనవేలంతే ఉండే ఈ బుజ్జి అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్‌ నిజానికి రంగులు మార్చదు. కానీ దాని తల దగ్గర ఉన్న ఈకల మీద పడ్డ కాంతి పలు కోణాల్లో పరావర్తనం చెందినప్పుడు ఇలా రంగులు మారినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇతర హమ్మింగ్‌ బర్డ్స్‌లో ఈ లక్షణం ఉండదు. కేవలం వీటిలో మాత్రమే ఈ ప్రత్యేకత కనిపిస్తుంది.

రంగులే రంగులు...

అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్‌ తల తిప్పినప్పుడల్లా ఫ్లోరొసెంట్‌ ఎరుపు, గులాబీ, నలుపు రంగులు కనిపిస్తాయి. మన వీక్షణ కోణం మారుతున్న కొద్దీ రంగులు కూడా మారుతున్నట్లు కనిపిస్తాయి. ఈ అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్స్‌ అచ్చం రెక్కలున్న హరివిల్లుల్లా మన కంటికి కనిపిస్తాయి. ఈ పక్షికి తల దగ్గర ఉండే ఈకల్లోని నానోస్కేల్‌ నిర్మాణాల నుంచి కాంతి పరావర్తనం చెందడం వల్లే ఇలా రంగులు మారుతున్నట్లు మనకు కనిపిస్తుంది. నిజానికి ఈ హమ్మింగ్‌ బర్డ్‌లు స్థిరంగా ఎక్కువ సమయం ఒక చోట ఉండలేవు. వేగంగా రెక్కలు ఆడిస్తూ తిరుగుతుంటాయి. అందుకే వీటిని ఫొటోలు, వీడియోలు తీయడం కాస్త కష్టంతో కూడుకున్న పని. కానీ కొంతకాలం క్రితం సోషల్‌ మీడియాలో ఈ పక్షి రంగులు మార్చే వీడియో ఒకటి తెగ వైరల్‌ అయింది. అప్పుడే చాలా మందికి ఈ అన్నాస్‌ హమ్మింగ్‌ బర్డ్‌ గురించి తెలిసింది. నేస్తాలూ... మొత్తానికి ఇవీ ఈ బుజ్జి పక్షి విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని