మ్యావ్‌.. మ్యావ్‌.. ఇదో బడి!

హాయ్‌ నేస్తాలూ! ఈ భవనం చూడ్డానికి అచ్చం పిల్లిలా భలే ఉంది కదూ! నిజానికి ఇదో స్కూలు. ఇంతకీ ఇది ఎక్కడుంది. ఎందుకు ఇలా కట్టారో తెలుసుకుందామా.

Published : 14 Apr 2023 00:43 IST

హాయ్‌ నేస్తాలూ! ఈ భవనం చూడ్డానికి అచ్చం పిల్లిలా భలే ఉంది కదూ! నిజానికి ఇదో స్కూలు. ఇంతకీ ఇది ఎక్కడుంది. ఎందుకు ఇలా కట్టారో తెలుసుకుందామా. అయితే ఎందుకు ఆలస్యం. ఈ కథనం చదవండి.

ముద్దొచ్చే తెల్లపిల్లిలా ఉన్న ఈ స్కూలు పేరు కిండర్‌గార్టెన్‌ డైకాట్జే. దీన్ని కొన్ని సంవత్సరాల క్రితం జర్మనీలోని కార్ల్స్‌రూహ్‌కు దగ్గర్లోని వోల్ఫార్ట్‌స్వీయర్‌ గ్రామంలో నిర్మించారు. దీన్ని టోమీ ఉంగెరెర్‌ అనే అంకుల్‌ డిజైన్‌ చేశారు. ఐలా సుజాన్‌ యెండెల్‌ అనే ఆర్కిటెక్ట్‌ రూపం ఇచ్చారు. పిల్లలు ఉత్సాహంగా బడికి రావడానికే భవనాన్ని ఇలా నిర్మించారు. ప్రవేశద్వారాన్ని పిల్లి నోరులా డిజైన్‌ చేశారు. తోకనేమో జారుడుబల్లలా మలిచారు.

‘వంద’నం!

ఈ బుజ్జి బడిలో వంద మంది పిల్లలు ఎంచక్కా ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు. ఈ స్కూలు భవనం పిల్లలను ఆకర్షించేలా రూపొందించారు. చెవులు నిటారుగా పెట్టి, దూకడానికి సిద్ధంగా ఉన్న పిల్లిలా ఉండేలా చూశారు. వృత్తాకారంలో ఉన్న కిటికీలను కళ్లలా తీర్చిదిద్దారు. ఈ భవనం లోపల తరగతి గదులు, వంటగది, భోజనాల గది కూడా ఉంది. నేస్తాలూ మొత్తానికి ఈ మ్యావ్‌.. మ్యావ్‌... బడి భలే ఉంది కదూ!


బాబాయ్‌ హోటల్‌ కాదు భౌ.. భౌ.. హోటల్‌ ఇది!

ఫ్రెండ్స్‌.. ఒక పెద్ద కుక్క, చిన్న కుక్కపిల్ల నిల్చున్నట్లున్న  ఈ నిర్మాణానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. అమ్మో.. ఆశ, దోశ, అప్పడం, వడ.. అన్నీ ఇక్కడే చెప్పేస్తే ఎలా.. మీరే ఈ కథనంలో చదివేయండి సరేనా...

అమెరికాలోని కాటన్‌వుడ్‌లో ఉన్న ఈ భవనానికి ‘డాగ్‌ బార్క్‌ పార్క్‌’ అని పేరు. దీనిలో ఓ హోటల్‌ నడుస్తోంది. దీన్ని అప్పట్లోనే కుక్క ఆకారంలో నిర్మించారు.. ఇందులో డబుల్‌ బెడ్‌రూంలు, అల్పాహార శాల ఉంటాయి.

రెండతస్తుల్లో...

ఈ డాగ్‌ బార్క్‌ పార్క్‌ను డెన్నీస్‌, ప్రాన్సెస్‌ కాంక్లిన్‌ అనే ఇద్దరు దాదాపు 20 సంవత్సరాల క్రితమే  నిర్మించారు. ఇది ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది. అప్పుడున్న టెక్నాలజీతోనే ఇంత వినూత్నంగా భవంతిని నిర్మించడం నిజంగా గ్రేట్‌ కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని