అద్భుతం.. ఈ రైలు ప్రయాణం!

స్విట్జర్లాండ్‌ అనగానే పెద్ద పెద్ద మంచు పర్వతాలు, ప్రకృతి అందాలు గుర్తుకొస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఆ దేశానికి వెళ్తుంటారు.

Published : 15 Apr 2023 00:46 IST

హలో ఫ్రెండ్స్‌.. మనకు రైలు ప్రయాణాలంటే భలే సరదా కదూ! అయితే, ఇప్పుడు మనం ఒక రైల్వే స్టేషన్‌ విశేషాల గురించి తెలుసుకుందాం. మన పేజీలోకి వచ్చిదంటే.. అది మామూలు స్టేషన్‌ అయి ఉండదు కదా! ఆ సంగతులేంటో గబగబా చదివేయండి మరి..

స్విట్జర్లాండ్‌ అనగానే పెద్ద పెద్ద మంచు పర్వతాలు, ప్రకృతి అందాలు గుర్తుకొస్తాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఆ దేశానికి వెళ్తుంటారు. అయితే, అక్కడి ఆల్ఫ్స్‌ పర్వతాలపైనున్న ‘జంగ్‌ఫ్రాజోచ్‌’ అనే రైల్వే స్టేషన్‌ యూరప్‌లోనే అత్యంత ఎత్తయినది. అంతేకాదు.. దీన్నో ఇంజినీరింగ్‌ అద్భుతంగానూ చెబుతుంటారు. జంగ్‌ఫ్రా, మోంచ్‌ అనే రెండు పర్వతాల్లో కొంత భాగాన్ని తొలచి మరీ దీన్ని నిర్మించారు.  

అసాధ్యం అనుకున్నారు కానీ..

మొదటగా 1862లో పర్వతారోణ చేసుకుంటూ ఓ వ్యక్తి జంగ్‌ఫ్రాజోచ్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ను చూసి, ఆంగ్లో-స్విస్‌ బృందం కూడా అతికష్టమ్మీద అక్కడికి వెళ్లింది. అప్పట్లోనే అదో రికార్డు. కొన్ని దశాబ్దాల అనంతరం జంగ్‌ఫ్రాజోచ్‌ వద్ద ఓ రైల్వే స్టేషన్‌ను నిర్మించాలని స్విస్‌ వ్యాపారవేత్త అడాల్ఫ్‌ అనుకున్నారు. ఇంజినీర్లతో కలిసి అందుకో ప్రణాళిక కూడా రూపొందించారు. దాని గురించి తెలిసి, మొదట అందరూ అది సాధ్యమయ్యే పని కాదనే అనుకున్నారు. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో.. దాదాపు 16 ఏళ్లపాటు పనులు నిర్వహించారు. వందలాది మంది కార్మికులు దీనికోసం అహర్నిశలు కష్టపడ్డారట.

అరగంట ప్రయాణం

ఎన్నో వ్యవప్రయాసల అనంతరం 1912లో రైల్వేస్టేషన్‌ నిర్మాణం పూర్తి అయింది. తొలుత పేపర్‌పైన ప్లాన్‌ గీసి చూపినప్పుడు.. ఎవరూ నమ్మని అంశాన్ని.. ఎట్టకేలకు విజయవంతం చేసి చూపించారా వ్యాపారి. ఇక అప్పటినుంచి ఆ స్టేషన్‌ నిరంతరాయంగా పని చేస్తూనే ఉంది. పర్వతాల కిందనున్న అంటే.. సముద్రమట్టానికి 2060 మీటర్ల ఎత్తులో ఉన్న స్టేషన్‌లో రైలు ఎక్కితే, కేవలం 30 నిమిషాల్లోనే 9.3 కిలోమీటర్లు ప్రయాణించి.. 3454 మీటర్ల ఎత్తులో ఉన్న జంగ్‌ఫ్రాజోచ్‌కు చేరుకోవచ్చు. అర గంట ప్రయాణమే అయినా.. అద్దాల కిటికీలున్న రైలు నుంచి ఆల్ఫ్స్‌ పర్వతాల అందాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవట. ఈ ట్రాక్‌ నిర్మాణానికి కొండలను, పెద్ద పెద్ద బండలను తొలగించి.. సొరంగాలను తవ్వాల్సి వచ్చింది.

నిమిషాల వ్యవధిలో..

యూరప్‌లోని అత్యంత ఎత్తయిన ఈ స్టేషన్‌కు చేరుకోవడమంటే మాటలు కాదు కదా! అందుకే, ఆ కాసేపటి ప్రయాణానికే ఒక్కో టికెట్‌ ధర రూ.20 వేల వరకూ ఉంటుంది. అయినా, ఖర్చుకు వెనకాడకుండా పర్యాటకులు ఈ పర్వతాల అందాలను సందర్శించే వెళ్తుంటారట. ఇంకో విషయం ఏంటంటే.. ఇక్కడి వాతావరణం కూడా నిమిషాల వ్యవధిలోనే మారిపోతుంది. నేస్తాలూ.. ఈ స్టేషన్‌ విశేషాలు భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని