ఆకులో ఆకునై...ఏమార్చే ఎండుటాకునై!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! మీకు సీతాకోకచిలుకలంటే భలే ఇష్టం కదూ! అయినా నచ్చనివారు ఎవరుంటారు నేస్తాలూ! అవి రంగురంగుల రెక్కలతో హరివిల్లులా కనువిందు చేస్తాయి కదా!

Published : 16 Apr 2023 00:19 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! మీకు సీతాకోకచిలుకలంటే భలే ఇష్టం కదూ! అయినా నచ్చనివారు ఎవరుంటారు నేస్తాలూ! అవి రంగురంగుల రెక్కలతో హరివిల్లులా కనువిందు చేస్తాయి కదా! కానీ కొన్ని మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అచ్చం ఎండిన ఆకుల్లా కనిపిస్తూ ఏమారుస్తాయి. అంతలోనే రెక్కలు విచ్చుకొని, తన రంగులు చూపిస్తూ మైమరిపిస్తాయి. మరి ఆ ప్రత్యేక సీతాకోకచిలుకల గురించి తెలుసుకుందామా!

రెంజ్‌ ఓక్లీఫ్‌, కల్లిమా ఇనాచస్‌, ఇండియన్‌ ఓక్లీఫ్‌, డెడ్‌లీఫ్‌... కంగారు పడకండి. ఇవన్నీ ఈ సీతాకోకచిలుక పేర్లు. ఇవి ఆసియా ఖండంలో ఎక్కువగా కనిపిస్తాయి. భారతదేశంలోనూ వీటి ఉనికి ఉంది.

రెక్కలు విప్పితేనే.....

ఈ సీతాకోకచిలుక రెక్కలు ముడుచుకొని ఉన్నప్పుడు అచ్చం ఎండిన ఆకులానే ఉంటుంది. రెక్కలు విప్పినప్పుడు మాత్రమే మనకు రంగులు కనిపించి, అది సీతాకోక చిలుక అని తెలుస్తుంది. వీటిలో ఆడవి, మగవి దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ఆడ సీతాకోకచిలుకలు కాస్త పెద్ద రెక్కలతో ఉంటాయి. ఈ డెడ్‌లీఫ్‌ సీతాకోకచిలుకల రెక్కలు 85 నుంచి 110 మిల్లీమీటర్ల వరకు ఉంటాయి.

ఆసియాలో ఆవాసం...

ఈ సీతాకోకచిలుకలు నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, థాయిలాండ్‌, తైవాన్‌, వియత్నాం, పాకిస్థాన్‌లో కనిపిస్తాయి. మనదేశంలో ఇవి జమ్మూకశ్మీర్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో జీవిస్తాయి.

కొండల్లో.. కోనల్లో...

ఈ డెడ్‌లీఫ్‌ సీతాకోకచిలుకలు ఎత్తైన కొండ ప్రాంతాల్లో, దట్టమైన అడవుల్లో నివసించడానికి ఇష్టపడతాయి. ఇవి చక్కగా, చాలా ఎత్తు వరకు ఎగరగలవు. మిగతా సీతాకోకచిలుకలతో పోల్చుకుంటే వీటి వేగం కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు.

భలే బురిడీ కొట్టిస్తుంది!

పక్షులు, సాలీళ్లు, కందిరీగలు వీటికి ప్రధాన శత్రువులు. అవి దాడి చేసేటప్పుడు ఈ సీతాకోకచిలుకలు ఉన్నట్లుండి తమ రెక్కలు ముడుచుకొని నేల మీద వాలిపోయి, గప్‌చుప్‌గా ఉండిపోతాయి. అప్పుడిక వీటిని గుర్తించడం దాదాపు అసాధ్యం. శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ ప్రాణికి ప్రకృతి ఇచ్చిన వరమే ఈ ఎండుటాకును పోలిన రెక్కలు. నేస్తాలూ! మొత్తానికి ఇవీ డెడ్‌లీఫ్‌ సీతాకోకచిలుక విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని